లా వర్శిటీ స్నాతకోత్సవంలో చీఫ్ జస్టిస్ రమణ
రాయ్‌పూర్ : పౌరులకు రాజ్యాంగ నిర్ధేశిత అంశాల గురించి తెలిసినప్పుడే రాజ్యాంగబద్ధమైన గణతంత్ర దేశం సవ్యంగా వర్థిల్లుతుందని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తెలిపారు. రాజ్యాంగం పట్ల పౌరులకు అవగావహన అత్యవసరం అన్నారు. పౌరులు తమ విధులు , హక్కుల గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లా పట్టా పొందిన విద్యార్థులు పౌరులకు రాజ్యాంగ విధులు, హక్కుల గురించి పౌరులకు తెలియచేయాల్సిన గురుతర బాధ్యతను తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. రాయ్‌పూర్‌లోని హిదాయతుల్లా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవం ఇక్కడి ఓ హాటల్‌లో జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయశాస్త్రం సామాజిక పరివర్తన దిశలో ఓ వజ్రాయుధం అవుతుందని , లా విద్యార్థులు, పట్టభద్రులు సామాజిక పరివర్తనకారులు అవుతారని ఉద్బోధించారు.
రాజ్యాంగం, న్యాయశాస్త్రం ద్వారా యువత సామాజిక మార్పులకు కీలక పాత్ర పోషించవచ్చునని తెలిపారు. చట్టపరమైన పాలన, రాజ్యాంగ నిర్ధేశిత అంశాలతోనే అసాధ్యాలను సుసాధ్యం చేసి తీరవచ్చునని, అత్యున్నత భారత విధాన పత్రం అనదగ్గ రాజ్యాంగం మన ఆధునిక స్వాతంత్య్ర భారతదేశం ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని, అయితే ఇది కేవలం న్యాయవిద్యార్థులు, న్యాయవృత్తి వారికి, ఇతరులు అతి కొద్ది మందికే పూర్తిస్థాయిలో తెలిసి ఉండటం జరుగుతోంది. ఇది వాస్తవిక అంశం అయిందన్నారు. ఈ రాజ్యాంగ పరిజ్ఞానులు ఇందులోని అంశాలను సామాన్య పౌరులకు వివరించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.