హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. రెండో జాబితాలో పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతల పేర్లు ఉన్నాయి. అయితే, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిని తప్పించడం గమనార్హం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ పార్లమెంటు సభ్యుడు మహ్మద్ అజారుద్దీన్‌ను ఏఐసీసీ ప్రకటించింది. జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ఇస్తే బిజెపి నుండి లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు సమాచారం.
ఒక్కొక ఇంట్లో రెండు రెండు టిక్కెట్లు ఇచ్చారు. కొందరు అయ్యలకు, హాఫ్ టికెట్ గాళ్ళకి టికెట్ ఇచ్చారని ఆయన అన్నారు. పార్టీకోసం కష్టపడ్డా, హైదరాబాద్‌లో కాంగ్రెస్ అంటే పీజేఆర్ అనేవాళ్ళు. జూబ్లీహిల్స్ నుండి పోటీలో ఉంటా, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో వెల్లడించారు. గతంలో మాజీ క్రికెటర్ జూబ్లీహిల్స్‌లోని పలు వేదికలపై సమావేశాలు నిర్వహించినప్పుడు, విష్ణువర్ధన్ రెడ్డి అజారుద్దీన్‌ను అలాంటి సభలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి 2004, 2009లో జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందగా, 2014, 2018లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు.