Monday, December 23, 2024

వర్ణ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

భారత దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నిర్మాణం నిచ్చెన మెట్ల వర్ణ కుల వ్యవస్థతోనే రూపొందించబడింది. ఈ వ్యవస్థలలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, అంటరానితనం పెరగడానికి ప్రధాన కారణం ఈ వ్యవస్థను నిర్మూలించకపోవడం. పురుష, బ్రాహ్మణుల ఆధిపత్యంలో కొనసాగిన భారత రాజ్యాంగ నిర్మాణ సభ వీటి నిర్మూలన గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల ఆధిపత్యం అన్ని రంగాల్లో శాశ్వతంగా కొనసాగాలంటే వర్ణ కుల వ్యవస్థ పగడ్బందీగా కొనసాగాలి. అంటరానితనానికి అన్ని అసమానతలకు మూల కారణమైన వీటి నిర్మూలన జోలికి వెళ్ళకుండా, కేవలం భారత రాజ్యాంగ అధికరణ 17 ద్వారా భారత రాజ్యాంగ నిర్మాణ సభ అంటరానితనం నిర్మూలనను మాత్రమే ఆమోదించింది తప్ప, దానికి ప్రధాన కారణమైన వర్ణకుల వ్యవస్థను నిర్మూలించ లేదు. వర్ణకుల వ్యవస్థ మూలాలు విదేశీ, ఆర్యవర్ణ, హైందవ సిద్ధాంతంలోనే ఉన్నాయి. దీన్నే బ్రాహ్మణులు హిందుత్వ సిద్ధాంతంగా ప్రచారం చేస్తున్నారు.

నిజానికి త్రివర్ణాలు హిందువులు కాదు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం హిందూయిజం అంటే భారతీయుల జీవన విధానం, అది మతం కాదు. భారత భూభాగంలో నివసించే అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు అన్ని వర్గాల సమూహం వారి సంస్కృతి, సాంప్రదాయాల సమ్మేళనమే హిందూ జీవన విధానమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. సింధూ నదీ నాగరికత పరివాహక ప్రాంత ప్రజలే హిందువులని, సింధూ పదం నుండే హిందూ పదం వచ్చిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే విదేశీ ఆర్య బ్రాహ్మణులు చెబుతున్న హైందర ధర్మానికి, హిందూ ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. సింధూ హరప్ప నాగరికత అంతా ఈ దేశ మూలవాసులైన ద్రవిడులదే. ప్రకృతి ఆరాధకులు పశు పాలకుడైన శైవ సంస్కృతి వర్ణకుల వ్యవస్థ లేని మాతృస్వామిక విలువలతో కూడిన శాస్త్రీయమైన సహజ ప్రక్రియ స్త్రీ పురుష కలయిక ద్వారా ఏర్పడే మానవుల జన్మ దాన్నే అంగము, లింగము సిద్ధాంతం అంటారు.

అలాగే అర్ధనారీశ్వరుడైన శివుడు స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకున్నాడు. అంతేకాకుండా వ్యక్తిగత ఆస్తి అవసరం లేదని, సమాధుల దగ్గరనే తన జీవితాన్ని కొనసాగించాడు. అట్లాంటి శాస్త్రీయమైన మానవతా విలువలు కలిగిన మాతృస్వామిక శైవ సిద్ధాంతానికి విరుద్ధంగా అశాస్త్రీయమైన పురుష ఆధిపత్య సిద్ధాంతమైన పురుష సూక్తం ద్వారా వర్ణాశ్రమ ధర్మానికి పురుషాధిపత్య కుల వ్యవస్థ దురహంకారానికి అంటరానితనం అసమానతలతో కూడిన వర్ణాశ్రమ కుల ధర్మానికి, సమానత్వ బౌద్ధ ధర్మానికి మధ్య జరిగిన యుద్ధమే విప్లవం, ప్రతఘాత విప్లవం అనే తన పుస్తకంలో డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ సంపూర్ణంగా వివరించడమే కాకుండా తన సమానత్వ సిద్ధాంత గ్రంథమైన వర్ణకుల నిర్మూలన (Anihilation of Caste) గ్రంథం ద్వారా తన సైద్ధాంతిక పునాదిని ప్రపంచానికి అందించాడు. అయితే సమతా విలువలు కలిగిన సింధూ హరప్ప (హర అంటే శివుడు, అప్పా అంటే తండ్రి) నాగరికత దక్షణాది ద్రవిడ సిద్ధాంతానికి మూలం.

దీనికి పూర్తి విరుద్ధమైన పురుష సూక్తంపై ఆధారపడిన ఆర్యత్రివర్ణ బ్రాహ్మణ కులాధిపత్య సిద్ధాంతమైన ఆర్య హైందత్వాన్ని హిందూయిజంగా బ్రాహ్మణులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అన్ని రంగాల్లో వారి ఆధిపత్యం, త్రివర్ణ కూటమి ఆధిపత్యం కొనసాగాలంటే ఈ దేశ మూలవాసులైన బహుజనుల ఆది హిందూ మతాన్ని తమ మతంగా చిత్రీకరించి పురాణాలు, ఇతిహాసాల ద్వారా బహుజనులపై సాంస్కృతిక, మానసిక దాడి చేసి వారిని త్రివర్ణ కూటమికి శాశ్వత బానిసలుగా తయారు చేశారు. హిందూ మతం ఈ దేశ మూలవాసులైన ద్రవిడ బహుజనులది, హిందూయిజానికి అసలైన వారసులు వీరే. బ్రాహ్మణుల కుట్రలను పసిగట్టడంలో విఫలమైన బహుజనులు తమ దేశం, తమ ధర్మం, తమ సంస్కృతి, సాంప్రదాయాలు తమ దేవీ దేవతలను మరచి విదేశీ ఆర్య బ్రాహ్మణ త్రివర్ణ కూటమి బహుజన నాయకులను, దేవీ దేవతలను రాక్షసులుగా, దాస్యులుగా ముద్ర వేసి ద్రావిడ బహుజనుల చేత వారు చనిపోయిన దినాలు సంబురాలు చేసుకునే విధం గా పండుగలను రూపొందింది.

అంటే మన దేవీ దేవతలపై, మన సాంప్రదాయాలపై, మన సంస్కృతిపై మనమే అసహ్యించుకునే విధంగా, మన వారిని మనమే కించపరచుకునే విధంగా పుక్కిటి పురాణాలు, ఇతిహాసాలు సృష్టించి ద్రవిడ బహుజనులను శాశ్వత సాంస్కృతిని మానసిక బానిసలుగా చేసిన ఫలితంగా అన్ని రంగాల్లో ఈ వర్గాలు వెనుకబడి ఉన్నాయి. వీరి వెనకబాటు తనానికి వర్ణ కుల వ్యవస్థే కారణం. వీటిపై తిరుగుబాటు చేయకుండా వర్ణకుల వ్యవస్థలో వీరిని శూద్ర వర్ణంగా చిత్రీకరించి, త్రివర్ణాలకు శాశ్వత సేవకులుగా మార్చి ద్రవిడ బహుజనులను బానిసలుగా తయారు చేసిన వర్ణ కుల వ్యవస్థ రద్దు కాకుండా వీరికి విముక్తి లేదు.మన దేశంలో ఆర్యహైందవ మతం లేదా బ్రాహ్మణ మతంపై తిరుగుబాటు చేసిన బౌద్ధం, జైనం, సిక్కు మతాలలో సైతం, విదేశీ మతాలైన ఇస్లాం, క్రైస్తవ, పార్శీ మతాలలో కూడా

ఈ త్రివర్ణాలే చొరబడి వాటిల్లో కూడా వీరి ఆధిపత్యమే కొనసాగుతున్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తెల్లవారి ఆధిపత్యంలో కొనసాగుతున్న ఈ మతాలు సైతం ఇక్కడి తెల్ల, ఆర్య, ఉత్తరాది ఆధిపత్య బ్రాహ్మణులతో మమేకమై ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ ఆర్య హైందవ సంస్కృతి సాంప్రదాయాల కారణంగా ఏర్పడిన వర్ణ కుల వ్యవస్థ దాని ఫలితంగా ఏర్పడిన అంటరానితనం, వివక్ష, అన్ని రంగాల్లో విస్తరించిన ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నల్లజాతి క్రింది కులాల వర్గాల ముస్లిం, క్రైస్తవులు వివక్షను అణచివేతను, అన్యాయాలను అన్ని రంగాల్లో ఎదుర్కొంటున్నారు.
అందుకే ప్రపంచంలో తెల్లవారి ఆధిపత్య దేశమైన అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్ధిరపడిన క్రైస్తవ, ముస్లిం, హిందూ ఇతర అన్ని మతాల్లోనూ తెల్లవారి ఆధిపత్యం అగ్రవర్ణాల ఆధిపత్యం సంపన్నుల దోపిడీ కొనసాగడానికి ఈ వర్ణ సిద్ధాంతమే కారణం. ఈ దేశంలో కుల వ్యవస్థ వాటి ద్వారా ఏర్పడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలు వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ద్రావిడ బహుజనులు ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలలో కుల వివక్ష వ్యతిరేక పోరాటాలు అటు సియాటెల్, ఇటు కాలిఫోర్నియా రాష్ట్రాలలో చట్టాలుగా రూపొందించే వరకు తమ ఉద్యమాలను కొనసాగిస్తున్నారు. అయితే కేవలం కుల వివక్షపోతే సరిపోదు, దానికి మూలమైన కుల వ్యవస్థ రద్దు కాకుండా త్రివర్ణ కూటమి శూద్ర, అగ్ర వర్ణాల ఆధిపత్యం అంతం కాకుండా భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న వర్ణ (రంగు) వివక్షకు కారణమైన వర్ణ వ్యవస్థ నిర్మూలన దానికి తోడు భారతదేశంలో

నాలుగు వర్ణాలతో పాటు వేలాది కులాలుగా భారత సమాజం విభజించబడి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దోపిడీకి కారణమవుతున్న వర్ణకుల వ్యవస్థల రద్దు అయ్యే వరకు అసమానతలు అంతరించిపోవు. భారత రాజ్యాంగంలోని అధికరణ 17ను సవరించి అంటరానితన నిర్మూలనకు బదులు దానికి మూలకారణమైన వర్ణ కుల వ్యవస్ధ నిర్మూలన పదాలను చేర్చి భారత దేశంలో ద్రవిడ బహుజనులను శాశ్వత బానిసత్వం నుండి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దోపిడీ నుండి కాపాడాల్సిన బాధ్యత భారత పాలకులపై ఉంది. త్రివర్ణ కూటమి, శూద్ర అగ్ర వర్ణాలే ఈ దేశాన్ని, రాష్ట్రాలను పాలిస్తున్నారు. కాబట్టి వారికి లబ్ధి చేకూరుస్తున్న ఈ వ్యవస్థను రద్దు చేయరు. కాబట్టి ఈ దేశంలో 85 శాతంగా ఉన్న ద్రావిడ బహుజనులు రాజ్యాధికారం చేపట్టి అటు కేంద్రంలోనూ, ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ వర్ణ కుల నిర్మూలన చట్టాలను రూపొందించి రాజ్యాంగ సవరణలతో పాటు అనేక విప్లవాత్మకమైన రాజ్యాంగ చట్ట సవరణలు చేసి సమతా భారత్ నిర్మాణం కోసం కృషి చేయాల్సిన బాధ్యత బహుజనులపై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News