Monday, December 23, 2024

ఆరోగ్యమే అసలైన సంపద

- Advertisement -
- Advertisement -

మద్యం తాగే అలవాటు సరదాగా మొదలవుతుంది. తర్వాత అది అలవాటుగా మారుతుంది. అప్పుడు మన శరీరంలో ఉత్పత్త అయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్‌లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తుంది. చివరకు పూర్తిగా బానిసను చేస్తుంది. నేటి సమాజంలో మద్యం, మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోంది. ధనవంతులు, యువత, సామాన్యులు అనే తేడా లేకుండా దానికి బానిస అవుతున్నారు. మత్తులో హత్యలు, అత్యాచారాలు, ఘర్షణలకు పాల్పడుతున్నారు. చిన్నపెద్ద, ముసలిముతక, నెలలు నిండిన పసిమొగ్గల నుంచి పండుముదుసలి వాళ్లపై అఘాయిత్యాలకు బరితెగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కిరాణా దుకాణాల మాటున విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుపుతున్నారు. దాంతో ఉదయం మొదలుకొని అర్ధరాత్రి దాకా యువత, ప్రజలు జోరుగా తాగుతున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి మద్యం నిషేధించాలి. డ్రగ్స్ రవాణాను అరికట్టాలి. కఠిన నిబంధనలు, చట్టాలు అమలు చేయాలి. హత్యలు, అత్యాచారాలు 90% వీటి మూలంగానే జరుగుతున్నాయి. ప్రభుత్వం ధనార్జన ధ్యేయాన్ని పక్కనపెట్టి మద్యాన్ని పూర్తిగా రూపుమాపాలి. దానికి యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా నడుంబిగించాలి. పచ్చని పల్లెల్లో కుటుంబాల మధ్య మద్యం మహమ్మారి కలహాలు సృష్టిస్తోంది. సాఫీగా సాగే కాపురాల్లో చిచ్చుపెడుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోంది. దేశానికి వెన్నెముకయిన యువత గ్రంథాలయాల్లో ఉండాల్సిన వారు.. మద్యం దుకాణాల్లో ఉంటూ మత్తులో తిరుగుతున్నారు. దానికి తోడు గంజాయి, డ్రగ్స్‌కు బానిస అవుతున్నారు.

ఇవి హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. సమాజ శ్రేయస్సు, గ్రామాల అభివృద్ధి, యువత, ప్రజల భవిష్యత్ దృష్ట్యా బెల్ట్ షాపులు నిషేధించాలి. మద్యం షాపుల నిర్వహణను నిర్వాహకులు స్వచ్ఛందంగా విరమించుకోవాలి. ప్రజల ఆర్థిక, ఆరోగ్య అంశాలను దృష్ట్యా మద్యాన్ని ప్రభుత్వం రూపుమాపాలి. దానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మద్యపాన నిషేధం విధించిన గ్రామాలను ఆదర్శంగా తీసుకొని పల్లెలు అభివృద్ధి వైపు బాటలు వేయాలి. దేశానికి పల్లెలు పట్టుగొమ్మల లాంటివి. దేశాభివృద్ధిలో వాటి భాగస్వామ్యం కీలకం. అలాంటి పచ్చని పల్లెల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో ఉపాధి పేరిట కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసి అందులో విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకు మద్యం విక్రయిస్తున్నారు. ముందు కిరా ణం.. లోన మందు పురాణం నడిపిస్తున్నారు. ఎప్పుడూ అందుబాటులో ఉండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా తాగేసి ఆరోగ్యంపాడు చేసుకుంటున్నారు. అంతేకాక దాని వల్ల కొన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి.

కుటుంబ, సంసార కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలు ఉన్నవారు వాటిని మర్చిపోవడం కోసం మద్యానికి బానిసలవుతున్నారు. తాగడం వల్ల ఉన్న సమస్యల నుంచి ఉపశమనం కలగవచ్చు, వాటిని మర్చిపోవచ్చు అనుకునేవారు అధికం. అది ఎంత మాత్రం నిజం కాదు. మద్యం అలవాటుతో మరిన్ని ఎక్కువ ఇబ్బందులు, కష్టాలను మనం కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. రక్తంలో ఆల్కహాల్ పెరిగాక మాటల్లో, నడకలో మార్పు వస్తుంది. అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. సోయి లేకుండా కిందపడిపోతాం. ఆలోచన విచక్షణ కోల్పోతాం. జీర్ణాశయంలోని మద్యం సరిగ్గా జీర్ణం అవ్వదు. మెదడు, కాలేయం, శరీర ప్రతి అవయవానికీ చేరుతుంది. అదే విధంగా ఆల్కహాల్ ముందుగా ఎసిటాల్డిహైడ్ గా విడిపోతుంది. ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా మారి, అనంతరం కార్బన్‌డయాక్సైడ్‌గా విడిపోతుంది. ఎసిటాల్డిహైడ్ వల్ల కాలేయం దెబ్బతింటుంది.

హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, చివరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. భార్య, అభంశుభం తెలియని చిన్నారులు, తల్లిదండ్రులు, కుటుంబీకులు, పెళ్లీడుకొచ్చిన పిల్లలు జీవితాంతం తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన భార్య, పసి మొగ్గలుగా ఉండగానే తండ్రిని కోల్పోయిన పిల్లల దయనీయ పరిస్థితి మాటల్లో చెప్పలేనిది. వాళ్లు ఆర్థిక, మానసిక, సామాజిక వ్యత్యాసం, వివక్ష ఎదుర్కొంటారు. తాగి ప్రమాదాల్లో గాయపడి, మరణించి తల్లిదండ్రులకు శోకం మిగిలిస్తున్నారు. పాతకక్షలు ఏవైనా ఉంటే.. స్నేహితులు, బంధువులు, ఇతరులను హత్యలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను, భార్య పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో ఆలనాపాలనా, పోషణను కొందరు గాలికి వదిలేస్తున్నారు.

ఏ కారణం చేతనైనా మద్యానికి బానిస అయిన యువతను, పురుషులను కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు కనిపెట్టాలి. స్నేహితులు, బంధుమిత్రులు వాళ్లకి మంచి చెడులు వివరించాలి. మద్యం అనర్ధాలు, అపాయాల గురించి కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలతో వాళ్లను మార్చే ప్రయత్నం చేయాలి. దీనికి తోడు సామాజిక దృక్పథంతో సమాజం సైతం వారిని మంచి మార్గంలో నడిపించేలా చొరవ చూపాలి. ముఖ్యంగా పూర్తి మద్యపాన నిషేధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తే బాగుంటుంది. పల్లెల్లో బెల్ట్ షాపులను నిర్మూలిస్తే మంచింది. దాంతో ఆరోగ్యవంతమైన దేశం- ఆరోగ్యవంతమైన యువ సంపద సిద్ధిస్తుంది.

తలారి గణేష్
9948026028

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News