Sunday, May 11, 2025

చరిత్రకు ఆనవాళ్లు వారసత్వ కట్టడాలు

- Advertisement -
- Advertisement -

గతానికి సంబంధించిన అనుభవాలు, ఆనవాళ్ళు, గత వైభవానికి సంబంధించిన విశేషాలు భావితరాల భవిష్యత్తుకు పునాదులు. ఇదే వారసత్వ సంపద. గత కాలంనాటి నిర్మాణాలు, యుద్ధాలు, విధ్వంసాలు ఇవన్నీ చరిత్ర పుటల్లో ఇమిడిపోతాయి. ఏ దేశ ఔన్నత్యానికైనా ఆ దేశం పురాతన వారసత్వ సంపద తలమానికంగా నిలుస్తుంది. గతించిన కాలానికి చెందిన జ్ఞాపకాలు, చరిత్రలో స్థానం సంపాదించుకుని తరతరాలకు అందించడం జరుగుతున్నది. ఇదే వారసత్వ సంపద. చారిత్రాత్మక సంఘటనలు, అరుదైన, అద్భుతమైన జ్ఞాపకాలు కేవలం చరిత్ర పుస్తకాలకు అలంకారాలుగా మారకూడదు. మంచైనా, చెడైనా చరిత్ర స్వీకరించాల్సిందే. మంచి చెడుల అనుభవాలను, జ్ఞాపకాలను భావితరాలకు అందించాల్సిందే. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గమనించి మానవ మనుగడ సాఫీగా సాగడానికి గత చరిత్ర వారసత్వ సంపదరూపంలో ఎంతగానో ఉపయోగ పడుతుంది. మన సంస్కృతీ సాంప్రదాయాలతో పాటు, ఘనమైన గతం కూడా కాలగర్భంలో కలసిపోయి వృథాగా మారితే భవిష్యత్తు పునాదులు బలహీనమవుతాయి.

అందుకే గత జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకోవాలి. గతకాలం నాటి వివిధ దేశాలకు సంబంధించిన పలు చారిత్రక జ్ఞాపకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. సందర్శకులకు అలనాటి విశేషాలు ఈనాటికీ అవశేషాలుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు యునెస్కో 168 దేశాలకు చెందిన 1,223 ప్రాంతాలను వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. భారత దేశానికి సంబంధించిన 43 ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదకు నిలయాలుగా గుర్తించింది.శిల్పసౌందర్యం, అద్భుతమైన కుడ్య చిత్రాలు, సహజసిద్ధమైన గుహలు, చారిత్రక నిర్మాణాలు, గత యుద్ధాలకు శిధిలమైన వివిధ ప్రాంతాలు, విజయాలకు, అపజయాలకు సంబంధించిన చారిత్రక అవశేషాలు వారసత్వ సంపద క్రిందకు వస్తాయి. 1982వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం జరపాలనే ప్రతిపాదనకు అంకురార్పణ జరిగింది.

1983 సంవత్సరంలో యునెస్కో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మొదటి ‘ప్రపంచ వారసత్వ సంపద’ దినోత్సవం 1983 ఏప్రిల్ 18న ట్యునీషియాలో జరిగింది. 1945 వ సంవత్సరం, నవంబర్ 16వ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ‘వరల్డ్ హెరిటేజ్ సెంటర్’ ప్రధాన కేంద్రంగా యునెస్కో ఏర్పడింది. భారత్‌లో మొట్టమొదట వారసత్వ సంపద హోదా లభించిన వాటిలో అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట తాజ్ మహల్‌లు ఉన్నాయి. అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్, కోణార్క్‌లోని సూర్యదేవాలయం, తమిళనాడులోని మహాబలిపురం, అసోంలోని కజీరంగా జాతీయ పార్క్, రాజస్థాన్‌లోని కియొలాడియో జాతీయ ఉద్యానవనం, అసోంలోని మనాస్ వైల్ లైఫ్ అభయారణ్యం, గోవాలోని చర్చిలు, మధ్యప్రదేశ్‌లోని ఖజరహో శృంగార శిల్పాలు, కర్నాటకలోని హంపి నిర్మాణాలు, ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ, మహా రాష్ట్రలోని ఎలిఫెంటా గుహలు, ఇలా వివిధ రాష్ట్రాల్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పురావస్తు సంపద ఎంతో ఉంది.

ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, కుతుబ్ మీనార్, జంతర్ మంతర్, ఎర్రకోట, కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఉన్న పశ్చిమకనుమలు, రాజస్థాన్‌లోని హిల్ ఫోర్ట్ ఇత్యాదులు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉన్నాయి. జైపూర్‌ను పింక్ సిటీగా పారిస్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు, ఇక్కడ కట్టడాల రంగుల విశిష్ఠతను బట్టి ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సి.వి.రామన్ దీనిని ‘ఐలాండ్ ఆఫ్ గ్లోరీ’ గా అభివర్ణించాడు. ‘జైపూర్ పింక్ సిటీ’ యునెస్కో గుర్తింపు పొంది, విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీని అక్బర్ 16వ శతాబ్దంలో నిర్మించాడు. ఇది ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందింది. తమిళ నాడులోని చోళ వంశీయుల దేవాలయాలు యునెస్కో గుర్తింపు పొందాయి.

తంజావూరు లోని బృహదీశ్వర ఆలయం పురాతన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయానికి వారసత్వ సంపద గుర్తింపు రావడం తెలుగు వారికి గర్వకారణం. ఎన్నో యుద్ధాలను, దాడులను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలచిన రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందింది. ఏకశిలతో నిర్మించిన రామలింగేశ్వరుని విగ్రహం, ఆలయ గోపురం నీటిపై తేలియాడడం రామప్ప దేవాలయ విశిష్టత. ఇది దేశంలోని 39 వ ప్రాచీన వారసత్వ కట్టడంగా, తెలుగు వారికి లభించిన గౌరవంగా పేర్కొనాలి. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలోకి చేరింది. తెలుగు నేలపై ఎంతో పురాతన వారసత్వ సంపద మిళితమై ఉంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో అనేక చారిత్రక కట్టడాలున్నాయి.

చార్మినార్, గోల్కొండ కోట, మక్కా మసీదు, సాలార్జంజ్ మ్యూజియం, తాజ్ ఫలక్‌నామా వంటి పురాతన కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా పరిగణించాలి. హనుమ కొండలోని వేయి స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్, భువనగిరి ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లి గుహలు, తిరుమల తిరుపతి, ద్వారకా తిరుమల, నాగార్జునకొండ, అమరావతి కట్టడాలు, రాజమండ్రిలోని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, ధవళేశ్వరం బరాజ్, అనంతపూర్ దగ్గరున్న పెనుకొండ ఫోర్ట్, విజయవాడ దగ్గరున్న కొండపల్లి దుర్గం, కర్నూల్ దగ్గరున్న ఆదోని ఫోర్ట్, కర్నూలు సమీపంలోని కొండారెడ్డి బురుజు, అనంతపురం వద్ద గూటీ ఫోర్ట్, అరకులోని బొర్రా గుహలను యునెస్కో వారు హెరిటేజ్ ప్రాపర్టీగా ప్రకటించాలి. వారసత్వ సంపద ఒక వరం. అది ఆయా దేశాల గౌరవ ప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తుంది.

సుంకవల్లి సత్తిరాజు
97049 03463                                                                   ( నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News