డామియన్ సైమన్ ఉపగ్రహ చిత్రాలు వెల్లడి
న్యూఢిల్లీ : దేశ సరిహద్దు లోని తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెనను నిర్మిస్తున్నట్టు జియోలాజికల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ పొందిన ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. చైనా భూభాగంలో ఉన్న పాంగాంగ్ సరస్సులో చైనా అధీనం లోని ఖురాంక్ ప్రాంతంలో ఒక భాగం మీదుగా వంతెనను నిర్మిస్తున్నట్టుగా ఈ చిత్రాల ద్వారా తెలుస్తోంది. సరస్సు రెండు ఒడ్డులను కలుపుతూఏ వంతెనను నిర్మిస్తున్న ఈ ప్రదేశం అత్యంత ఇరుకుగా ఉంటుంది. రెడీమేడ్ సామగ్రితో పనులు చేపట్టారు. ఖురాంక్ నుంచి దక్షిణ సరిహద్దుకు చేరుకునేందుకు ఈ నిర్మాణం జరుగుతోంది. వంతెన నిర్మాణం దాదాపు పూర్తయినట్టుగా కనిపిస్తోంది. దీంతో సైనికులు, భారీ ఆయుధాలను సరిహద్దు ప్రాంతాలకు త్వరగా తరలించే సామర్ధం చైనాకు చేకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే చైనా దళాలే 180 కిలో మీటర్లు చుట్టు తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది.
ఖురాంక్ నుంచి రుడాంక్‌కు దాదాపు 50 కిమీ మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. ఈ దూరం 200 కిమీ పైగా ఉంటుంది. దాదాపు 130 కిమీ పొడవున్న పాంగాంగ్ సరస్సులో కొంతభాగం టిబెట్‌లో ఉండగా, మరికొంత భాగం లడ్డాఖ్ ప్రాంతంలో ఉంది. 2020 ఆగస్టులో కైలాశ్ రేంజిపై ఆపరేషన్ చేపట్టాక చైనా సైన్యం సత్వరమే స్పందించి ప్రతిఘటించలేక పోయింది. ఫలితంగా భారత దళాలు అక్కడ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి. చైనాదళాలు అక్కడకు చేరుకోడానికి కనీసం 24 గంటలకు పైగా సమయం పట్టింది. ఈ నేపథ్యంలో చైనా అక్కడ భారత దళాలు నిర్వహించే ఆపరేషన్లను అడ్డుకోడానికి వివిధ రకాల మార్గాలను అభివృద్ది చేస్తోంది. 2021 లో ఈ ప్రదేశంలో రహదారుల నిర్మాణం చేపట్టింది. 2020 ఆగస్టు 29 30 అర్ధరాత్రి భారత్ కైలాశ్ రేంజి స్వాధీనం ఆపరేషన్ మొదలైంది. మెరుపు వేగంతో కైలాశ్ రేంజిగా పేరున్న పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగం లోని శిఖరాలను స్వాధీనం చేసుకున్నాయి. ఆగస్టు చివరివరకు ఈ శిఖరాలు భారత్, చైనాల స్వాధీనంలో లేవు. చివరికి ఈ శిఖరం కోసం చైనా చేసేది లేక పాంగాంగ్ సరస్సు వద్ద దళాల ఉపసంహరణకు అంగీకరించింది.