Thursday, January 23, 2025

బిల్లులు రాక సరుకులు నిలిపివేస్తున్న కాంట్రాక్టర్లు

- Advertisement -
- Advertisement -

మూసివేసే దిశగా సంక్షేమ హాస్టళ్ళు
వారంలోగా చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు : కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : గత 10 నెలలుగా బిసి హాస్టల్స్ మెస్ బిల్లులు చెల్లించక పోవడంతో హాస్టళ్ళకు సప్లయ్ చేసే నిత్యవసర వస్తువులు, కూరగాయలు, నూనెలు, పప్పులు, చికెన్, గుడ్డు ఇతర ఆహార దినిసుల సరఫరాను వ్యాపారస్తులు ఆపివేస్తున్నారని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలో హాస్టళ్లు మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 700 బిసి,1500 ఎస్‌సి, ఎస్‌టి హస్టళ్ళలలో 8లక్షల మంది విద్యార్థుల మెస్ చార్జీల బిల్లులు 10 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. హాస్టల్స్ అద్దె భవనాల బిల్లులు, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని హాస్టళ్ళ బకాయిలు చెల్లించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే బడ్జెటు విడుదల చేయాలని పలుమార్లు ఉపముఖ్యమంత్రి, బిసి సంక్షేమ శాఖ మంత్రి, సంబంధిత అధికారులతో కృష్ణయ్య నేతృత్వంలో బిసి నేతలు ఫణికాంత్, రఘుపతి, సందీప్, విజయ్ కుమార్ తదితరులు పలుసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు.. కూరగాయలు, మాసం, గుడ్ల బిల్లులు, పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల బిల్లులు గత 10 నెలలుగా చెల్లించని కారణంగా హాస్టళ్లకు వీటిని సరఫరా చేసే కాంట్రాక్టుర్లు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు సరఫరా బందు చేస్తామని అంటున్నారని, దీనివల్ల హాస్టళ్లు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం బిసి కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనాల్లో ఉన్నాయని, గత రెండు సంత్సరాలుగా అద్దె చెల్లించడం లేదని తెలిపారు. వీపరీత జాప్యం వల్ల అద్దె యజమానులు భవనాలు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారని, వెంటనే అద్దె భవనాల బిల్లులు విడుదల చేయాలని కృష్ణయ్య కోరారు.

హాస్టళ్ళ పది నెలల కరెంట్ బిల్లుల బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని, 295 బిసి కాలేజీ హాస్టళ్లకు, 321 బిసి గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. ఆర్థిక శాఖ్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లను, సచివాలయాన్ని దిగ్బందం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News