మన రాజ్యాంగ నిర్మాణం సుదీర్ఘంగా సాగిన ప్రక్రియ. ఎంతోమంది తలపండిన మేధావులు, న్యాయకోవిదులు ప్రతి అంశాన్నీ విఫులంగా చర్చించి బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాసుకున్న ఒడంబడిక పత్రం మన రాజ్యాంగం. రాజ్యాంగ సభ 26 నవంబరు 1949న సమావేశమై రాజ్యాంగ చట్టాన్ని అంతిమంగా ఆమోదించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చింది 26 జనవరి 1950న అయినా, రాజ్యాంగం చట్టసభ ఆమోదం పొందింది మాత్రం 26 నవంబరు 1949 నాడే. కానీ 26 నవంబరును పట్టించుకోలేదు చాన్నాళ్లు. 26 జనవరిని దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవంగా ఆర్భాటంతో వేడుకలు చేసుకుంటాము. మన సైన్యం శక్తిని, వైవిధ్యభరితమైన మన సాంస్కృతిక వారసత్వ సంపాదను, వివిధ రంగాల్లో మనం సాధించిన ప్రగతిని గర్వంగా ప్రపంచానికి చాటి చెబుతాం. కానీ 26 జనవరిన రాజ్యాంగం గురించిన ప్రస్తావన ఎక్కడా వినిపించదు. ఈ వెలితిని భర్తీ చెయ్యటానికి మోడీ ప్రభుత్వం నవంబరు 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
దీన్ని సంవిధాన్ దివాస్ అని కూడా అంటారు. ఇది నిస్సందేహంగా ఆహ్వానించదగిన పరిణామమే. రాజ్యాంగం మీద సరైన అవగాహన దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉండటం అవసరం. మన యువతకు రాజ్యాంగం మీద అవగాహన లేదనటంలో సందేహం లేదు. దీనికి కారణం సైన్స్ చదివే విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలు సైన్స్‌లో ఎక్కువ మార్కుల మీదనే దృష్టి పెడతారు. ఈ ర్యాంకుల పరుగు పందెంలో క్రీడలు, వ్యక్తిత్వా వికాసం, మన చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం, రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లాంటి అంశాలను పట్టించుకోరు. ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఫలితంగా మన ఇంజినీర్లు, డాక్టర్లు దేశ వ్యవస్థకి సంబంధించిన విషయాల మీద కనీస అవగాహన లేకుండానే పట్టా పుచ్చుకుంటారు. ఈ మధ్యన సినీ నటుడు నాగార్జున ఒక టివి ఛానెల్లో నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో ఇంజినీరింగ్ చదివిన బాలిక పాల్గొన్నది. ఆ కార్యక్రమంలో బాబా సాహెబ్ అని ఎవరిని అంటారని నాలుగు పేర్లు ఇచ్చారు: సర్దార్ పటేల్, అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, సుభాష్ చంద్రబోస్. ఇంజినీరింగ్ చదివిన బాలికకు సమాధానం తెలియలేదు. కానీ అంబేద్కర్ మాత్రం కాదు అని ఖరాఖండిగా తేల్చేసింది. ఆడియన్స్ పోల్‌లో ఎక్కువ మంది సర్దార్ పటేల్ పేరు చెప్పారు.
ఆడియెన్సులో వున్న వాళ్ళు కూడా చదువుకున్న యువకులే. ఈ సంఘటన ఉన్నత చదువులు చదువుకున్న వారికి కూడా రాజ్యాంగం గురించి ఏమీ తెలియదని చెబుతుంది. రాజ్యాంగం గురించి తెలిస్తే బాబాసాహెబ్ ఎవరో కూడా తెలుస్తుంది.బహుశా కంప్యూటర్‌గారు చెప్పే వరకు నాగార్జునకి కూడా తెలిసుండకపోవచ్చు. మన యువతలో జనరల్ నాలెడ్జి ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటన తేటతెల్లం చేస్తున్నది. దీనికి కారణం వృత్తి విద్యలో సోషల్ స్టడీస్ పాఠ్యాంశంగా లేకపోవడమే. ఈ సంఘటన సమాజాన్ని ఆవేదనకు గురిచేసింది. న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించడం లేదా మెడిసిన్ ఇంజినీరింగు లాంటి చదువుల్లో కూడా సోషల్ స్టడీస్‌ను పాఠ్యాంశంగా చేర్చమని?దురదృష్టం ఏంటంటే మన రాజకీయ వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఒక దళిత నేతగా చూస్తుంది గానీ, జాతీయ నేతగా కాదు. అంబేద్కర్ గొప్ప జాతీయ నేత. భారత రత్న బిరుదుకు నిజమైన అర్హుల జాబితా లో మొదట వుండేది అంబేద్కరే! దేశానికి ఆయన అందించిన సేవలు అంత అమూల్యమైనవి. ఆయన చెక్కిన రాజ్యాంగం దేశం మొత్తానికి చెందినది ఏ ఒక్కరికో కాదు.
ఆయన దేశానికి చేసిన మరో గొప్ప మేలు అణగారిన వర్గాలకు రాజ్యాంగపరమైన భద్రత కల్పించడం. సంకుచిత స్వభావంతో అగ్రకులజులు దళితులకు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు కల్పించినందుకు అంబేద్కర్‌ను వ్యతిరేక భావంతో చూస్తారు. దళితులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి దేశానికి ఎంతో మేలు చేశాడు అంబేద్కర్. లేని పక్షంలో దళితులు ఎప్పటికీ చట్టసభల్లో అడుగుపెట్టగలిగేవారు కాదు. ఒక వర్గాన్ని కులం పేరుతో ప్రధాన జీవన శ్రవంతి నుంచి వేరు చేస్తే అది పోరాటాలకు దారి తీయవచ్చు, దానితో ఏళ్ల తరబడి సమాజంలో అశాంతి ఆందోళన నెలకొని ఉండేది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో ఎన్ని దశాబ్దాల కాలయాపని జరిగిందో చూశాము కదా! ఈ సందర్భంలో నవంబరు 26 న జరుపుకునే వేడుక రాజ్యాంగం దేశ ఆర్ధిక, రాజకీయ, సామాజిక, పరిపాలనా వ్యవస్థల మీద అవగాహన కల్పించటానికి ఒక మంచి అవకాశం. ఒక జాతిగా మనకు దశ దిశా నిర్దేశించేది రాజ్యాంగమే. మన రాజ్యాంగం కేవలం అచ్చు వేసిన పుస్తకం కాదు. భాగవతం, బైబిల్, ఖురాన్ లాంటి గ్రంధాలను హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఎంత పవిత్రంగా చూసుకుంటారో, పౌరులుగా ప్రజలందరూ రాజ్యాంగాన్ని కూడా అంతే పవిత్రంగా చూడాలి.
వీలైతే అంతకన్నా ఎక్కువ భక్తి భావంతో చూడాలి. దైనందిన జీవితంలో మన బతుకులను శుభప్రదం, ఫలప్రదం చేసే పలు అంశాలు ఈ పవిత్ర గ్రంథంలో పొందుపరిచి వున్నాయి. ఇది ఎందరో మేధావులు సుదీర్ఘ ఆలోచనస చేసిన ఆదర్శభావాల అల్లిక. ఇందులో పేర్కొన్న ప్రకరణాలు ప్రతి ఒక్కరికీ సంబంధించినవే. ప్రపంచంలోని పలు రాజ్యాంగాలలోని ఉత్తమ అంశాలను క్రోడీకరించి మన రాజ్యాంగంలో పొందుపరిచారు.
మన రాజ్యాంగానికి ఎంతో విశిష్టత వుంది. మన సుదీర్ఘ చరిత్రలో మొట్టమొదటిసారి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా మనమే రాసుకున్నాము. కులం, మతం, రంగు, లింగం, ఆస్తి, అంతస్థు నిమిత్తం లేకుండా ప్రజలందరూ సమానులే అని మన రాజ్యాంగం ప్రకటించింది. చట్టం ముందు అందరూ సమానమే. స్వాతంత్య్రానికి పూర్వం వారసత్వం ఆధారంగా వుండేది మనిషి విలువ. మనిషి స్వయంకృషితో సాధించిన పేరు కన్నా వారసత్వంగా వచ్చిన పేరుకే విలువ ఇచ్చే వ్యవస్థలో బ్రతికాము వేల సంవత్సరాలు. ఈ అసమాన వ్యవస్థను ఒక్క పెన్నుపోటుతో తోసి వేసి, ఒక నవ సమాజ స్థాపనకు పునాదిరాయి వేసింది రాజ్యాంగం. రాజులూ, రాణుల పాలనను చరిత్రలోకి నెట్టివేస్తూ, పాలకులు ప్రజలకు జవాబుదారీగా వుండే ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది మన రాజ్యాంగం. వేల సంవత్సరాలు రాజరికపు నియంతృత్వ పాలనలో మగ్గిన మనకు ఆ చీకటి చరిత్ర నుంచి రాజ్యాంగం విముక్తి కలిగించింది.
ప్రజలకు ప్రాథమిక హక్కులు ప్రసాదించింది. హక్కులకు భంగం కలిగితే న్యాయ స్థానాలను ఆశ్రయించే హక్కు కూడా రాజ్యాంగం కల్పించింది. పరాయి పాలనలో మగ్గిన మనకు ఇదొక అద్భుతమైన అనుభూతి. ఈ అనుభూతిని ఆస్వాదించాలంటే రాజ్యాంగం గురించి తప్పక తెలుసుకువాల్సిందే. కానీ ఎంత మందికి తెలుసు?
ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పరుచుకున్న మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులేమిటి? వాటిని ప్రాథమిక హక్కులని ఎందుకన్నారు? రాజ్యాంగం ప్రభుత్వం మీద విధించిన పరిమితులేమిటి? రాజ్యాంగం ప్రజల మీద వుంచిన బాధ్యత లేమిటి? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా వుండాలి? మన సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సంబంధాలు ఎలా వుండాలి? కేంద్రానికి వున్న అధికారాలేంటి? రాష్ట్రాలకు వున్న అధికారాలేంటి? రాజ్యాంగం మీద అభిప్రాయ భేదాలుంటే ఎలా పరిష్కరించాలి? ఈ అంశాలన్నిటి మీద సవివరంగా రాసుకున్న ఒడంబడిక పత్రం మన రాజ్యాంగం. అంతటి ఘనమైన విశిష్టత వున్న మన రాజ్యాంగం గురించి తెలుసుకోవలసిన బాధ్యత మనందరి మీద వుందికదా! రాజ్యాంగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా వుందన్న మాట వాస్తవమే.
అందుకే ఈ సందర్భాన్ని రాజకీయ ప్రముఖులు ఆర్భాటం చేసే ఒక తంతులా కాకుండా ప్రజలకు, మరీ ముఖ్యంగా యువతకు, మంచి అవగాహన, ప్రయోజనం కలిగేలా చూడాలి. అధికారిక కార్యక్రమం అంటే చెయ్యాలిగాబట్టి అన్నట్లు చేస్తాం గానీ మనస్ఫూర్తిగా చెయ్యటం మనకు లేని అలవాటు. ఈ విష సంస్కృతి మారాలి. గుడిలో జరిగే తంతులా మమ అనిపించటం కాకుండా, బడిలో విద్యార్ధుల మనసుల్లో అవగాహన కలిగించి కొత్త ఆలోచనలు రేకెత్తించే చందంగా ఈ వేడుకను సృజనాత్మకంగా నిర్వహిస్తే ప్రజలకు, ముఖ్యంగా యువతకు, ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం నివహించే కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతుంటాయి. రాజకీయ నేతలు ఎవరో రాసిన ప్రసంగాలు చదవటం కన్నా మనసు విప్పి మాట్లాడాలి. ఈ దినం ప్రముఖులు ఉపన్యాసాలు ఇవ్వడం షరా మామూలే. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి వచ్చే వారు, రాజ్యాంగాన్ని కాపాడతాం అని ప్రతిజ్ఞ చేసేవారు రాజ్యాంగాన్ని ఏ మాత్రం గౌరవిస్తున్నారు? పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కింద వచ్చిన పిటీషన్లను పరిష్కరించే విషయంలో చట్ట సభల అధ్యక్షులు ఎందరు చిత్తశుద్ధితో రాజ్యాంగ విలువల ప్రకారం వ్యవహరిస్తున్నారు?
శాసన సభ ఆమోదించిన బిల్లును గవర్నరు ఆమోదం కోసం పంపినప్పుడు ఎంత మంది గవర్నర్లు సకాలంలో ఆమోదం తెలుపుతున్నారు? రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మొట్టమొదటిసారి ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చెయ్యకుండా ఐదు సంవత్సరాలూ ఖాళీగా ఉంచింది! ఇది మన ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇదేనా రాజ్యాంగం పట్ల చూపించే గౌరవం? ప్రధాన మీడియా గానీ, ప్రతిపక్షం గానీ ఈ విషయాన్ని పట్టించుకోకపోవటం ఆశ్చర్యం. ఇటువంటి నేతలా ప్రజలకు రాజ్యాంగ విలువల గురించి ప్రవచనాలు వల్లె వేసేది? ఈ దుస్థితి మారాలి. ప్రజలందరూ రాజ్యాంగాన్ని అర్ధం చేసుకోవాలి. సత్యం, ధర్మం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సర్వమానవ సౌభ్రాతృత్వం అనే మన రాజ్యాంగ విలువలను అందరం ఆకళింపు చేసుకోవాలి, ముఖ్యంగా యువత. అప్పుడే ఒక నవ సమాజ స్థాపనకు ముందడుగు పడుతుంది.