1950 జనవరి 26 న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశం రిపబ్లిక్‌గా అవతరించింది. నాటి నుండి ప్రభుత్వపరంగా రిపబ్లిక్ దినోత్సవాలు జరుగుతున్నాయి. అవి ప్రభుత్వ శాఖలు, సంస్థలకే పరిమితమై, ప్రజల భాగస్వామ్యం లేకుండా సాగిపోతున్నాయి. రాజ్యాంగం మనందరిదీ. మనకు మనమే సమర్పించుకున్న రాజ్యాంగం. ఈ రాజ్యాంగానికి మనమే యజమానులం. దేశంలో అత్యధిక సంఖ్యాకులు శ్రమజీవులు. పరిశ్రమలలో కార్మికులుగా, అసంఘటిత రంగ శ్రామికులుగా, వృత్తి సంఘాల సభ్యులుగా, వ్యవసాయకూలీలుగా, కౌలు రైతులుగా, స్వయంగా సాగు చేస్తున్న రైతులుగా పలు రంగాల్లో వున్నారు. అలాగే వివిధ రంగాల్లో సమాజానికి సేవలు అందిస్తున్న వారు వున్నారు. దేశ సంపద ఉత్పత్తిలో ఈ శ్రమజీవులే కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో అన్ని రంగాలకు శిరోధార్యంగా వున్న రాజ్యాంగ కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యం వుండి తీరాలి. అలాంటి భాగస్వామ్యాన్ని మనకు మనమే కల్పించుకోవాలి. ప్రజా రిపబ్లిక్ దినోత్సవం మనకోసం మనమే నిర్వహించుకోవాలి.
ఆర్ధిక రంగంలో సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న సకల రంగాల శ్రమజీవులు రాజకీయ రంగంలో కేవలం ఓటర్లు గానే మిగిలిపోకూడదు. రాజ్యాంగంమీద రాజకీయంగా జరుగుతున్న దాడిని రాజకీయంగా ప్రతిఘటించడానికి సిద్ధపడాలి. కేంద్రంలో అధికారంలో వున్న మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరిచి, దానిని మార్చడానికి అడుగులు వేస్తున్నది. మోడీ ఎలాంటి దాపరికం లేకుండా తనకు తాను హిందూ జాతీయవాదినని ప్రకటించుకున్నారు. మెజారిటీ జాతీయవాదానికి వీలుగా పౌరసత్వ చట్టాలను తెచ్చారు. మత విద్వేష రాజకీయాలు చేస్తున్నారు.
బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ బహిరంగంగానే రాజ్యాంగాన్ని సవాలు చేస్తున్నది. హిందూ రాష్ట్ర నినాదం త్వరలోనే సాకారం కానున్నదని ప్రకటించింది. భారత రాజ్యాంగం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ వైఖరి అందరికీ తెలిసిందే. రాజ్యాంగం ఆమోదించినప్పుడే వారు వ్యతిరేకించారు. ఇది అతుకుల బొంత రాజ్యాంగం అన్నారు. దీనిలో జాతీయత లేదన్నారు. అంతటితో సరిపెట్టుకో లేదు.
ప్రపంచ ప్రశంసలు పొందిన మనుధర్మశాస్త్రమే దేశానికి తగిన రాజ్యాంగం అని ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్నది రాజ్యాంగానికి, ఆర్‌ఎస్‌ఎస్ హిందూ రాష్ట్ర నినాదానికి మధ్య సంఘర్షణ. రాజ్యాంగాన్ని మట్టు పెట్టాలనే ఈ సంఘర్షణలో శ్రమజీవులు పాత్రధారులు కావాలి. ఆర్‌ఎస్‌ఎస్ హిందూ రాష్ట్ర నినాదం దేశాన్ని మత రాజ్యంగా మారుస్తుంది. మత రాజ్యాలలో రాజ్యాంగాలు వుండవు. మత గ్రంధాలే రాజ్యాంగం పాత్ర నిర్వహిస్తాయి. హిందూ రాష్ట్రలో మనుధర్మ శాస్త్రం రాజ్యాంగం అవుతుంది. శ్రమజీవులు పని విభజన అర్హతను బట్టి కాకుండా కులాలనుబట్టి నిర్ణయమవుతుంది. హిందూ రాష్ట్రలో శ్రమజీవులు శాశ్వతంగా కట్టుబానిసలౌతారు. కులవిభజన శ్రమజీవుల ఐక్యతకు భంగం కలిగిస్తుంది. మత రాజ్యాలలో ప్రజాస్వామ్యం వుండదు. పౌర హక్కులు వాటికి చట్టబద్ధత వుండదు.
శిక్షలు తప్పునుబట్టి కాకుండా కులాల ఆధారంగా వుంటాయి. మత రాజ్యాలలో ఓటు హక్కు, ఎన్నికలు వుండవు. నియంతలే వుంటారు ప్రస్తుతం ఓటు హక్కు వున్నందునే వివిధ పథకాలు పేరుతో రాజకీయం శ్రమజీవులను పట్టించుకోకతప్పడంలేదు. ప్రభుత్వాలను మార్చేశక్తి మన ఓటులో వుంది.
మత రాజ్యాలలో వివక్ష వుంటుంది. మైనారిటీ మతస్థులు సమాన హక్కులలేని రెండవ తరగతి పౌరులవుతారు. మహిళలు, దళితులు, బహుజనులపట్ల వివక్ష కొనసాగుతుంది. అందువల్ల శ్రమజీవులు సమైక్యంగా రాజ్యాంగ రక్షణకు పూనుకోవాలి. హిందూ రాష్ట్ర నినాదాన్ని రాజకీయంగా ఎదుర్కొనాలి. ఆర్‌ఎస్‌ఎస్ హిందూ రాష్ట్ర నినాదం దాడి నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో రాజ్యాంగ ఫలాలను దక్కించుకోడానికి తగిన విధంగా దానిని అమలు చేయించడానికి ఉద్యమించడమూ అంతే అవసరం. ఈ ఉద్యమానికి కూడా ప్రజా రిపబ్లిక్ దినోత్సవం వేదిక కావాలి. రాజ్యాంగం పీఠిక ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించాలని ప్రకటించింది. కాని సామాజిక రంగంలో కుల వివక్ష, మహిళల పట్ల వివక్ష, మైనారిటీల పట్ల వివక్ష నేటికీ కొనసాగుతున్నది. అమానుషమైన దాడులు, అత్యాచారాలు, హత్యాకాండ సాగిపోతున్నది.
వివక్ష వున్నచోట సమానత్వం వుండదు. ప్రజాస్వామ్య విలువలు వుండవు. సమాన అవకాశాలు వుండవు. శ్రమజీవులు వివక్షకు తావులేని ప్రజా రిపబ్లికన్ను సాధించుకోవాలి. రాజ్యాం గం అందరికీ ఆర్థిక న్యాయం జరగాలని ప్రకటించింది. దీనికి సమాజంలో అంతరాలు తగ్గాలి. అందరికీ అవకాశాలు లభించాలి. కాని గత 10 సంవత్సరాలలో అంతరాలు విపరీతంగా పెరిగాయి. 1 శాతం మంది కార్పొరేట్లు, బిలియనీర్ల దగ్గర 46 శాతం దేశ సంపద పోగుపడింది. 10 శాతం మంది దగ్గర 78 శాతం దేశసంపద గుట్టపడింది. ఈ కార్పొరేట్లకే కేంద్ర ప్రభుత్యం 20 లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు, రుణమాఫీలు ఇచ్చింది. 60 శాతంగా వున్న సామాన్యులు, పేదల దగ్గర కేవలం 5 శాతం సంపద మాత్రమే వుంది.
అత్యధిక ఆర్ధిక అంతరాలున్న దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో వుంది. దేశ ప్రజలకు ఆర్థిక న్యాయం అన్నది అర్థరహితంగా మారింది. సకల తరగతుల శ్రామికులు కేవలం నెల జీతగాళ్ళు, రోజువారీ కూలీలు మాత్రమే కాదు. వీరే సరుకులను, సంపదను, సేవలను సృష్టిస్తున్నారు. ఈ సంపదలో తగిన వాటా వారికి దక్కడం లేదు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం దేశసంపద, సహజ వనరులు ప్రజలందరికీ చెందాలి. దీనికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం అడవులను, గనులను, సముద్ర తీరాలను తన కార్పొరేట్ మిత్రులకు ధారాదత్తం చేసింది. వాటి నుండి కోట్లాది సంపదను ప్రయివేటు వ్యక్తులు సొంతం చేసుకుంటున్నారు. మరో ఆదేశిక సూత్రం ప్రకారం సంపద కొద్దిమంది దగ్గర పోగుపడకూడదు. కాని పోగుపడింది. దానిని వికేంద్రీకరించాలి. ఈ సంపదలలో తగిన వాటా శ్రమజీవులకు దక్కాలి. కార్పొరేట్ల దగ్గర పోగుపడ్డ సంపదను పునఃపంపిణీ చెయ్యాలి.
కార్పొరేట్ పన్ను పెంచడం, వారసత్వ పన్ను, సంపద పన్ను విధించడం ద్వారా దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అదనపు నిధులతో జాతీయ సంక్షేమ నిధిని ఏర్పాటు చెయ్యాలి. ఈ సొమ్ముతో శ్రమ జీవులందరికీ హక్కుగా నివాసం, ఆహార భద్రత, విద్య-వైద్య సదుపాయాలు, కనీస మౌలిక ఆదాయం కల్పించాలి. ఈ నిధుల నుండి రైతుల పంటలకు లాభసాటి ధరలు, నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారాలు సాధించాలి. ఆదేశిక సూత్రాలలో కార్మికులకు పరిశ్రమల యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించాలని సూచిస్తే దానికి విరుద్ధంగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌లను ఈ ప్రభుత్వం తెచ్చింది. కార్మికులకు హేతుబద్ధమైన పని గంటలు వుండాలని ఆదేశిక సూత్రాలు ఘోషిస్తుంటే ఈ ప్రభుత్వం 12 -16 గంటల పని దినానికి జెండా ఊపింది.
ఈ తరహా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన ప్రతి చర్యను శ్రమజీవులు ప్రతిఘటించాలి. ప్రజా రిపబ్లిక్ అన్నది శ్రమజీవుల రాజకీయ నినాదం. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల రాజకీయాలను, భావజాలాలను ఓడించడం ఒక లక్ష్యం. కార్పొరేట్ల దగ్గర పోగుపడ్డ సంపద పునఃపంపిణీ ద్వారా శ్రమజీవు లందరికీ గౌరవప్రదమైన స్వతంత్ర జీవనాన్ని సాధించడం మరో లక్ష్యం. దోపిడీ, వివక్షలు లేని సమాజాన్ని సాకారం చేసుకునే అంతిమ లక్ష్యానికి సాగిపోవాలి. పలు రంగాలలో చీలిపోయిన శ్రమజీవులు, వివక్ష తరగతుల సమూహాలు ఒక్కటైతే అది ప్రజాఉద్యమం అవుతుంది, ఉప్పెనగా మారుతుంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది.
డివివియస్ వర్మ
85006 78977