Monday, December 23, 2024

నదుల అనుసంధానంతో 247టిఎంసిల వినియోగం

- Advertisement -
- Advertisement -

Consumption of 247 TMCs from Godavari river

కృష్ణాపెన్నాకావేరి బేసిన్లలో తీరనున్న తాగు నీటి కొరత
రూ.87వేల కోట్ల వ్యయపు అంచనా… 10లక్షల హెక్టార్లకు సాగునీరు
రాష్ట్రాల అభిప్రాయాలను కోరిన కేంద్రం
మిగులు తేల్చాకే అభిప్రాయం చెబుతాం : తెలంగాణ
మా నీటి అవసరాలు తీర్చాలి : ఎపి

మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం పథకంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారత దేశానికి మిగులు జలాలను తలించాలన్న నదుల అనుసంధాన ప్రక్రియను కార్యరూపంలోకి తెచ్చే చర్యలు చేపట్టింది. బుధవారం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ 69వ బోర్డు సమావేశం జరిగింది. ఢిల్లీనుంచి ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో నదుల అనుసంధానంతోపాటు , జాతీయ జలనరుల అభివృద్ధి సంస్థలో ఖాళీల భర్తి , సాంకేతిక సదుపాయాల కల్పన తదితర అంశాలను చర్చించారు. . దక్షిణ భారతంలో కృష్ణా, పెన్నా , బేసిన్‌ల పరిధిలో నీటి వనరుల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలిదశగా గోదావరికావేరి నదులు అనుసంధానం కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.

ఇందుకు సంబంధించిన డిపిఆర్‌ను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీటిని తమిళనాడులోని గ్రాండ్ అనికట్ వరకూ 1210కిలోమీటర్ల మేరకు తరలించేందుకు సిద్దం చేసిన అలైన్ మెంట్‌పై చర్చించారు.. గోదావరికావేరి నదుల అనుసంధాన పథకం కోసం ప్రాధమిక వ్యయపు అంచనా రూ.87వేలకోట్లుగా బోర్డు నిర్ధారించింది. ఈ పథకం అమలుకు సంబంధించి భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేపట్టింది. ఎన్‌డబ్యుడిఎ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ , హైదరాబాద్‌లోని ఆ విభాగం సిఇ సంకువాతోపాటు ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , చత్తిస్‌గడ్ , ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో గోదావరికావేరి నదుల అనుసంధానం పథకంపై సాధ్యాసాధ్యాలు ,గోదావరి బేసిన్‌పరిధిలో మిగులు జలాలు , పథకం అమలు కోసం రూపొందించిన డిపిఆర్ ,ఇతర సాంకేతిక పరమైన అంశాలు, నదుల అనుసంధానం ద్వారా ఏ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం , అనుసంధాన ప్రక్రియ వల్ల జరిగే లాభనష్టాలు ,గోదావరి నీటిని కావేరి నదిలో కలిపేందకు అవసరమైన ఎత్తిపోతల పథకాలు , వాటినిర్వహణకు అవసరమైన విద్యుత్ , ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టాల్సిన భూసేకరణ తదితర అంశాలను కూలంకశంగా చర్చించారు.గోదావరి నదిలో 324టిఎంసిల మిగులు జలాలు ఉన్నట్టు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ప్రాథమిక అంచనాలను రూపొందించింది . అందులో 247టిఎంసిల నీటి తరలింపునకు ఉన్న సాధ్యాసాధ్యాలను సమావేశం చర్చించింది. గోదావరి నదిలో ఇచ్చంపల్లి నుంచి మూసినదిలోకి నీటిని ఎత్తిపోసేందుకు 4ఎత్తిపోతల పథకాలను నిర్మించే ప్రతిపాదనను చర్చించారు.

మూసి నదినుంచి నీటిని గ్రావిటీ ద్వారా నాగార్జున సాగర్ జలాశయంలోకి తరలించటం, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు సమీపాన పెన్నానదిపై ఉన్న సోమశిల జలాశయానికి తరలింపు , అక్కడి నుంచి నేరుగా కావేరి గ్రాండ్ అనికట్‌కు గ్రావిటీ ద్వారానే నీటిని తరించే అంశాలను చర్చించారు.నదుల అనుసంధానం ద్వారా కృష్ణా,పెన్నా , కావేరి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడున్న నీటికొరతను తీర్చటం , ప్రత్యేకించి తాగు నీటి అవసరాలకు ప్రధమ ప్రాధాన్యం, సాగు నీటి అవసరాలకు ద్వితీయ ప్రాధాన్యం , పారిశ్రామిక అవసరాలకు తృతీయ ప్రాధన్యం ఇచ్చేలా రూపొందించిన అనుసంధానపు లక్ష్యాలను జాతీయ జలవనరుల అభివృద్ధిసంస్థ డైరెక్టర్ భోపాల్ సింగ్ సమావేశంలో వివరించారు. చత్తిస్‌గడ్ , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో ఇప్పుడున్న ప్రాజెక్టులకు ఏవిధమైన నష్టం వాటిల్లకుండా , గోదావరి నదీజలాల్లో ఆయా రాష్ట్రాలకు ఉన్న హక్కులను కాపాడుతామని సమావేశంలో స్పష్టం చేశారు.

ఈ పధకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 3.67లక్షల హెక్టార్టు, ఎపిలో 3.45లక్షల హెక్టార్లు, తమిళనాడులో 2.32లక్షల హెక్టార్లకు సాగునీరు అందనుందని తెలిపారు. ఈ పధకం కింద నిర్మించే ఎత్తిపోతల పంప్‌లకోసం 1447మెగావాట్ల విద్యుత్ అవసరం అని తెలిపారు. ఇచ్చంపల్లి నుంచి కావేరి గ్రాండ్ అనికట్ వరకూ ఈ పధకం నిర్మాణం కోసం 31680హెక్టార్ల భూసేకరణ జరపాల్సి ఉందని ,అందులో 2458హెక్టార్ల అటవీభూములను కూడా సేకరించాల్సివుందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పంటల సాగు పెరిగి వ్యవసాయ రంగం ద్వారా ఏటా రూ.13597.90కోట్లు రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అంతే కాకుండా 1.41కోట్ల జనాభాకు నీటి అవసరాలు తీరతాయని వెల్లడించారు. విశాల ప్రయోజనాల ప్రాతిపదితకన నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు , లక్ష్యాలను వివరించారు. నదులు అనుసంధానం కోసం అయ్యే వ్యయంలో సింహభాగం నిధులు కేంద్రప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.

గోదావరిలో మిగలు నీటిని తెల్చాకే: తెలంగాణ

గోదావరి నదిలో మిగులు జలాలు ఎంత అన్నది తొలుత కేంద్ర జలసంఘం ద్వారా సమగ్ర అధ్యయనం చేయించి మిగులు నీటిని తేల్చిన తర్వాతే ఆ నివేదికను పరిశీలించి నదుల అనుసంధానంపై తమ రాష్ట్ర అభిప్రాయం చెబుతామని తెలంగాణ రాష్టం మరో మారు స్పష్టం చేసింది. సమావేశంలో పాల్గొన్న నీటిపారుల శాఖ ఈఎన్సీ మురళీధర్ , అంతర్ రాష్ట్ర నదీజలాల విభాగం సిఈ మోహన్‌కుమార్ గోదావరికావేరి నదుల అనుసంధానం పట్ల రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాను స్పష్టం చేశారు . తొలుత గోదావరిలో మిగులు నీటి లెక్క తేల్చాలన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల నీటి అవసరాలకు ఎక్కడా నష్టం జరగరాదన్నారు. గోదావరి నదీజలాల్లో రాష్ట్ర హక్కులకు ఏమాత్రం భంగం కలిగేలా ఉన్న తాము ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలపలేమన్నారు. గోదావరిలో ఇప్పుడున్న లభ్యత నీరు తమ రాష్ట్ర అవసరాలకే సరిపోతాయన్నారు. తమ రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీటిని నదుల అనుసంధానం ద్వారా ఇతర నదీపరివాహక ప్రాంతాలకు తరలిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా జరిగే మేలేమిటో తెలపాలని కోరారు.

గోదావరి దిగువ నీటి హక్కులు మావే:ఎపి

గోదావరి నదికి చిట్టచివరన ఉన్న రాష్ట్రంగా నదీలో మిగులు జలాలపై లోయర్ రైపేరియన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్‌కే ఉంటాయని ఎపి ప్రభుత్వం స్పష్టం చేసింది. సమావేశంలో పాల్గొన్న ఎపి నీటిపారుదల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. గోదావరిలో మిగులు జలాలు తమ రాష్ట అవరాలకే సరిపోతాయన్నారు. నదిలో 75శాతం ఆధారంగా అంచనా వేసి మిగులు జలాలు తేల్చాలన్నారు. ఇంకా పలుకొత్త పథకాలు ఉన్నాయని వాటికి కూడా నీటి అవసరాలు ఉంటాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News