Monday, December 23, 2024

సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!

- Advertisement -
- Advertisement -

Constitution of India values decreased

భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో నిర్మాణాత్మకమైన, కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. రాజ్యాంగంలో 11, 12 భాగాలలో 245- 300 వరకు గల అధికరణలు కేంద్ర, రాష్ట్రాల మధ్య గల సంబంధాలను ప్రస్తావించాయి. కానీ వాటికి విరుద్ధంగా నేటి కేంద్ర ప్రభుత్వం తము అధికారంలో లేని రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన కేంద్రం -తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమను చూపిస్తూ సమాఖ్య స్ఫూర్తికి సమాధిని కడుతుంది. సమాఖ్య వ్యవస్థలో ప్రత్యేకమైన విధులను, బాధ్యతలను నిర్వచించి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించడం జరిగింది. కేంద్ర జాబితాలోని అంశాలపై తుది నిర్ణయం కేంద్రానిదే, రాష్ట్ర జాబితాపై అంతిమ నిర్ణయం రాష్ట్రానిదే, ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. కానీ అంతిమ నిర్ణయం కేంద్రానిదే. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో గల అంశాలపై శాసనం చేసే అధికారం రాజ్యాంగ రీత్యా సంక్రమించింది. దీనిని ఆధారంగా చేసుకొని కేంద్రం రాష్ట్రాలపై పైచేయి సాధిస్తుంది.
తమ పార్టీ అధికారంలోలేని తెలంగాణ రాష్ట్ర విషయంలో కూడా కేంద్ర కక్ష సాధింపు ధోరణిని వ్యవహరిస్తోంది. రాష్ట్ర పునర్విభజన హామీలను గాలికొదిలేసి..వింత చోద్యం చూస్తున్నది. ముఖ్యంగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన రైల్వే కోచ్ ప్యాక్టరీ హామీని అమలు చేయకుండా అదే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని 2018లో మహారాష్ట్రకు తరలించింది. ఇందుకోసం వరంగల్ జిల్లా కాజిపేటలో రాష్ట్ర సర్కారు కోచ్ ఫ్యాక్టరీ పేరిట భూమిని సేకరించింది.. వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం వేచిచూస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లుచల్లుతూ తెలంగాణ సమాజం పాలిటశాపంగా మారింది. యుపిఎ హయాంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐటిఐఆర్ ప్రాజెక్టు హామీని బిజెపి ప్రభుత్వం రద్దు చేస్తూ.. నూతన ఐటిఐఆర్ ప్రాజెక్టును కర్ణాటకకు కేటాయించి తెలంగాణ ఐటి వ్యవస్థకు ఒక పెద్ద వైరస్ లాగా మారింది. అంతేకాకుండా విభజన చట్టంలోని గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలసేకరణ చేసిన కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీని విస్మరించింది, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోగా వాటి ఆమోదం తెలిపే విషయంలో ఆలస్యం చేస్తున్నది.

జిల్లాలకు అనుగుణంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను విస్మరిస్తుంది (నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీలు, ఐఎఎస్‌ల కేటాయింపు లాంటి అంశాలు) ఇవి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలతో ఉన్న జలవివాదాల పరిష్కార విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిన కేంద్రం ట్రిబ్యునళ్ల పేరిట చేతులు దులుపుకుంటుంది.. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉంది. కానీ అక్కడ టిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ ఉండడంతో అభివృద్ధికి నిధులను కేటాయించకపోగా… తమ అధికార బలంతో కంటోన్మెంట్ రోడ్లను మూసేస్తుంది… ఆ రోడ్ల గుండా సికింద్రాబాద్ పరిసరప్రాంతాల ప్రజలు ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపుతూ బ్రిడ్జిల నిర్మాణం చేపడుదాం అంటే రక్షణ శాఖ అనుమతించడం లేదు. పోనీ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జిహెచ్‌ఎంసిలో కలపండి అని పలు మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదు. కరోనా లాంటి మహమ్మరిని ఎదుర్కొనే వ్యాక్సినేషన్ల పంపిణీ విషయంలో కూడా తెలంగాణ పట్ల నిర్లక్షాన్నిప్రదర్శించింది. ఇలా అనేక విషయాల్లో తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. తెలంగాణ పట్ల మరో కొత్త కుట్రకు కేంద్రం పన్నగాలు పన్ని దానిని అమలు చేసే విషయంలో రాష్ట్ర బిజెపి నాయకత్వాన్ని ప్రభుత్వం మీదకు ఉసిగొల్పుతుంది. ఆ కుట్ర ఏంటంటే..! తెలంగాణ వడ్లపై దొంగ సాకులు చెపుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెడుతుంది… తెలంగాణ వడ్లను కొనేది లేదని తెగేసి చెప్పి రాష్ట్ర రైతాంగ గుండెల మీద గుదిబండను వేసింది కేంద్ర సర్కార్. ఇతర రాష్ట్రాల్లో మాత్రం వరిని సేకరిస్తూనే తెలంగాణ పట్ల వివక్షను చూపుతూ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తుంది.

రాష్ట్ర రైతాంగానికి అన్నితానై అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే… కేంద్ర సర్కార్ మాత్రం తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారింది. దేశంలో వరి ధాన్యం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయని రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మరల్చండి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంటే… తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం వరినెట్ల వద్దంటరని దగాకోరు మాటలు మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు… ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకమైన సూచన చేస్తూనే… తమ పార్టీ నేతలకు మరోలా సూచనలు ఇస్తూ రెండు నాలుకల ధోరణిని వ్యవహరిస్తోంది… ఈ విధంగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను హస్తగతం చేసుకొని తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల మీద కేంద్రం తన వక్ర బుద్ధిని చూపిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి గోరిని కడుతుంది అని చెప్పడానికి ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అద్దం పడతాయి.. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం అయినప్పటికీ నిబంధన చివరాఖరున ఉన్న వెసలుబాటును ఆసరాగా చేసుకుని ఆర్టికల్ 249 ప్రకారం వ్యవసాయ రంగంలో అనూహ్యమైన సంస్కరణలను మూడు చట్టాల రూపంలో తెచ్చింది. తద్వారా స్థానిక రైతులకు స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా దేశం మొత్తానికి వర్తించే విధానాలను నెత్తిన రుద్దడం అన్నమాట. ఇలాంటి చట్టాలపై దేశ నలుమూలల నుంచి ప్రజాగ్రహ జ్వాల పెల్లుబుకడంతో 2021 నవంబర్ 19న నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ విధంగా సమాఖ్య విధానానికి స్వస్తిపలికే ధోరణిని కేంద్రం అవలంబించడం.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాంతకమే…

కరోనా విపత్కర సమయంలో పలు రాష్ట్రాలకు అండగా నిలవాల్సింది పోను.. రాష్ట్రాల అవసరాలకు అప్పులు తీసుకోవడానికి నియమ నిబంధనలు చెప్పేదే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజెమెంట్ (ఎఫ్‌ఆర్‌బిఎం) దీనిని 5 శాతానికి పెంచమని రాష్ట్రాలు కేంద్రాన్ని అడగగా ఆర్‌బిఐ ద్వారా ఎన్నో షరతులు పెట్టింది.. కానీ ఎఫ్‌ఆర్‌బిఎం శాతానికి పెంచినట్లయితే రాష్ట్రాల అప్పులు తీసుకునే పరిమితి పెరిగి పలు రాష్ట్రాలకు ఆర్ధిక సంక్షోభం నుండి ఉపశమనం కలిగేది. దాన్ని విస్మరిస్తూ తెలంగాణ అప్పులు 69 లక్షల కోట్ల నుండి 2.39 లక్షల కోట్లకు పెరిగిందని మాట్లాడుతున్నారు. అప్పుల స్థాయి పెరుగుతుంది అంటే అంతే స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ఎలా విస్మరిస్తున్నారు. అప్పులు ఇచ్చే సంస్థలు రాష్ట్ర పరిస్థితిని అంచనా వేసుకొని ఇస్తారు. తిరిగి కట్టగలరా లేదా అనే విషయాన్ని బేరీజు వేసుకుంటారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎఫ్‌ఆర్‌బిఎం 5 శాతానికి పెంచడానికి పలు షరతులు పెట్టినందున హెలికాప్టర్ మనీ ద్వారానైన ఆర్థిక వ్యవస్థకు జీవం పోయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా దాన్ని కూడా కేంద్రం తోసిపుచ్చింది.

(హెలికాప్టర్ మనీ అంటే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం. ఈ విధానాన్ని 1969లో అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్ధికవేత్త ఫ్రెడ్మాన్ ప్రతిపాదించగా.. 2002 లో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెన్ బెర్ణాంఖే ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు) ఈ విషయాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాల అభిప్రాయలను తోసిపుచ్చడం… ఏ విధానానికి సంకేతం. అంతేకాకుండా కేంద్రం జిఎస్‌టి ప్రవేశపెట్టిన రోజు రాష్ట్రాలకు పన్ను రాబడి తగ్గకుండా చూస్తామని, 15 శాతం వరకు కాంపెన్షన్ ఇస్తామని చేతులెత్తేసింది. రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా సెస్‌ల విధింపు, నీతిఆయోగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలయిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, రైతు బంధు లాంటి పథకాలకు సహాయం చేయమని సిఫారసు చేసిన ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వకుండా బేఖాతరు చేస్తోంది. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాల్సింది పోయి విక్రయించడం, రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గింపు వంటి విషయాల్లో పలు రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం హరిస్తుంది. అంతే కాకుండా దక్షిణాది రాష్ట్రాల భాషలకు పోటీ రాష్ట్రాల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఇంధన ధరల పెంపు వంటి అంశాలు కేంద్ర ఏక పక్ష ధోరణికి అద్దం పడుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని కూడా పలు రాష్ట్రాలపై రాజకీయంగా పావులు కదిపే ఒక ప్రతినిధి వ్యవస్థలగా మార్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాయల ఫకీరు చిలుకలా ఆడించడానికి ఉపయోగపడుతుంది. అందుకు ప్రత్యేక్ష ఉదాహరణ:- మొన్నటికి మొన్న మహారాష్ట్రలో రాత్రికిరాత్రే రాష్ట్రపతి పాలనకు రద్దు చేయించి తెల్లారక ముందే సంఖ్యా బలంలేని వారి ప్రమాణ స్వీకార సంఘటనా చూశాం. మధ్యప్రదేశ్‌లో కరోనా కాలు దువ్వుతున్నా బలపరీక్ష నిర్వహించి ప్రభుత్వాన్ని పడగొట్టడం, రాజస్థాన్‌లో అదే కరోనా సాకుతో అసెంబ్లీ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడం, అంతకు ముందు ఢిల్లీలో ముఖ్యమంత్రి రాష్ట్ర హక్కులను కేంద్రం కలరాస్తుందంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో ధర్నాకు దిగడం ఇలాంటివెన్నో చూశాం.

ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ లేకుండా చేయడమే లక్ష్యంగా గవర్నర్ల వ్యవస్థ ఉన్నదా..! అన్నంత అధ్వానంగా ఫెడరల్ వ్యవస్థను మార్చింది కేంద్రం. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ నేతలు దేశం గురించి ప్రస్తావించినప్పుడు నా దేశం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే జాతీయ నేతలే తమ పార్టీ అధికారంలోలేని రాష్ట్రాలకు వచ్చినప్పుడు సదరు రాష్ట్రాన్ని సర్వనాశనమైన రాష్ట్రంగా వర్ణిస్తుంటారు. ఇది పరస్పర విరుద్ధమైన ప్రకటన కాదా? దీని ప్రకారం కేంద్రం పెద్దల దృష్టిలో దేశం వెలిగిపోతుంది కానీ సగానికి పైగా రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. ఇలాంటి అభిప్రాయ వ్యక్తీకరణల్లోనే ఫెడరల్ వ్యవస్థకు మొదటి నష్టం ఉన్నది. ఆ తరువాత నిధుల కేటాయింపుల్లో, విడుదలల్లో వివక్ష చూపడంతో రెండవ కష్టం మొదలవుతున్నది. నీటి వినియోగం మొదలు బడ్జెట్ కేటాయింపులూ, కొత్త పరిశ్రమలూ/ అకాడమీల స్థాపనలూ వంటి వాటికన్నింటికీ ఆదేశిక సూత్రాలున్నప్పటికీ ఏలిక వారికున్న చివరి నిర్దేశిత విచక్షణ అధికారంతో పక్షపాత వైఖరి స్పష్టంగా బయటపడుతున్నది.అయితే సమాఖ్యస్ఫూర్తికి కట్టబడుతున్న సమాధికి కేంద్రాన్ని రాష్ట్రాలు నిలదీయకుంటే… దేశం సమాఖ్య వ్యవస్థకు తీరని నష్టమే..! కేంద్ర -రాష్ట్రాల మధ్య సంబంధాలు సహకార పూరితంగా ఉంటే సమాఖ్య వ్యవస్థ విరాజిల్లుతుంది. దేశం వృద్ధిలో మరింత పురోగమిస్తుంది.

పిన్నింటి
విజయ్ కుమార్
9052039109

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News