Monday, July 8, 2024

రాజ్యాంగం నిజంగా అమలవుతోందా!

- Advertisement -
- Advertisement -

జనవరి 26, 1950లో భారత దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీని డ్రాఫ్టింగ్ కమిటీకి డా. బి.ఆర్. అంబేడ్కర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇది పూర్తి కావడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజులు పట్టింది. ఇందులో 395 ఆర్టికల్స్ (అధికరణలు), 22 పార్ట్ (భాగాలు) 12 షెడ్యూళ్లు ఉన్నాయి. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తియిన సందర్భాన్ని పురస్కరించుకుని, భారత దేశం సామాజిక వ్యవస్థను నిశితంగా పరిశీలించినట్లయితే మనకు కనిపిస్తున్నదేమిటీ? రాజ్యాంగంలో రాసుకున్న దానికి, బయట కనబడుతున్న దానికి పోలికే లేదు. పూర్తి భిన్నంగా కూడా కనబడుతూ ఉంది. అందుకు కారకులెవరు? కేవలం పరిపాలకులు, రాజకీయ నాయకులు మాత్రమే దోషులు కాదు. కొంతలో కొంత సామాన్య ప్రజలు కూడా బాధ్యులే. రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి భారత దేశంలో అక్షరాస్యత కేవలం 810 శాతం మాత్రమే ఉండేది. నిరక్షరాస్యులైన ఆనాటి భారత దేశ పౌరులు రాజ్యాంగం గూర్చి, చట్టాల గూర్చి తెలియక, వాటి గూర్చి అవగాహన లేక అజ్ఞానంతో అంధ విశ్వాసాలతో మతాల్ని, కులాల్ని, అస్పృశ్యతను పాటించేవారు.

అసమానత్వమే సరైన విధానమని భావించేవారు. మరి ఈ రోజు 85 శాతానికి పైగా అక్షరాస్యతను సాధించిన భారతీయ సమాజం రాజ్యాంగాన్ని, చట్టాల్ని దుర్వినియోగ పరుస్తూ ఉంది. విద్యావంతులైన నేటి నాయకులు, ధనవంతులు, పెత్తందార్లు తమ బాధ్యతల్ని మరిచి, రాజ్యాంగంపై గౌరవం లేక విచ్చల విడితనంతో ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా ఒక అవినీతి సమాజం, నేర ప్రవృత్తి గల సమాజం, లంచగొండి సమాజం ఏర్పడింది. నిస్సహాయులైన సామాన్య పౌరులు ఈ పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నారు. ఉదాహరణకు మతం పేరిట జరుగుతున్న మారణ హోమాలు, కులాల వివక్ష, అత్యాచారాలు, దోపిడీలు, ఆకలి చావులు, భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు, గృహ హింసలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో సమాజం భ్రష్టు పట్టిపోవడానికి కారణాలు మరెన్నో మనసు ఉన్న మనుషులకు, మంచితనమున్న వారికి, అసహాయులకు ఇది భద్రత కల్పించలేకపోతోంది. అందుకు కారణం రాజ్యాంగ వైఫల్యమని కొందరు చెబితే, పాలకుల తప్పిదం అని మరి కొందరు చెబుతున్నారు. కారణం ఏదైనా, జరిగే నష్టం ఏ ఒక్కరికో కాదు. ఇది మొత్తం భారత జాతికి జరుగుతున్న నష్టం. ఈ విషయం ప్రతి భారతీయ పౌరుడు గ్రహించాలి. మతానికి, ప్రాంతానికి, కులానికి, లింగ భేదానికి అతీతంగా ఆలోచించగలగాలి. ప్రతి విషయాన్నీ రాజ్యాంగానికి లోబడి ఆచరిస్తూ ఉండాలి! భారత దేశ ప్రజలకు ఈ దేశ రాజ్యాంగం కలిగించిన సౌలభ్యాలు కొన్ని ఇలా ఉన్నాయి

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆలోచనా స్వేచ్ఛ భావ ప్రకటనా స్వేచ్ఛ స్థాయిలోను, అవకాశాల్లోను, సమానత్వం ప్రజలందరిలో అఖండతా భావాన్ని, దేశీయ సమైక్యతను, వ్యక్తి గౌరవాన్ని నిలుపుకోవడం, పెంపొందించడం వంటివి ఉన్నాయి. రాజ్యాంగంలో ఇంత గొప్ప లక్షాలు నిర్దేశించుకున్నప్పటికీ మరి ఈ దేశాన్ని ఏ చీడ పురుగులు పట్టి పీడిస్తున్నాయీ? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గూర్చి చెప్పిన వాటిని అమలు కాకుండా అడ్డుకుంటున్న దుర్మార్గులు ఎవరు? ప్రతి పౌరుడూ ఆలోచించాలి. జరుగుతున్న సంఘటనల్ని విశ్లేషించుకోవాలి.
సమానత్వాన్ని సాధించడానికి భారత రాజ్యాంగంలో కొన్ని అధికరణలు ఇలా ఉన్నాయి.
అధికరణం (ఆర్టికల్) 14: చట్టం ముందు అందరూ సమానులే.
అధికరణం: 15: కుల, మత, లింగ వివక్షకు తావులేదు
అధికరణం: 16: ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు
అధికరణం: 17: అంటరానితనం నిషేధం

అధికరణం : 18: బిరుదులు నిషేధం
భారతదేశం సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి ఇలా కొన్ని అధికరణలు ఉన్నప్పటికీ మరి ఎందుకు సమానత్వం సాధించలేకపోతున్నాం? అడ్డుపడుతున్నది ఎవరు? దేశ ప్రజలు జాగరూకులై నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఎదుర్కొంటూ ఉండాలి. అవసరమైనప్పుడు ప్రజా సంఘాలు ఐక్యమై పోరాడుతూ ఉండాలి.
స్వేచ్ఛను సాధించడానికి భారత రాజ్యాంగం కొన్ని అధికరణల్ని కేటాయించింది.
అధికరణం : 19 : భావ ప్రకటనా స్వేచ్ఛ
అధికరణం : 20 ఒక నేరానికి ఒకసారి
అధికరణం : 21 వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు
అధికరణం : 22 నిర్బంధాలు పరిమితులు
దోపిడీ నుంచి రక్షణ పొందడానికి మరి కొన్ని అధికరణలు ఇలా ఉన్నాయి
అధికరణం: 23 : శ్రమ శక్తిని దోపిడీ చేయరాదు
అధికరణం: 24 : బాల కార్మికుల నిషేధం
1949 నవంబర్ 26న లోక్‌సభలో రాజ్యాంగాన్ని సమర్పిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్ ఇలా అన్నారు.

“ఈ రాజ్యాంగం ఎంత గొప్పదయినా, దాన్ని అమలు పరిచేవారు దుర్మార్గులైతే ఆ రాజ్యాంగం తన లక్షాన్ని చేరుకోదు” అని! ఆయన దార్శనికుడు కాబట్టి, భవిష్యత్తులో జరగబోయేది ముందే ఊహించి చెప్పినట్లున్నారు. ఈ రోజు మన దేశంలో జరుగుతున్నది అదే దాన్ని అరికట్టడం భారతీయులందరి బాధ్యత! నేరస్థుల్ని చట్టసభలకు పంపకుండా, కారాగారాలకు పంపే ఏర్పాటు చేయాలి. వివేకవంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఓటు హక్కు గల దేశ పౌరులందరిదీ దేశ ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుకోవడానికి కంకణబద్ధులు కావాలి. కాని అవుతున్నారా? ఆచరణకు మూలం ఆలోచనే కదా? అందుకే కనీసం ప్రజలు, హేతుబద్ధంగానైనా ఆలోచించడం ప్రారంభించాలి.2024 ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. ధర్మం పేరుతో పదేళ్ళు అధర్మ పాలన సాగించిన బిజెపికి దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. లోక్‌సభలో తాము 400లకు పైగా స్థానాలు సాధిస్తామని విర్రవీగిన వారు మరో రెండు స్థిరత్వం లేని పార్టీల ఊత కర్రల్ని చంకలో వేసుకుని, కుంటి నడకలు నడవాల్సి వస్తోంది. ఈ దేశ ప్రజలు ఈసారి పూర్తి మెజారిటీ గనక ఇస్తే రాజ్యాంగాన్నే మారుస్తామని ప్రకటించిన బిజెపి నాయకులు ఎన్నెన్ని అప్రజాస్వామిక కార్యక్రమాలు చేశారూ? ఆదివాసీ మహిళను దేశాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి, మణిపూర్‌లో మారణ కాండ జరిపించారు. ఆదివాసీ మహిళల్ని నగ్నంగా ఊరేగించారు.

ఇదేమైనా రాజ్యాంగబద్ధమా? గుజరాత్ గాయం రాజ్యాంగబద్ధమా? ఆవు పేడ, ఆవు మూత్రం రాజ్యాంగబద్ధమా? గత పదేళ్ల బిజెపి పాలనలో రాజ్యాంగ హననం నిత్యకృత్యమైపోలేదా? ఎలక్షన్ సభలలో, ర్యాలీలలో మత విద్వేషాలు రేపిన మోడీ అనే మానవుడికి నైతిక విలువలు గనక ఉంటే, రాజకీయ సన్యాసం చేయాలి కదా? వ్యవస్థలను గుప్పిట్లో ఉంచుకుని, ప్రతిపక్ష నాయకుల్ని జైళ్లలో వేసి, వారి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసి చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా ఈ గెలవడం ఓ గెలవడమేనా?
మోడీ గెలిచిన వారణాసిలో ఓటర్ల సంఖ్య 11 లక్షలయితే, పోలైన ఓట్లు 12 లక్షల 87 వేలు ఎలా అయ్యాయి? ఎలాన్ మస్క్ దగ్గరి నుండి ప్రపంచ మేధావులంతా భారత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల మీద తీవ్రమైన సందేహాలు, అభ్యంతరాలు తెలియజేస్తున్నారు కదా? ‘ఇండియా’ కూటమి బలపడింది. కాని ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. మోసాన్ని అబద్ధాల్ని దెబ్బ తీయాలంటే వీరు నిజాయితీతో, నిబద్ధతతో నిరంతరం మరింత జాగరూకతతో కృషి చేస్తూనే ఉండాలి! పార్టీ ఏదైనా కానివ్వండి రాజ్యాంగాన్ని కాపాడే ప్రభుత్వం, మానవీయ విలువల్ని పరిరక్షించే ప్రభుత్వం అందించగలిగితే చాలు! అలాంటి ప్రభుత్వాన్ని రూపొందించుకునే దిశలో ఒక ఈ దేశ పౌరుల కార్యాచరణ ఉండాలి! ప్రస్తుతానికి రాజ్యాంగం ‘రక్షించబడిందని అనుకున్నంతలో మోడీ కొత్త ప్రభుత్వం రచయిత్రి అరుంధతీ రాయ్‌పై ఉపా చట్టం ప్రయోగించబోతోంది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News