అమరావతి: మంచి చేసే నాయకుడు ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దూరదృష్టి తో ఆలోచిస్తే మంచి జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ చందర్లపాడు మండలం ముప్పాళ్లలో చంద్రబాబు పర్యటించారు. ఈ విషయంపై మాట్లాడుతూ… నాయుకుడు విధ్వంసం వైపు ఆలోచిస్తే చెడు జరుగుతుందని చెప్పారు. డ్రైనేజీ సమస్య తీర్చేందుకు ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తానని, భూగర్భ డ్రెయినేజీకి ఏర్పాట్లు చేస్తానని సిఎం వెల్లడించారు. జీవన ప్రమాణాలు పెంచుకోవాలనే మార్గదర్శులను తెచ్చామని, బంగారు కుటుంబాలను గుర్తించి ఆదుకుంటున్నామని తెలియజేశారు. తెలివి తేటలతో పనిచేస్తే కష్టపడాల్సిన అవసరం లేదని వివరించారు.
రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని, మొట్టమొదట దీపం పథకం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చామని, ఆలోచన విధానంలో మార్పు రావాలని సిఎం కోరారు.జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, జన్మభూమి పిలుపు ఇచ్చినప్పుడు అందరూ స్పందించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. జన్మభూమి పిలుస్తుంది రావాలంటే ఎన్నో కార్యక్రమాలు చేశారని, ఆర్ధికంగా పైకి వచ్చినవాళ్లు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని అన్నారు. అట్టడుగున ఉన్నవారికి చేయూత అందించాలని సూచించారు. సమాజాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తానని, తానెప్పుడు 20-30 సంవత్సరాలకు ముందే ఆలోచిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.
తాము ఆలోచన దేశంలో పుట్టిన ఏ వ్యక్తీ పేదరికంలో ఉండటానికి వీల్లేదని, పేదరిక నిర్మూలన జరగాలని అన్నారు. తలసరి ఆదాయం పెరగాలని ఆకాంక్షిస్తున్నామని.. పేదల సేవలో భాగంగా ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నామని, పేదలకు వైద్య సేవ కింద డబ్బులిచ్చి ఆదుకుంటున్నామని తెలిపారు. స్వయం ఉపాధి కింద అనేక పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉందని, గత ప్రభుత్వం మన నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిపోయిందని మండిపడ్డారు. సంపద సృష్టించాలని.. ఆదాయం పెంచాలని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి చేయాలని, అమరావతి నిర్మాణం పోలవరం కట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు.