రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం, ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ, రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య, శాసన సంస్థలు, ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం వినాశకారకం. రాజ్యాంగం ఏర్పర్చినవి రాజ్యాంగ సంస్థలు. వివిధ రాజ్యాంగ అధికరణల ద్వారా 20 రాజ్యాంగ సంస్థలు ఏర్పడ్డాయి. అవి: దేశ, రాష్ట్రఆర్థిక సంఘాలు (ఎఫ్.సి.), వస్తు సేవల శిస్తు సంఘం, సమాఖ్య, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, దేశ, రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఇసి), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అటార్నీ జనరల్స్, భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ (సిఎజి), జిల్లాల, మెట్రోపాలిటన్ల ప్రణాళిక సంఘాలు, అంతర్రాష్ట్ర మండలి, ఎస్.సి., ఎస్.టి., బి.సి.ల జాతీయ కమిషన్లు, ఆదివాసీ ప్రాంతాల, ఎస్.టి.ల, బి.సి.ల, అధికారభాష కమిషన్లు, పార్లమెంటు అధికార భాష కమిటీ, మైనారిటీ భాషల ప్రత్యేక అధికారి. సిఎజి, ఇసి, ఎఫ్.సి. ప్రధాన రాజ్యాంగ సంస్థలు. ప్రభుత్వ కార్యనిర్వాహక తీర్మానాలు, చర్యల ద్వారా రాజ్యాంగేతర సంస్థలు ఏర్పాటవుతాయి. ఇవి: భారత రూపాంతర జాతీయ సంస్థ (నీటి ఆయోగ్), జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), కేంద్ర నిఘా సంస్థ (సివిసి), జాతీయ లోక్‌పాల్, రాష్ట్ర లోకాయత్‌లు, కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లు.
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రజాస్వామ్య సంస్థలు. ప్రజాస్వామ్య నాల్గవ స్తంభంగా మాధ్యమాలను, ఐదవ స్తంభంగా ప్రజలను పరిగణిస్తారు. ఇవి రాజ్యాంగ సూత్రాల అమలులో, ప్రజాస్వామ్య నిర్మాణ, నిర్వహణల్లో కీలక పాత్ర పోషిస్తాయి. శాసన వ్యవస్థ, రాజ్యాంగ పరిధిలో చట్టాలు చేసే అతి శక్తివంతమైన ప్రజాప్రతినిధుల వేదిక. వ్యవహారాలు చట్టబద్ధంగా, లావాదేవీల లాభార్జన న్యాయసమ్మతంగా ఉండాలి. పౌర ప్రయోజనాలు పరిరక్షించబడాలి. వ్యాపార లాభాలను సమాజ ప్రయోజనానికి వాడాలి. కార్యనిర్వాహక సంస్థ రాజకీయ ప్రతినిధులు సమాజాన్ని శాసించరాదు. సమాజ నిర్మాణాన్ని, పని తీరును నియంత్రించరాదు. రాజ్యాంగం సమాఖ్య సూత్రాలను పొందుపరిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులను నిర్వచించింది. కార్యనిర్వాహకులు సమాఖ్య పరిధి, పరిమితులుదాటరాదు. చట్టాలు రాజ్యాంగ పరిధిలో ఉండేలా చూడటం న్యాయవ్యవస్థ బాధ్యత. రాజ్యాంగ వ్యతిరేకత, పాలన అక్రమాలను ప్రశ్నించడం, న్యాయ విరుద్ధ చట్టాల నుండి ప్రజారక్షణ, వివాద పరిష్కారం న్యాయవ్యవస్థ రాజ్యాంగ అధికారాలు. వైద్య విజ్ఞాన శాస్త్రాల అఖిల భారత సంస్థ ఎఐఐఎంఎస్, భారతీయ వజ్రాల సంస్థ, భారత చలనచిత్ర, దూరదర్శన్ సంస్థ (ఎఫ్.టి.ఐ.ఐ.), జాతీయ అధికార శిక్షణ, బొగ్గు నిర్వహణ భారతీయ సంస్థ, భారత రిజర్వు బ్యాంకు, రైల్వే, పెట్రోలియం సంస్థలు సమాఖ్య ప్రభుత్వ భాగస్వామ్య చట్టబద్ధ సంస్థలలో కొన్ని.
ఇప్పుడు ఈ సంస్థలన్నీ సంఘ్ భావజాల వ్యక్తుల చేతుల్లో బందీలు. గతంలో ప్రగతిశీల కాంగ్రెసీయులు, గాంధీయన్లు, సోషలిస్టులు, వామపక్షవాదుల ఆధ్వర్యంలో నడిచేవి. వారు ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునేవారు. తెర వెనుక ఏం చేసినా వేదికలపైనీతి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడేవారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు జంకేవారు. నేటి సంఘీయ అధికారులకు సిగ్గు ఎగ్గు లేవు. వైదిక హైందవ ఆర్య బ్రాహ్మణత్వ ఆధిపత్య రూపాలలో సంస్థలను నడుపుతున్నారు.
ఆర్థిక సంఘాలు పాలక అనుకూల ప్రతిపాదనలు చేస్తున్నాయి. వస్తుసేవా శిస్తు వ్యవస్థ కరోనా కాలంలోనూ, టీకాలకు కూడా పన్నులు తగ్గించలేదు. రాష్ట్రాల వాటాలను ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్లు పాలక పక్షపాతంగా పని చేస్తున్నాయి. అటార్నీ జనరల్స్ ప్రజా వ్యతిరేకంగా వాదిస్తున్నారు. వలస కార్మికులకు, కొవిడ్ చావుల అనాథలకు ఆర్థిక సాయంలో మానవత్వ రహిత వాదనలు చేశారు. సిఎజి ముందస్తు స్పందన, ప్రతిస్పందనల బాధ్యతలను మరిచింది. ప్రభుత్వ న్యాయవాదులు ప్రజాపక్షం కాక ప్రభుపక్షం వహించారు. ప్రణాళిక మండళ్లకు పాలకుల మాటే ప్రణాళిక. అంతర్రాష్ట్ర మండలి సంఘ్ పాలిత రాష్ట్రాల పక్షపాతిగా మారింది.ఎస్.సి., ఎస్.టి., బిసిల సంఘాలను ప్రభుత్వం పట్టించుకోదు.
లక్షద్వీప్ పాలనాధికారి చట్టాలు ఉల్లంఘనలకు ఉదాహరణలు. అధికార భాషా సంఘం, మైనారిటీ భాషల అధికారి ఉనికి కోల్పోయారు. ప్రతి చోటా సంస్కృతాన్ని రుద్దుతున్నారు. ప్రజల మాతృ భాషలను మృత భాషలు చేస్తున్నారు. నీతి ఆయోగ్, అభివృద్ధి మండలి ప్రైవేటీకరణకు మద్దతు ఇస్తున్నాయి. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మానవ హక్కుల కమిషన్లు, నిఘా, సమాచార సంఘాలు పాలకుల కుక్కలుగా మారాయి. న్యాయస్థానాల పోరుపడలేక, అధికారం చేపట్టిన ఆరేళ్లకు, కోరలు లేని పాములాంటి లోక్‌పాల్‌ను నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశించినా మోడీ గుజరాత్‌లో లోకాయత్‌ను నియమించలేదు. ఆ పని చేసిన మహిళా గవర్నర్‌ను ముప్పుతిప్పలుపెట్టి ఇంటికి పంపేదాకా నిద్ర పోలేదు. పదుల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి ఆ నియామక రద్దుకు కోర్టుల్లో దావాలు నడిపారు. నేటి బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ అడుగుజాడల్లో నడుస్తున్నాయి. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి రక్షకులెవరు? ప్రజాస్వామ్య చట్టబద్ధ సంస్థలు పాలక జేబు సంస్థలుగా మారాయి. రాజ్యాంగ సంస్థల విచ్ఛిత్తితో ప్రజలకు రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య మానవత్వ హక్కులు నిరాకరించబడ్డాయి.
పార్లమెంటు కమిటీలను నియమించకుండా ప్రతిపక్షాలను బెదిరించి, భ్రమపెట్టి, ఆశపెట్టి, బయటకు నెట్టి ఏకపక్షంగా చట్టాలు చేశారు. రాష్ట్రాల జాబితాల్లో చొరబడ్డారు. కరోనాలో ప్రత్యామ్నాయ పక్షాలు, ప్రజా సంఘాలు నిరసన తెలుపలేని స్థితిలో, అవకాశవాదంతో రాజ్యాంగ ప్రజావ్యతిరేక చట్టాలు చేశారు. పౌరసత్వ సవరణ, కొత్త విద్య, కార్మిక, వ్యవసాయ, విద్యుత్ చట్టాలు వీటిలో కొన్ని. 40 మంది సంఘ్ గూండాలు 11 ఆగస్టు 21 న రాజ్యసభలో దూరి మహిళా ఎం.పి.లపై దౌర్జన్యం చేసి బీమా చట్టం ఆమోదించుకున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థముందెన్నడూ లేనంత పక్షపాతంగా వ్యవహరిస్తోంది. తమ అనుకూల చట్టాలను అమలు చేస్తుంది. కాని వాటిని పట్టించుకోదు. కోర్టు తీర్పులనూ లెక్క చేయదు. గుజరాత్ -గోధ్రా మానభంగం- హత్యకేసులో బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టు పరిహార నగదు, ఇల్లు, ఉద్యోగం ఇవ్వమంది. అనేక అభ్యంతరాల తర్వాత నగదు ఇచ్చారు. మిగతావి ఇవ్వనేలేదు.
కోర్టు తీర్పులు సంఘ్ పాలకుల అనుకూలంగా ఉన్నాయి. 5 మంది న్యాయమూర్తుల ధర్మపీఠాల్లో కూడా అసమ్మతి నమోదు కాదు. న్యాయం ఏకపక్షంగా మారింది. అయోధ్య, రాఫెల్, ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్ల తీర్పులు వాటిలో కొన్ని. కోర్టుల్లో మా అనుకూల తీర్పులు యాధృచ్ఛికం కాదని బిజెపి ప్రముఖ నాయకుడు అన్నారు. అనుమాన న్యాయమూర్తులను హత్య చేసే రాజకీయ స్థితి దాపురించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే రెండు రోజుల్లో రిటైర్ అవుతారనగా న్యాయమూర్తుల తీరు మారింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి రమణ వ్యాఖ్యానాలు ఆశావహంగా ఉన్నా కొట్టిన వారిని శిక్షించకుండా కొట్టిన విధానం మంచిది కాదు, వాడిన ఆయుధం సరైంది కాదన్నట్లు ఉంది. చట్టాల రద్దు ప్రతిపాదించకుండా వాటి దురుపయోగాన్ని ఎత్తిచూపి లాభం లేదు. 70% మీడియా ప్రభుత్వ రాజకీయ- వాణిజ్య భాగస్వామి ముకేశ్ అంబానీ సొంతం. మిగిలిన మీడియా సంఘ్ సంస్థల యాజమాన్యంలో, ప్రభుత్వ మీడియాగా పని చేస్తోంది. స్వేచ్ఛా స్వాతంత్రాలు, సమానత్వం, ప్రజాభిప్రాయం, సంక్షేమం, పౌర, మానవ హక్కుల ప్రభుత్వ ఉల్లంఘనలను ఈ మీడియా ఎత్తిచూపదు. సమర్థిస్తుంది.
అసమ్మతి ప్రకటించే వ్యవస్థలు బలహీన పడినప్పుడు రాజ్యం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. ఆంబేడ్కర్ మనుస్మృతిని బహిరంగంగా కాల్చి నిరసన తెలిపారు. సంఘ్ సర్కారు పైకి పొగుడుతూనే లోలోపల రాజ్యాంగాన్ని కాల్చేస్తోంది. రాజ్యాంగ సవరణతో రాష్ట్రపతిగా మోడీ మారక ముందే రాజ్యాంగ విధ్వంసాన్ని ఎదిరించాలి. రాజకీయార్థిక, సామాజిక, విద్యా సాంస్కృతిక, కళా రంగాల్లో ఉద్యమించాలి.
సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545