Monday, December 23, 2024

హైదరాబాద్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరం నలువైపులా ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఆకాశ హర్మ్యాలు అంటే మనకు టక్కున సింగపూర్, మలేషియా, హాంకాంగ్‌లు గుర్తొచ్చేవి. కానీ, ప్రస్తుతం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలోనూ ఆకాశహర్మాలు విరివిగావెలుస్తున్నాయి. 20, 25, 30, 40, 55, 58 అంతస్థుల భవనాల నిర్మాణం జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్, లింగంపల్లి, తెల్లాపూర్, మంచిరేవుల, కోకాపేట్
ఖాజాగూడ , ఎల్‌బినగర్, హయత్‌నగర్, ఉప్పల్, శామీర్‌పేట్, మేడ్చల్, కొండాపూర్, పుప్పాలగూడ, కూకట్‌పల్లి, చందానగర్, బిహెచ్‌ఈఎల్ నుంచి మొదలుకొని శంకర్‌పల్లి వరకు, అమీన్‌పూర్ నుంచి సంగారెడ్డి వరకు ఆకాశహార్మాలను నిర్మించడానికి బిల్డర్లు ఆసక్తి చూపుతుండగా వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ముందుకు రావడం విశేషం. కరోనా తర్వాత దేశంలోని మెట్రో నగరాల్లో రియల్ బూమ్ సాధారణంగా ఉండగా హైదరాబాద్‌లో మాత్రం ఊహించని విధంగా వృద్ధి చెందుతోంది.
ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో 18 చోట్ల…
ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో 18 చోట్ల బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతుండగా ఇక్కడ మైస్కేప్ నిర్మాణ సంస్థ 52 అంతస్తులతో ఒక టవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదేవిధంగా సాస్ డౌన్ టౌన్ 51 అంతస్తులు, హెచ్‌ఆర్‌ఐ క్యాపిటల్ 47 అంతస్తులు, ఏక్తా వెస్ట్రర్న్ నిర్మాణ సంస్థ 46 అంతస్తులతో 4 టవర్లను 170 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు స్థలాన్ని చదును చేస్తోంది. లింగంపల్లిలో 5 టవర్లు (53 అంతస్తులు), తెల్లాపూర్‌లో స్కై గార్డెన్స్ సంస్థ 45 అంతస్తులతో రెండు టవర్లు, 42, 58 అంతస్తులతో మూడు టవర్లను నిర్మిస్తోంది. వీటితో పాటు మంచిరేవులలో 48 అంతస్తులతో నార్త్‌స్టార్ రియల్ ఎస్టేట్ సంస్థ ఐ ఇన్ ద స్కై పేరుతో హైరైజ్ భవనాన్ని 168.75 మీటర్ల ఎత్తులో నిర్మిస్తుండగా ఖాజాగూడలో సాస్ ఐ టవర్‌ను 38 అంతస్తులతో, అర్భన్‌వుడ్ త్రైవ్ సంస్థ 39 అంతస్తులతో భారీ బహుళ అంతస్తుల భవానాన్ని నిర్మిస్తోంది.

వీటితో పాటు డిఎస్‌ఆర్ ది ట్విన్స్, ఫీనిక్స్ బీ హబ్, సుమధుర ఒలంపస్ సంస్థలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో 45 అంతస్తులతో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నాయి. సాస్ క్రౌన్ పేరుతో ఖాజాగూడలో మూడు టవర్లు ఒక్కో దానిని 58 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 55 అంతస్తులతో మరో ఆకాశహర్మ్యాన్ని పౌలోమి, 50 అంతస్తులతో మై హోం కన్‌స్ట్రక్షన్ సంస్థ మై హోం లైఫ్ హబ్ పేరుతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నాయి.
కోకాపేట నుంచి 12 దరఖాస్తులు
ఇప్పటివరకు 50 అంతస్తులకు పైబడిన భవన నిర్మాణాల కోసం కోకాపేట నుంచి 12 దరఖాస్తులు రాగా వీటితో పాటు మరో 36 అంతస్తులకు పైబడిన మరిన్ని భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కోకాపేట తర్వాత గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో భారీ అంతస్తులు వెలుస్తున్నాయి. ఆకాశహర్మ్యాల్లో క్లబ్ హౌస్‌తో పాటు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్ హౌస్ ని 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో 18 నుంచి 20 అంతస్థుల నిర్మాణాలు
ఎల్‌బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో 20, 30 అంతస్తులతో కూడిన ఆకాశ హర్మ్యాల నిర్మాణం ఇప్పటికే మొదలు కాగా ఈ రెండు ప్రాంతాల్లో 30 అంతస్తుల భవన నిర్మాణాల కోసం సుమారు 100 దరఖాస్తులు వచ్చాయని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. 18, 20 అంతస్తుల భవనాల నిర్మాణాలు పలు ప్రాంతాల్లో మొదలు కాగా మరికొన్ని అనుమతుల జారీ పరిశీలన దశలో ఉన్నాయి. ఎల్‌బినగర్, హయత్‌నగర్ వైపు రెండుచోట్ల 30 అంతస్తుల భవన నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే కసరత్తు మొదలైంది. విజయవాడ జాతీయ రహదారి దగ్గరలో హయత్‌నగర్ వైపు ఓ నిర్మాణ సంస్థ, ఎల్‌బీనగర్ చౌరస్తా సమీపంలో మరో సంస్థ 30 అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేశాయి.
కనీసం 100కి పైగా ఇలాంటి నిర్మాణాలు
ఇప్పుడు నగరం చుట్టుపక్కల విరివిగా వెలుస్తున్న ఆకాశహర్మాలు నగరానికి కొత్త అందాలను తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం కనీసం 100కి పైగా ఇలాంటి నిర్మాణాలు శివారు పశ్చిమదిక్కున వెలుస్తున్నాయి. ముఖ్యంగా నగర పశ్చిమ ప్రాంతంలో అత్యాధునికతకు నిలువెత్తు నిదర్శనంగా ఆకాశ హర్మాలు వెలుస్తున్నాయి. ఒకప్పుడు కేవలం 15 అంతస్థులకే పరిమితమైన భవనాలు ఇప్పుడు 50 అంతస్థులకు పైగా భవనాలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి.
రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు
30 నుంచి 50 అంతస్తుల భవనాల్లో స్కైవిల్లాలు వస్తున్నాయి. ప్రాజెక్టును లాభసాటిగా మార్చుకునేందుకు ఈ తరహా నిర్మాణాలను బిల్డర్లు చేపడుతున్నారు. ఆకాశహర్మ్యాల్లో ఎత్తుకు వెళ్లేకొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతోందని బిల్డర్లు పేర్కొంటున్నారు. ఒక్కో ప్లాట్ ధర సుమారుగా రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్ల ఉంటుందని బిల్డర్లు పేర్కొంటున్నారు.
త్వరలోనే మరో ఆరు అల్ట్రా లగ్జరీ టవర్ల నిర్మాణం
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన ది ట్రంప్ ఆర్గనైజేషన్ మరో ఆరు అల్ట్రా లగ్జరీ టవర్లను హైదరాబాద్ పరిధిలో లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం గుర్గావ్ కు చెందిన ట్రిబెకా డెవలపర్స్ తో ట్రంప్ సంస్థ చర్చలు జరుపుతోంది. 2023 లోపు కనీసం రెండు ప్రాజెక్టులైనా ప్రారంభించాలని ట్రంప్ సంస్థ యోచిస్తోంది. వాస్తవానికి ట్రంప్ ఆర్గనైజేషన్ అమెరికాలో కాకుండా ఈ ప్రాజెక్టుల్లో నేరుగా పెట్టుబడి పెట్టదు. భారతదేశంలో ట్రంప్ బ్రాండ్ ప్రాపర్టీలను డెలివరీ చేసే బాధ్యత ట్రిబెకాదే. ట్రంప్ సంస్థ తన నైపుణ్యాలను ట్రిబెకాకు అందజేస్తుంది. పుణె, ఢిల్లీలోని ట్రంప్ టవర్లను ట్రిబెకా సంస్థే చేపట్టింది.

ప్రస్తుతం ట్రంప్ బ్రాండ్ కింద ఆరు కొత్త ఒప్పందాలు తుది దశలో ఉండగా, అందులో వచ్చే 12 నెలల్లో 3 నుంచి 5 ప్రాజెక్టులను ప్రారంభించాలని ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాబోయే ట్రంప్ ప్రాజెక్టుల్లో రెసిడెన్షియల్ అల్ట్రా లగ్జరీ అపార్ట్ మెంట్లు కాకుండా రెండు వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి పుణెలో వచ్చే అవకాశం ఉండగా హైదరాబాద్, బెంగళూరు, లూథియానా, చండీగఢ్ వంటి నగరాల్లో మిగిలిన ప్రాజెక్టులను లాంచ్ చేయాలని ఆ సంస్థ యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News