Sunday, December 22, 2024

వినియోగదారుల విషాదం

- Advertisement -
- Advertisement -

అడుగడుగునా దగా పడుతున్న వినియోగదారులను ఏ చట్టాలు కాపాడుతున్నాయి? ఎన్ని వినియోగదారుల చట్టాలున్నా వస్తు సేవల విషయంలో వినియోగదారులకు న్యాయం జరగడం లేదు. దళారులు సృష్టించిన నూతన ఆర్ధిక సూత్రాలను విశ్లేషించి, ఉత్పత్తిదారులకు, వినియోగ దారులకు లాభదాయకమైన పద్ధతులను అన్వేషించడంలో ఆర్ధిక శాస్త్ర మేధావులు, ప్రభుత్వాలు విఫలం కావడం వలన అనేక అనర్ధాలు జరుగుతున్నాయి.

ఇలాంటి అనైతిక వ్యాపార ధోరణులను అరికట్టి వినియోగదారులను ఆర్ధిక దోపిడీ నుంచి కాపాడాలి. ఉత్పత్తికి, వినియోగానికి మధ్య అవినాభావ సంబంధం నెలకొని ఉంది. వినియోగం లేని ఉత్పత్తికి విలువ లేదు. వినియోగదారుడే అభివృద్ధికి ఆలంబన. వినియోగం లేకపోతే ఉత్పత్తికి విలువ లేదు. అందుకే వినియోగదారులను గౌరవిస్తూ, వారిని మోసాలకు గురి కాకుండా కాపాడాలి. ప్రమాదకరమైన వస్తువుల తయారీ, ప్రాణ హాని గల వస్తుసేవల ఉత్పత్తి, వినియోగం తదితర అంశాలపై వినియోగదారులకు గల చట్టబద్ధమైన హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే వినియోగదారుల చట్టాలు చేయబడ్డాయి.

వినియోగదారుల రక్షణకై న్యాయ స్థానాల ఏర్పాటు కూడా జరిగింది. వినియోగదారుల ఉద్యమం తొలుత అమెరికాలోనే ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతుంది. అమెరికాలో మొదటిసారిగా 1920 లో వినియోగదారుల సంఘం ఏర్పడింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నార్వే, డెన్మార్క్ లలో వినియోగదారుల సంఘాలు ఏర్పడ్డాయి. ఆ స్ఫూర్తితోనే వినియోగదారుల ఉద్యమం ప్రపంచమంతా వ్యాపించింది. అమెరికాలో క్రీ.శ 1900, 1930, 1960 సంవత్సరాల్లో వినియోగదారుల ఉద్యమాలు జరిగాయి. ఇంగ్లాండ్‌లో 1925లో, నెదర్లాండ్ లో 1926 లో వినియోగదారుల హక్కుల కోసం పోరాటాలు జరిగినట్టుగా తెలుస్తున్నది.

భారత దేశంలో ప్రాచీన కాలం నుండే వినియోగదారుల రక్షణకు బీజం పడిందని, కౌటిల్యుని అర్ధశాస్త్రంలో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నట్లు మనకు తెలుస్తున్నది. ఏది ఏమైనప్పటికీ విజ్ఞానం అభివృద్ధి చెంది ముద్రణా యంత్రా లు, సమాచార సాధనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనా సరళిలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. తమ న్యాయపరమైన హక్కుల కోసం గళమెత్తే చైతన్యం వెల్లివిరిసింది. 1962, మార్చి 15వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్.కెనడీ వస్తు, సేవల విషయం లో కొనుగోలుదారునికి కావలసిన న్యాయపరమైన హక్కుల కోసం అమెరికా కాంగ్రెస్ (దిగువసభ)లో వినియోగదారుల బిల్లును ప్రతిపాదిస్తూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ గురించి ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు.

కెనడీ చేసిన ప్రసంగ ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రసంగం ఒక స్ఫూర్తిని కలిగించింది. ప్రముఖ అమెరికా రచయిత, రాజకీయవేత్త, వినియోగదారుల హక్కులకై పోరాడిన ‘రాల్ఫ్ నాడార్’ వినియోగదారుల హక్కుల పితామహుడిగా పేరొందాడు. భారతదేశంలో ప్రప్రథమంగా వినియోగ దారుల చట్టం 1986లో ఆమోదించబడింది. 1985లో ఐక్యరాజ్యసమితి వినియోగదారుల హక్కులను గుర్తిస్తూ తీర్మానం చేసి ఆమోదించడం, దీనిని హర్షిస్తూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ లోక్‌సభలో 1986లో భారతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. 1986లో భారత్‌లో అమలులోకి వచ్చిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ముఖ్యోద్దేశం లాభాపేక్ష గల వ్యాపారుల దోపిడీని అరికట్టి, వినియోగదారుల హక్కులను, బాధ్యతలను గుర్తు చేసి, వారిని చైతన్యపరచడం, న్యాయం ప్రసాదించడం. 2019లో కూడా లోక్ సభలో నూతన వినియోగదారుల రక్షణ చట్టం ప్రవేశ పెట్టడం జరిగింది.

భారత దేశంలో ప్రతీ ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటారు. వస్తువుల ఉత్పత్తిలో నాణ్యతాపరమైన లోపాలు, తూనికలు, కొలతల్లో అవకతవకలు, స్వచ్ఛత లేకపోవడం, ప్రమాదకరమైన వస్తు ఉత్పత్తుల నుండి రక్షణ, ఆరోగ్య పరిరక్షణ వంటివి చట్టబద్ధంగా వినియోగదారుడికి లభించిన హక్కులు. కేవలం కాసుల కోసం కక్కుర్తితో వినియోగదారులను దారుణంగా మోసం చేయడం, తూనికలు, కొలతల్లో తేడా నాణ్యతాపరమైన ప్రమాణాలకు తిలోదకాలిచ్చి కల్తీ సరుకులను విక్రయించడం, డిమాండ్‌కు తగ్గ రీతిలో సరఫరా చేయకుండా నల్లబజారుకు తరలించి నిత్యావసర వస్తువులను, ఇతర సరుకులను అత్యధిక ధరలకు అమ్మడం వంటి అనైతికమైన ధోరణులపై తమకు జరిగిన అన్యాయాలను ఎదిరించి, వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కలగడం ప్రజలకు లభించిన వరం.

థోరిస్టైన్ వెబ్లెన్, రాల్ఫ్ నాడార్, హెర్బ్‌ట్ హోవర్ లాంటి మహామహులు వినియోగదారుల ఉద్యమం లోకి ప్రవేశించడం వలన ప్రజల్లో మరింత క్రియాశీలత పెరిగింది. జాన్ ఎఫ్ కెనడీ ప్రవచించిన సేప్టీ, ఇన్ఫర్మేషన్, చోయస్, వాయస్, రెడ్రెస్ వంటి సూత్రాలు వినియోగదారుల ప్రపంచానికొక దిశానిర్దేశం చేశా యి. భారత దేశంలో కూడా మహాత్మాగాంధీ వినియోగదారుని ప్రాధాన్యత గురిం చి కూలంకషంగా వివరించారు. వినియోగదారుడంటే మన గుమ్మం తట్టే సందర్శకుడని, వినియోగదారుని వలన ఉత్పత్తిదారుడు లాభపడతాడని, అలాంటి వినియోగదారుడిని గౌరవించడమంటే దేశాన్ని ఆర్థికపథం లో నడిపించడమేనని వివరించారు. తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, తమ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో మక్కువ పెరగడానికి పేరొందిన వ్యక్తులతో, సెలబ్రిటీలతో వ్యాపార ప్రకటనలు గుప్పిస్తున్నారు.

వస్తువుల నాణ్యతను బట్టి కాకుండా సెలబ్రిటీల ఆకర్షణను ఎరగా వేసి, వినియోగదారులను పెడదారి పట్టించడం భావ్యంకాదు. లక్షలు, కోట్లు గుమ్మరించి వ్యాపార ప్రకటనలివ్వడమంటే ఆ భారం కూడా వినియోగదారుడి మీదే పడుతుంది. వంద రూపాయల సరకు ఐదొందలవుతుంది. ఇది మోసం కాదా? అనవసరమైన ప్రకటనల పేరుతోనో, ఆకాశ హర్మ్యాలను చూపి స్తూ, ఆర్భాటాలతో వస్తువు నికర ధర కంటే అధిక మొత్తం భారం వినియోగదారునిపై మోపడం మోసం కాదా? ఇలాం టి కృత్రిమ ప్రచారాలకు, అనవసరమైన ఆర్భాటాల నడుమ వస్తువుల ధరలను పెంచడం పట్ల వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి మోసపూరితమైన విధానాలను కట్టడి చేయాలి. వినియోగదారుల్లో ఎంతగా చైతన్యం ప్రబలినా ఫలితం మాత్రం నామమాత్రంగానే కనిపిస్తున్నది.

ప్రతీ సమస్య పైనా నిరంతరం పోరాడే తీరిక, ఓపిక నశించి ‘అందరితో పాటే మనం’ అనుకుంటూ ప్రజలు కూడా చైతన్యం నుంచి స్తబ్దత వైపు పయనిస్తున్నారు. ఇది బాధాకరమైన విషయమే. ప్రభుత్వాలే మార్కెట్‌లోకి విడుదలయ్యే వస్తువులపై శ్రద్ధ పెట్టాలి. వస్తువుల నాణ్యత విషయంలోనూ, నకిలీ వస్తువుల తయారీ పట్ల కఠినమైన నిబంధనలు విధించాలి. వినియోగదారుల హక్కులను కాపాడాలి. స్వచ్ఛతా ప్రమాణాలతో కూడిన వస్తూత్పత్తులతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి. ఆహార పదార్ధాల కల్తీ అరికట్టబడాలి, ప్లాస్టిక్ వినియోగం తగ్గాలి. పర్యావరణం మెరుగు పడాలి. వినియోగదారుల్లో చట్టాల పట్ల, తమకున్న హక్కుల పట్ల అవగాహన కలగాలి. వినియోగదారుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలి. వినియోగదారుల్లో చైత న్యం రావాలి.

ప్లాస్టిక్ వాడకాన్ని నిలువరించాలి. ప్లాస్టిక్ సమస్య ప్రభుత్వాల ముందున్న పెను సవాల్. ప్రభుత్వాలే ప్లాస్టిక్ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలి. ధనార్జన కోసం ప్రజలను నట్టేట ముంచే కల్తీపై దృష్టి సారించాలి. నాణ్యతా ప్రమాణాలతో కూడిన వస్తువులను కొనుగోలు చేయగలిగే స్తోమత ప్రజలకు లేదు. కాబట్టి ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని పెంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల తలసరి ఆదాయం ఎక్కువ. ఆదాయం పెరిగితే నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసే ఆర్ధిక శక్తి పెరుగుతుంది. అరకొర ఆదాయంతో ఖరీదైన, నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయడం అసాధ్యం కనుక, ఈ బలహీనత దోపిడీ దారుల నకిలీ దందాకు ఊపిరి పోస్తున్నది. కాబట్టి ప్రప్రథమంగా ప్రజల ఆదాయ మార్గాలు పెంచాలి. జీవన ప్రమాణ స్థాయి పెంచాలి. అప్పుడే వినియోగదారులు నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయగలరు.

-సుంకవల్లి సత్తిరాజు-9704903463

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News