తల్లులు గర్భధారణ సమయంలో నికొటిన్ ఉత్పత్తులను వినియోగిస్తే పుట్టబోయే బిడ్డకు ఆకస్మిక మరణం సంభవించే ప్రమాదం ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే గర్భస్థ మొదటి పరీక్ష జరగక ముందే నికొటిన్ ఉత్పత్తులను వినియోగించడం మానేస్తే చాలా వరకు రిస్కు తగ్గుతుంది. నికొటిన్ ఉత్పత్తులు అంటే ఎక్కువగా పొగాకు ఉత్పత్తులే. పొగాకును నమలడం కానీ, లేక నశ్యాన్ని ఉపయోగించడం కానీ చేస్తే నోరు, గొంతు , శ్వాసనాళ క్యాన్సర్లు వస్తాయని మనలో చాలా మందికి తెలుసు.
కానీ గర్భిణులు మాత్రం వీటి వినియోగం వల్ల తమ కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకే ప్రమాదం తెచ్చినవారవుతారని స్వీడన్ లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు తమ అధ్యయనం ద్వారా వెలుగు లోకి తెచ్చారు. జర్నల్ పీడియాట్రిక్ రీసెర్చిలో ఈ అధ్యయనం వెలువడింది. పొగరాని పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా తల్లులు వాడుతుంటారు. ఇందులో స్నస్ అనే పొగాకు ఉత్పత్తి ఎక్కువగా వినియోగంలో ఉంటోంది. స్నస్ అంటే తడితో కూడిన పొగాకు పొడి వంటిది, మీది పెదవి కింద దీన్ని వేలితో అద్దుకొని మింగకుండా బుగ్గల్లో పెట్టుకుంటుంటారు.
30 నిమిషాల పాటు అలా నోటిలో ఉంచుకుంటారు. స్వీడన్ పరిశోధకులు గర్భధారణ సమయంలో అన్నిరకాల నికొటిన్ ఉత్పత్తులను విడిచిపెట్టాలని హెచ్చరించారు. ఈ పరిశోధనలో 1999 నుంచి 2019 మధ్య కాలంలో పుట్టిన 20 లక్షల మంది శిశువులను అధ్యయనం చేశారు. ఈ సమయంలో కేవలం 10,000 శిశువులే ఆకస్మికంగా మరణించారని తేలింది. తల్లి సంరక్షణ ( mother care) పై ప్రత్యేకంగా పరిశీలించగా, ఒక శాతం తల్లులే పొగాకు ఉత్పత్తులను నములుతున్నట్టు ఏడు శాతం మంది పొగాకు తాగుతున్నట్టు బయటపడింది.
గర్భిణులు పొగాకును వినియోగించడం వల్ల శిశువు ఆకస్మికంగా మరణించే రిస్కు మొదటి సంవత్సరంలో 70 శాతం వరకు ఉంటుంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 25 శాతం మంది స్నస్‌తో కలుపుకుని పొగ రాని పొగాకు ఉత్పత్తులనే వినియోగిస్తున్నారని ఒక అంచనా. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) 2014లో నిర్వహించిన అధ్యయనంలో 1.9 శాతం అంటే 2,80,000 మంది హైస్కూలు విద్యార్థులు ,0.5 శాతం మంది అంటే 50,000 మంది మిడిల్ క్లాస్ విద్యార్థులు ప్రస్తుతం స్నస్ వినియోగిస్తున్నారని కనుగొన గలిగింది. స్వీడన్ తప్ప మిగతా ఐరోపా సమాజం అంతా స్నస్ ను నిషేధించింది. స్వీడన్‌లో పురుషులు అత్యధికంగా స్నస్ ను వాడుతుండటంతో స్మోకింగ్ రేటు తగ్గిపోయింది.