ఇండియా కూటమి వస్తే చేసే పని అదే
లాలూ మాటల్లో వారి వ్యూహం బహిర్గతం
విరుచుకుపడిన బిజెపి
న్యూఢిల్లీ : ముస్లిం కోటాపై ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన పక్షంలో రాజ్యాంగం మౌలిక వ్యవస్థలో మార్పుల ద్వారా మైనారిటీ వర్గానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుందని స్పష్టం చేశాయని బిజెపి మంగళవారం ఆరోపించింది. ముస్లింలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పనకు తాను సుముఖమని ఆర్‌జెడి అధ్యక్షుడు ప్రకటించిన తరువాత ప్రతిపక్ష కూటమిపై బిజెపి ఆ ఆరోపణ చేసింది. బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ‘ముస్లింకు పూర్తిగా రిజర్వేషన్లు కల్పించనున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు.
‘ఆయన తన ప్రకటనలో వాడిన ‘పూరా కా పూరా’ పదం చాలా తీవ్రమైనది. ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిల వాటాలో నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని వారు (ఇండియా కూటమి) కోరుకుంటున్నట్లు అది స్పష్టం చేస్తున్నది’ అని అన్నారు. ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిల వాటాలో నుంచి ముస్లింలకు రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగాన్ని మార్చాలన్న ఇండియా కూటమి ప్లాన్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి వ్యక్తం చేస్తున్న అనుమానాలు లాలూ ప్రకటన బట్టి నిజమని తేలుతోందని త్రివేది చెప్పారు.
‘ఆర్‌జెడికి ముస్లింలే ప్రధానమని, యాదవ్‌లకు అంత ప్రాముఖ్యం లేదని కూడా ఆ ప్రకటన స్పష్టం చేస్తున్నది’ అని త్రివేది ఆరోపించారు. మతం ఆధారంగా రిజర్వేషన్ కల్పించరాదని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నదని బిజెపి అధికార ప్రతినిధి చెప్పారు. ‘ముస్లింలకు రిజర్వేషన్ కల్పన కోసం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చాలని వారు కోరుకుంటున్నారు’ అని ఆయన ఆరోపించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమిలోని పలువరు నేతలు చెబుతున్నారని త్రివేది తెలిపారు.