మంచిర్యాల: భార్యను కానిస్టేబుల్ వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో జరిగింది. తల్లిదండ్రులు, పిల్లలను క్షమించమని లేఖలో రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 15 సంవత్సరాల క్రితం సుద్దాల గ్రామానికి చెందిన క్రిష్టయ్య, నస్పూర్‌కు చెందిన వనితకు వివాహం జరిగింది. కుమ్రుంభీం ఆసిఫాబాద్ తిర్యాణి పోలీస్ స్టేషన్‌లో క్రిష్టయ్య హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. నాగార్జున కాలనీ సింగరేణి క్వార్టర్స్‌లో తన ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు నివసిస్తున్నారు. ప్రతి రోజు ఆమెను అతడు వేధింపులకు గురి చేసేవాడు. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకపోయింది. అతడి వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేనిప్పుడు ఆమె ఉరేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాసింది. తన భర్త పెద్ద సైకో అని, ఎప్పుడు ప్రేమగా చూడలేదని, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చాలు అవమానించేవాడని, అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ లెటర్‌లో పేర్కొంది. తన పిల్లలను భర్త వద్దకు పంపించవద్దని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు తెలిపింది.