హైదరాబాద్ : విద్యుత్ సంస్థలకు వినియోగదారులే యజమానులు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలని సూచించారు. అటువంటి వినియోగదారుల పట్ల పాజిటివ్ దృక్పథంతో వ్యవహరించ గలిగితే సంస్థాపరంగా అద్భుతమైన విజయాలు నమోదు చేసుకోవొచ్చని ఆయన తెలిపారు. టిఎస్ ఎస్‌పిడిసిఎల్‌లో నూతనంగా నియమితులైన 48 అసిస్టెంట్ ఇంజినీరింగ్ ఉద్యోగులకు మింట్ కాంపౌండ్‌లోని టిఎస్ ఎస్‌పిపిడిసిఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామకపు ఉత్తర్వులను మంత్రి జగదీష్ రెడ్డి అంద జేశారు. టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చేసే పనిని ఇష్టంగా చేయగలిగినప్పుడు మాత్రమే ఆ పని కష్టం అనిపించదన్నారు. విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో వినియోగదారుల పట్ల అనుచితంగా ప్రదర్శించ రాదని మంత్రి జగదీశ్ రెడ్డి హితవు పలికారు. విద్యుత్ సంస్థలో నూతనంగా చేరే వారికి సిఎండిలు దేవులపల్లి ప్రభాకర్ రావు, రఘుమారెడ్డిలు రోల్ మోడల్ కావాలని ఆయన ఉద్బోధించారు. 50 సంవత్సరాలు ఒకే సంస్థలో పని చేసిన రికార్డ్ ప్రభాకర్ రావు నమోదు చేసుకున్నారన్నారు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆఫర్ చేసినా ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల ఉన్న విశ్వాసంతో తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలను సంస్కరిస్తున్నారన్నారు. అదే సమయంలో టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి విద్యుత్ సంస్థను ఇల్లు అనుకుని సంస్థలో పనిచేసే సిబ్బందిని కుటుంబం అనుకుని తనకున్న అపార అనుభవంతో పారదర్శకంగా సంస్థను నడిపిస్తున్నారన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారు వీరిద్దరిని రోల్ మోడల్ గా ఎంచుకుంటే భవిష్యత్ మొత్తం మీదేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక్క విద్యుత్ సంస్థలొనే 30 వేల ఉద్యోగ నియామకాలు జరిగాయన్నారు. అందులో 22 వేలు క్రమబద్దీకరించుకున్న విషయాన్ని ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాలు జరగ లేదు అనే వారికి కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు చెంప చెల్లు మనిపించేలా సమాధానం చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అనంతరం ట్రాన్స్‌కో జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు మాట్లాడుతూ 12 వేల మంది ఎఇ పరీక్షలు రాయగా అందులో 48 మంది సెలెక్ట్ అయ్యారన్నారు. వీరు ఎస్‌పిడిసిఎల్‌లో ఉద్యోగం సాధించినందుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. విద్యుత్ శాఖకు వినియోగదారులు చాలా ముఖ్యమని, వారి పట్ల సఖ్యతతో ఉండాలని హితవు పలికారు. ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని నూతన ఉద్యోగులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ముందుకు పోవాలని ఆయన హితవు పలికారు. కొత్త ఉద్యోగులు కష్టపడి పని చేసి సంస్థకు మంచి పేరు తేవాలని కోరారు. కాగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో ఎస్‌టి కేటగిరివారికి ఇప్పటి వరకు ఉన్న 6 శాతం రిజర్వేషన్లను తాజాగా 10 శాతంకు పెంచారు. ఫలితంగా 48 మందిలో 5 గురు అభ్యర్థులు ఎస్‌టి కోటలో ఏఈ లుగా నియామకం కావడం విశేషం.