మనతెలంగాణ/హైదరాబాద్ : ఆర్టీసి సంస్థకు కానిస్టేబుళ్లు కళ్లు, చెవుల లాంటి వారని, కొత్తగా విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేయాలని టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌లో ఆదివారం టిఎస్‌ఆర్టీసికి చెందిన 166 మంది కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, విశిష్ట అతిథిగా సంస్థ ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్‌లు హాజరయ్యారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుంచి వారు గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు చేసిన ఏరోబిక్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కారుణ్య నియామకం ద్వారా టిఎస్ ఆర్టీసిలో ఇటీవల 166 మంది కానిస్టేబుళ్లుగా నియమితులయ్యారు. వారిలో 107 మంది పురుషులు, 57 మంది మహిళలు ఉన్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ 8వ బెటాలియన్‌లో పోలీస్ శాఖ సహకారంతో 166 మందికి ఒక నెల శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం విజయవంతంగా వారంతా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరనున్నారు.
ఆర్టీసి లాభాల పట్టేలా చూడాలి: చైర్మన్
కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ కానిస్టేబుళ్లు తమ కర్తవ్యాన్ని విస్మరించొద్దని, తప్పు చేస్తే చర్యలు తప్పవన్నారు. టిఎస్ ఆర్టీసి కానిస్టేబుల్ ఉద్యోగం ఈజీ కాదని, క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన సూచించారు. సంస్థలోని 50 వేల మంది సిబ్బందిని, బస్సులను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందన్న విషయం మరచిపోవద్దన్నారు. రాబోయే కాలంలో ఆర్టీసిని ఇంకా ముందుకు తీసుకుపోయి లాభాల బాట పడేలా చూడాలని ఆయన సూచించారు. గతేడాదిగా వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నామని ఆయన చెప్పారు. కొత్త బస్సులను కొనుగోలు చేస్తూనే నియామకాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
2014 నుంచి కారుణ్య నియామకాల కింద 1,606 మందికి: ఎండి
టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ మాట్లాడుతూ కొత్తగా 166 మంది కానిస్టేబుళ్లు టిఎస్ ఆర్టీసిలో చేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందులో మూడో వంతు 57 మంది మహిళలు ఉండటం శుభపరిణామన్నారు. ఈ కొత్త రక్తంతో సంస్థ మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణలో మాదిరిగానే నిబద్ధతతో విధులు నిర్వహించాలని కానిస్టేబుళ్లకు ఆయన సూచించారు. 2014 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద 1,606 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎండి తెలిపారు.
సంస్థలో కానిస్టేబుల్స్ బాధ్యత ఎంతో కీలకమని, చిత్తశుద్ధితోపని చేస్తూ సంస్థ అభ్యున్నతికై తోడ్పాటునందించాలన్నారు. టిఎస్ ఆర్టీసి వృద్ధి కోసం 50 వేల మంది సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో మీరు కూడా భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక నెలలో సమర్థవంతంగా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చిన టిఎస్‌ఎస్పీ అదనపు డిజిపి స్వాతి లక్రాకు, కొండాపూర్ 8 వ బెటాలియన్ కమాండెంట్ మురళి కృష్ణకు ఈ సందర్భంగా ఎండి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన సృజన్ (బెస్ట్ ఆల్ రౌండర్), రమాదేవి(బెస్ట్ ఇండోర్), పూజిత, సాయి కిరణ్ (బెస్ట్ ఔట్ డోర్)లకు ట్రోఫీలను అందజేశారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో టిఎస్ ఆర్టీసి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, సిపిఎం కృష్ణకాంత్, 8వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ,అదనపు కమిషనర్లు గంగారాం, నరేందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.