Thursday, September 19, 2024

అధికారుల నిర్లక్ష్యం.. రీడింగ్ సిబ్బంది తప్పిదం!

- Advertisement -
- Advertisement -

Consumer Outrage over high electricity bills

హైదరాబాద్ : ప్రస్తుతం విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని వినియోగదారులు, కాదు, వాడుకున్నంత మేరకే బిల్లులను వేశామని విద్యుత్ సంస్థలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ, ప్రస్తుతం చూసుకుంటే కొన్నిచోట్ల అధికారుల నిర్లక్షం రీడింగ్ చేసే సిబ్బంది తప్పిదంతో వినియోగదారుడిపై మోయలేని భారం పడిందన్న విమర్శలు నెలకొంటున్నా యి. అయితే ఈ తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పటికే విద్యుత్ సంస్థలు హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయినా బిల్లుల విషయంలో వినియోగదారుల సందేహాలను తీర్చడంలో అధికారుల నిర్లక్షం ప్రస్తు తం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. స్వయానా టిఎస్‌ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డితో పాటు మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలు విలేకరుల సమావేశంలో బిల్లుల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసుకోవడానికి హెల్ప్‌డెస్క్‌లను ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

మిగతా వారు వాయిదా పద్ధతిలో చెల్లించేలా…

అయితే వినియోగదారులు హెల్ప్‌డెస్క్‌ల వద్దకు వెళ్లేముందు స్థానిక విద్యుత్ అధికారుల వద్ద తమ సమస్య నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారు స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ పంపించిన బిల్లులను కొంతమంది చెల్లించగా, మిగతా వారు వాయిదా పద్ధతిలో బిల్లులను కట్టుకొని ఈ బాధ నుంచి విముక్తి పొందడానికి తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పదిరోజుల్లోనే సుమారు 9 వేల మంది వినియోగదారులు హెల్ప్‌డెస్క్‌ల వద్ద అధిక బిల్లులకు సంబంధించి ఫిర్యాదులు చేసినట్టుగా సమాచారం. మరికొందరు మాత్రం అధిక బిల్లులకు సంబంధించి ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడానికి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఎవరికి వారు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయం లో తమ తోచిన విధంగా ముందుకెళుతున్నారు. అయితే వినియోగదారుల ఇబ్బందులు ఇలా ఉంటే విద్యుత్ అధికారులు మాత్రం లాక్‌డౌన్ నేపథ్యంలో కరెంట్ వాడకం ఎక్కువయ్యిందని దానికి సంబంధించిన లెక్కలు చూపెడుతున్నారు.

95.13 లక్షల మందికి పైగా వినియోగదారులు

టిఎస్‌ఎస్పీడిసిఎల్‌లో 95.13 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉండగా, 75 లక్షల మంది డొమెస్టిక్ వినియోగదారులున్నారన్నారు. ఇందులో 200 యూనిట్లకంటే తక్కువ వాడే వారు 86 శాతం మంది ఉంటారు. మార్చి నెలలో 67 శాతం మంది, ఏప్రిల్ నెలలో 44 శాతం మంది, మే నెలలో 68 శాతం మంది బిల్లులను చెల్లించగా మొత్తంగా ఈ మూడు నెలల్లో సరాసరి 60 శాతం మంది మాత్రమే విద్యుత్ బిల్లులను చెల్లించారని, మరో 40 శాతం మంది బిల్లులు చెల్లించలేదని టిఎస్‌ఎస్పీడిసిఎల్ పేర్కొంటోంది. గృహ వినియోగంలో తొమ్మిది స్లాబ్‌లు, మూడు కేటగిరీలు ఉన్నాయని, స్లాబులు మారడం వల్ల కేటగిరీలు మారాయని దీంతో అధిక బిల్లులు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు.

13 శాతం పెరిగిన కరెంట్ వినియోగం

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వేసవికాలంలో కరెంట్ వాడకం పెరిగిందని, కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ఉన్నారని అందులో భాగంగానే బిల్లులు ఎక్కువగా వచ్చాయని టిఎస్‌ఎస్పీడిసిఎల్ పేర్కొంటోంది. వేసవి కాలంలో స్లాబ్ మారితే బిల్లు చేంజ్ అవుతుందని, గత సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే నెలలను తీసుకుంటే 107 రీడింగ్ వచ్చిందని, ఈ వేసవికాలంలో కరెంట్ వినియోగం 13 శాతం పెరిగిందని, ఈ 13 శాతంతోనే స్లాబ్‌లు మారాయని, అందులో భాగంగానే బిల్లులు పెరిగాయని అధికారులు పేర్కొంటున్నారు.

గ్రేటర్ పరిధిలో గురువారం 40 మి.యూనిట్ల వాడకం

గృహ అవసరాల నిమిత్తం జూన్, 2019 సంవత్సరంలో 63 మిలియన్ యూనిట్ల విద్యుత్ (ఒక్కరోజుకు)ను గ్రేటర్ హైదరాబాద్ వాసులు వాడుకోగా, మే నెలలో 74 మి.యూ., జూలైలో 56 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడుకున్నట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 2020, మే నెలలో 69 మి.యూ. నమోదు కాగా, ఈనెల 18వ తేదీ 40 మి.యూ. నమోదయ్యిందని టిఎస్‌ఎస్పీడిసిఎల్ అధికారులు పేర్కొంటున్నారు. మార్చి, 03వ తేదీ 2020 (రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజుకు) 237 మిలియన్ యూనిట్లు నమోదు కాగా, మే నెల 159 మి.యూ. (రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజుకు), ఈనెల 18వ తేదీ (రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజుకు) 143 మిలియన్ యూనిట్లను గృహ అవసరాల కోసం విద్యుత్‌ను వినియోగదారులు వాడుకున్నారని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News