Monday, December 23, 2024

ఆగని సస్పెన్షను

- Advertisement -
- Advertisement -

మంగళవారం మరో 49మందిపై వేటు సస్పెండయిన వారిలో శశిథరూర్, ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలె తదితరులు

ఉభయ సభలనుంచి మొత్తం 141 మంది విపక్ష ఎంపిల సస్పెన్షన్ చర్చ లేకుండా కీలక చట్టాలను ఆమోదించుకోవడానికే
సస్పెన్షన్లు : కాంగ్రెస్

న్యూఢిల్లీ: లోక్‌సభలో దుండగుల చొరబాటు ఘటనతో పార్లమెంటు అట్టుడుకుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలు ప్రకటన చేయాలని పట్టుబడుతుండడంతో అందుకు అంగీకరించని ప్రభుత్వం సస్పెన్షన్ల పరంపరను కొనసాగిస్తోంది. సోమవారం పార్లమెంటు ఉభయ సభలనుంచి 78 మంది సభ్యులను ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా లోక్‌సభలో మరో 49 మంది విపక్ష ఎంంపిలపై స్పీకర్ వేటు వేశా రు. దీంతో ఇప్పటివరకు 141 మంది విపక్ష ఎంపిలను సస్పెండ్ చేసినట్లయింది. సభాపతి ఆదేశాలను ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రవేశపెట్టగా, మూజువాఫీ వోటుతో సభ ఆమోదించింది.

అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. మంగళవారం సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీశ్ తివారి, కార్తీ చిదంబరం, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాది పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్‌సిపికి చెందిన సుప్రియా సూలె, డిఎంకె సభ్యులు ఎస్ జగద్రక్షణ్, డివికె సెంథిల్ కుమార్, ఆప్‌ఎంపి సుశీల్ కుమార్ రింకు, బిఎస్‌పినుంచి సస్పెండయిన డేనిష్ అలీ తదితరులున్నారు.ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ ‘సభలోకి ప్లకార్డులు తీసుకు రాకూడదనే నిబంధన ఉంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వారు (విపక్షాలు) నిరాశచెందారు. అందుకే వారు ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు’ అని దుయ్యబట్టారు. కాగా లోక్‌సభలో ఇప్పటికే గత వారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

తాజా సంఖ్యతో కలిపి ఇప్పటివరకు లోక్‌సభలో 95 మందిపై వేటు పడినట్లయింది.మరోవైపు రాజ్యసభలో ఇప్పటివరకు 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు 141 మంది విపక్ష ఎంపిలను సస్పెండ్ చేసినట్లయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 22న ముగియనున్నాయి. కాగా విపక్షాల ఆందోళనలనేపథ్యంలో మంగళవారం కూడా ఉభయ సభలు స్తంభించాయి. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయడంతో పాటుగా తమ ఎంపిలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరో వైపు సస్పెన్షన్‌కు గురయిన ఎంపిలు అడిగిన 27 ప్రశ్నలను లోక్‌సభప్రశ్నల జాబితానుంచి తొలగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News