Monday, December 23, 2024

ఇసుకాసురులు.. రీచ్‌ల వద్ద భారీగా దోపిడీ

- Advertisement -
- Advertisement -

లారీల యజమానుల నుంచి అందినకాడికి దండుకుంటున్న కాంట్రాక్టర్లు, పిఒలు
ఎక్స్‌ట్రా బకెట్ నింపుకోవాలని తీవ్ర ఒత్తిళ్లు
బకెట్‌కు రూ.2వేలు వసూలు.. వద్దంటే కదలని లారీలు 
డిడికి రూ.14,400.. లంచాలు మరో రూ.10వేలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఇసుకరీచ్‌ల వద్ద కాంట్రాక్టర్‌లు లారీల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు. అక్కడ పనిచేసే పిఓలు సైతం తాము కూడా అవినీతిలో తగ్గేదిలే అంటే ముక్కుపిండి మరీ వసూళ్లు చే స్తున్నారు. ఒక్కో లారీకి ఇసుకను ఎత్తడానికి అదనంగా రూ.6 వేల లారీల యజమానులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ఇసుకను అధిక ధరకు అమ్మాల్సి వస్తుందని లారీల యజమానులు వాపోతున్నారు. ఇప్పటికే ఈ విషయమై టిజిఎండిసి అధికారులకు ఫిర్యాదు చేశామని వారు పేర్కొంటున్నారు. ఇసుక రీచ్‌ల వద్ద జరిగే దోపిడీతో తాము ఇబ్బందులు పడుతున్నామని లారీల యజమానులు వాపోతున్నారు. భద్రాద్రికొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, జ యశంకర్ భూపాలపల్లి, భద్రాచలం, మంచిర్యాలలో ఈ దందా అధికంగా జరుగుతుందని లారీల యజమానులు వాపోతున్నారు.
16 టైర్ల లారీలో 35 టన్నులు
మాములుగా ఇసుక కోసం లారీల యజమానులు ఇసుక డిడిలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తారు. 16 టైర్‌ల లారీకి (35 టన్నుల) ఇసుకకు ప్రభుత్వానికి డిడిల రూపంలో రూ. 14,400లు, 14 టైర్ల లారీకి (32 టన్నుల) ఇసుకకు రూ.13,100లు, 12 టైర్‌ల లారీకి (26 టన్నుల) ఇసుకకు ప్రభుత్వానికి డిడిల రూపంలో రూ.11,500లను లారీల యజమానులు చెల్లిస్తారు. అయితే ఇసుక డిడిలను కొనుగోలు చేసినప్పుడు ఏ రీచ్‌కు వెళ్లాలన్నది టిజిఎండిసి ఆ డిడిల్లో సూచిస్తుంది. ఆ డిడిలను తీసుకొని ఇసుక రీచ్‌ల వద్దకు లారీల యజమానులు వెళ్లినప్పుడు అక్కడ అదనంగా రూ.6 నుంచి రూ. 10 వేలు చెల్లిస్తేనే లారీల్లోకి ఇసుకను ఎత్తడం విశేషం. ఇలా అదనంగా డబ్బులను వసూళ్లు చేయడంతో ఒక్కో లారీ ఇసుకకు రీచ్‌ల నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడానికి డీజిల్‌తో కలిపి రూ.25 నుంచి రూ.30 వేలు ఖర్చు అవుతుందని దీనివల్ల ఎక్కువ ధరకు ఇసుకను అమ్మాల్సి వస్తుందని లారీల యజమానులు వాపోతున్నారు.

ఒక్కో బకెట్‌కు రూ.2 వేలు
దీంతోపాటు భద్రాద్రికొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలం, మంచిర్యాలతో పాటు మరికొన్ని రీచ్‌ల్లో కాంట్రాక్టర్‌లు, పిఓలు ఎక్స్‌ట్రా బకెట్ పేరుతో (ఒక్కో బకెట్‌కు రూ.2 వేలు) తీసుకుంటున్నారని, ఇది వద్దంటే ఇసుకను లారీల్లో వేయడానికి వారు ముందుకు రావడం లేదని లారీల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాములుగా 16 టైర్‌ల లారీకి (35 టన్నుల) ఇసుకకు ప్రభుత్వానికి డిడిల రూపంలో రూ.14,400లు చెల్లించి రీచ్‌ల వద్దకు వచ్చినప్పుడు లారీల్లోకి ఇసుకను ఎత్తడానికి సపరేట్‌గా రూ. 4వేలు, పట్టాదారుడికి రూ.1,000లు, జేసిబితో ఇసుకను ఎత్తినందుకు రూ.500లు, సీరియల్ నెంబర్ రాసినందుకు రూ.100, కాంటకు రూ.100, వే బిల్లుకు రూ.100ను లారీల యజమానులు చెల్లిస్తున్నారు. వీటితో పాటు అదనంగా ప్రతి లారీలో రెండు నుంచి మూడు బకెట్‌ల ఇసుకను (ఒక్కో బకెట్ ఇసుకకు రూ. 2 వేలు మూడు బకెట్‌లను రూ.6 వేలను) కచ్చితంగా చెల్లిస్తేనే లారీలను ఆ రీచ్‌ల నుంచి కాంట్రాక్టర్ బయటకు పంపిస్తున్నారని లారీల యజమానులు వాపోతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు
అయితే కాంట్రాక్టర్‌లు, పిఓలు అదనపు బకెట్‌ల పేరుతో తమను వేధిస్తున్నారని దీనివల్ల ఆర్‌టిఓలు, పోలీసులు అధికలోడ్‌తో వెళ్లే తమ లారీలను సీజ్ చేస్తున్నారని లారీల యజమానులు వాపోతున్నారు. దీంతోపాటు ప్రతిరీచ్‌ల వద్ద పనిచేపే పిఓలు ప్రతిరోజులు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారని వారి చెప్పింది వినకుంటే స్థానికంగా తమ లారీలను తిరగనివ్వడం లేదని లారీల యజమానులు వాపోతున్నారు. ఇప్పటికే పలు రీచ్‌ల వద్ద ఉన్న పిఓలపై టిజిఎండిసి ఫిర్యాదులు అందుతున్న చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ దోపిడీ ఆగకపోతే ఇసుక ధర మాత్రం తగ్గదని దీనిపై టిజిఎండిసి అధికారులు చర్యలు చేపట్టాలని లారీల యజమానులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News