షాహజాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ట్రక్కు ఓ ఆటోరిక్షాను ఢీకొన్న దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. దట్టమైన పొగమంచుతో ట్రక్కు రోడ్డుపై రాంగ్‌సైడ్‌లో వెళ్లుతూ ఉండగా ఈ మార్గంలో వస్తున్న ఆటోను బలంగా ఢీకొందని, సరైన వీక్షణం లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈరోజు పూర్ణిమ కావడంతో గంగానదిలో పవిత్రస్నానాలు చేసేందుకు ఫరూకాబాద్‌కు ఆటోలో వెళ్లుతున్న వారు మృత్యువాత పడ్డారు.
షాజహాన్‌పూర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలోని సగుసుగి గ్రామం వద్ద బరేలీ ఫరూకాబాద్ రాదారిపై ఈ ప్రమాదం జరిగిందని సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు అశోక్‌కుమార్ మీనా మీడియాకు తెలిపారు. జలాలాబాద్ నుంచి వస్తున్న ట్రక్కు ఈ ప్రమాదానికి కారణం అయింది.దీనితో ఘాటియా ఘాటుకు వెళ్లుతున్న ఆటో ప్రయాణికులు 12 మంది ప్రాణాలు కోల్పోయ్యారు.
ప్రమాదం తరువాత ట్రక్కు డ్రైవర్ ఘటనాస్థలిని వీడి ఫరారయ్యాడు. 12 కిలోమీటర్ల దూరంలో వాహనం కనుగొన్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత బలంగా ఈ ట్రక్కు ఆటోను ఢీకొనడంతో పలువురు విగతజీవులై రోడ్డుపై పడ్డారు. కొందరు రెండు వాహనాల మధ్య నలిగిపొయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో మృతులైన వారి కుటుంబాలకు యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ సంతాపం తెలిపారు.