Wednesday, January 22, 2025

ఇసుక మాఫియాతో కాంట్రాక్టర్లు కుమ్మక్కు?

- Advertisement -
- Advertisement -

గోవిందరావుపేట: మండలంలో ఇసుక మాఫియా ప్రభుత్వ పనుల సాకుతో కాంట్రాక్టర్లతో కలిసి పర్మిషన్ల పేరుతో నాలుగు నుండి ఐదు ట్రిప్పులు రాయించుకొని స్థానిక విఆర్‌ఏ సహాయంతో అడ్డు అదుపు లేకుండా ఇసుక తోలకాలు జరిపి అధిక ధరలకు విక్రయించుకుంటున్నారు. ఇసుక తోలకాలలో సమీపంలోని గ్రామాలకు సమీపంలోని వాగులలోకి వాహనాలు వెళ్ళడానికి ఇసుక రవాణా అనుగుణంగా బాటలు వేసి వాగులలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్న నిరంతరం పర్యవేక్షించాల్సిన విఆర్‌ఏలు ఇసుక మాఫియాతో జతకట్టి మామూళ్ల మత్తులో జోగుతూ ఉండడం వల్లనే ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

ప్రభుత్వ కట్టడాలకు రికార్డుల ప్రకారం గోదావరి ఇసుక వాడాల్సి ఉండగా స్థానికంగా దొరికే నాసిరకం ఇసుక తక్కువ ధరకు రావడంతో కాంట్రాక్టర్లు దానితో నిర్మాణాలు చేపట్టడం వలన నెలలు గడవక ముందే నిర్మాణాలు పగుళ్లు పడుతున్నాయి. అసలు ప్రభుత్వం గోదావరి ఇసుకకు బిల్లులు చెల్లిస్తుంటే మధ్యలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ కట్టడాల పేరుతో ఇసుకతో పర్మిషన్లు ఇవ్వడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ధనార్జనే ధ్యేయంగా రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టర్లు ఈ ఇసుక వ్యాపారులు ప్రభుత్వ పనులను అడ్డంగా పెట్టుకొని ఆదాయ వనరులుగా మార్చుకొని దందా కొనసాగిస్తున్నారు. వాగులలో ఇసుకను తరలించడంతో భూగర్బజలాలు అడుగంటి వ్యవసాయ మోటార్లకు పంటలు ఎండి పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడం వలన ఇసుక వ్యాపారులు సాధ్యమైనంత ఎక్కువగా ఇసుకను డంప్ చేసి అధిక ధరలు పెంచి విక్రయించే ఉద్దేశ్యంతో ఇసుకను భారీగా అక్రమ నిల్వలు చేస్తున్నారు.

పేదవాడు గృహ నిర్మాణం చేసుకోవాలంటే ఇసుకను కొనే విధంగా లేదని ఇళ్లు కట్టుకునే పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకొని ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను నిర్మాణదారులకు అందేలా చేస్తే ఇసుక మాఫియాను కట్టడి చేసే అవకాశం అవుతుందని కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల పేరుతో పరిమితులు ఇవ్వడం మానేస్తే సామాన్యుడికి తక్కువ ధరలు అందుబాటులో ఉండే అవకాశాలు ఉంటాయని సామాన్యులు సైతం నాణ్యమైన ఇసుక వాడతారు. సామాన్యుడు ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించుకుంటే రెవెన్యూ, ఫారెస్టు అధికారులు ఆగమేఘాల మీద వచ్చి అడ్డుపడతారు. అదే ఇసుక మాఫియా అడ్డగోలుగా అక్రమ నిల్వలు చేస్తుంటే ఎందుకు రావడం లేదని దీనిలో అధికారులందరూ భాగస్వామ్యం ఉండడం వలనే ఈ ఇసుక చీకటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతుందని, ఇకనైనా పై అధికారులు చొరవ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని, ఇట్టి ఆక్రమణలపై నియంత్రణ చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News