భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘ఒన్ నేషన్- వన్ సబ్‌క్రిప్షన్’ (ఒఎన్‌ఒఎస్) పథకం అనేది. విద్యా పరిశోధనా రంగాన్ని ప్రజాస్వామ్యీకరణకు ఉపయోగపడే గొప్ప సాధనా సంపత్తి. ఇది దేశంలో జ్ఞాన సమగ్రతకు, నూతన పరిశోధనా ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి ఒక మైలురాయిగా చరిత్ర లో నిలిచిపోతుంది. ఈ పథకం ద్వారా దేశంలోని విద్యార్థులు, పరిశోధకులు, ఫ్యాకల్టీ సభ్యులు అంతర్జాతీయ స్థాయిలోని అకాడమిక్ జర్నల్స్‌ను ఇతర పరిశోధనా వనరులను ఏకీకృతంగా అందుకోవడానికి అవకాశం కల్పించబడింది. ఈ పథకం 2025 జనవరి 1న ప్రారంభించబడింది. ఇది భారతదేశ పరిశోధనా నేపథ్యాన్ని గణనీయంగా మార్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటంటే, అన్ని విద్యా సంస్థలకు, అలాగే పరిశోధనా కేంద్రాలకు అత్యధిక నాణ్యత గల పరిశోధనా వనరులను అందించడం. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సంస్థలకు కూడా ప్రపంచస్థాయిలోని పరిశోధనా వనరుల లభ్యత కల్పించడం ద్వారా, జ్ఞాన సముపార్జనా అంతరాలను తొలగించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇది ఒకేసారి అనేక సంస్థలకు సమాచార వితరణకు సమాన అవకాశాలను అందిస్తుంది. ఈ సంస్థ ద్వారా అతి తక్కువ ఖర్చుతో, అత్యధిక జ్ఞాన సముపార్జనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే పరిశోధనా రంగంలో రీసర్చ్ స్కాలర్లకు అవసరమైన అనంత సమాచారం వివిధ వనరుల ద్వారా లభిస్తుంది. వివిధ శాఖల్లో పరిశోధనలు సమాంతరంగా జరుపుకోవచ్చ. వివిధ శాస్త్రాలలో జరిగే పరిశోధనలకు అవసరమైన సమాచారం ఒకే చోట లభించట వల్ల డేటా కలెక్షన్‌కు వెచ్చించవలసిన ఆర్థిక వనరులను పొదుపు చేసి, అవసరమైతే ఆ మిగులను ఇతర కీలక రంగాలకు మళ్లించడానికి అవకాశం లభిస్తుంది.
అంతేకాకుండా, ఈ పథకం వివిధ అకాడమిక్ రంగాలకు అవసరమైన వనరుల లభ్యతను అందించడం ద్వారా, ఇంటర్ డిసిప్లీనరీ రంగాలలో అధ్యయనాలను ప్రోత్సహిస్తుంది. ఇది పరిశోధకులకు విస్తృత దృక్కోణాలలో సమాచారం అన్వేషించడానికి, వినూత్న పరిశోధనల ఫలితాలను ఆవిష్కరించటానికి నూతన మెథడాలజీ రూపాలను (మోడల్స్‌ను) రూపొందించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం అమలును వివిధ దశల్లో చేయటానికి ముందుగానే నిర్దిష్ట ప్రణాళికలు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న అన్ని ఉన్నత విద్యా సంస్థలను, అలాగే పరిశోధనా సంస్థలను, వాటి ప్రయోగశాలలకు వనరుల లభ్యత అందించబడుతుంది. రెండవ దశలో ప్రైవేట్ విద్యాసంస్థలకు, పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్ ద్వారా ఈ పథకాన్ని విస్తరించడం కోసం ప్రణాళిక సిద్ధం చేయబడింది.
చివరి దశలో ప్రజా గ్రంథాలయాల ద్వారా సాధారణ ప్రజలకు కూడా ఈ వనరులను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా స్వతంత్ర పరిశోధకులకు, స్వతహా జ్ఞానాన్వేషకులకు కూడా ప్రపంచ స్థాయిలోని అకాడమిక్ వనరులను సమర్ధవంతంగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం విస్తృతి, పరిధి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్, హ్యూమానిటీస్ వంటి వివిధ రంగాలలో 13,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ జర్నల్స్ కవరేజ్ కలిగి ఉంది.ఈ పథకం కీలక విజయాలలో ఒకటి ఏమిటంటే, ఎల్సెవియర్, స్ప్రింగర్ నేచర్, వైలీ, టేలర్ & ఫ్రాన్సిస్, (ఐఇఇఇ) వంటి 30 ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం. ఈ ఒప్పందాల ద్వారా, ఒక్కో సంస్థ ప్రత్యేకంగా జర్నల్ సబ్‌స్క్రిప్షన్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, అన్ని సంస్థలకు సమాన ప్రాప్యత కల్పించబడుతుంది. ఈ పథకం ప్రయోజనాలు పరిశోధనా వనరులకు లభ్యత విలువ చాలా ఎక్కువ.ఈ సంస్థ విద్యార్థులకు, ఫ్యాకల్టీ సభ్యులకు తాజా అకాడమిక్ జ్ఞానాన్ని అందించడం ద్వారా భారతదేశ పరిశోధనా సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. అలాగే పరిశోధనా ఫలితాల నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఇది ముఖ్యంగా ద్వితీయ, తృతీయ స్థాయి నగరాలలోని సంస్థలకు, ప్రజలకూ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడ ఖరీదైన అరుదైన పరిశోధనా ఫలితాలను ప్రచురించే జర్నల్స్ దొరుకుతాయి. అంతేకాకుండా, ఈ పథకం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఇపి) 2020లో పేర్కొన్న లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. ఇది పరిశోధనలకూ, వినూత్న ఆవిష్కరణకు జాతీయ అభివృద్ధికి దోహదపడే కీలక అంశాలు, అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి. ఈ సంస్థ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఎన్‌ఆర్‌ఎఫ్) లక్ష్యాలతో కూడా అను సంధానం చేయబడి వాటి కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది. ఇది భారతదేశంలో బలమైన పరిశోధనా సంస్కృతిని ప్రోత్సహించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఇది ఖర్చు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేంద్రీకృత సబ్‌స్క్రిప్షన్ల ద్వారా ప్రభుత్వం ప్రచురణ సంస్థలతో మెరుగైన ఒప్పందాలను చేసుకోగలుగుతుంది. తద్వారా విద్యా వ్యవస్థపై మొత్తం ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఈ పథకం ద్వారా సేవింగ్ చేసిన డబ్బును పరిశోధన, అభివృద్ధికి అవసరమైన ఇతర కీలక రంగాలకు మళ్లించవచ్చు.
అంతర్జాతీయ సంస్థల సహాయ సహకారాలను కూడా తీసుకొని జ్ఞాన-భాగస్వామ్య సంస్కృతిని పెంపొందించడానికి దోహదం చేస్తుంది. ఈ పథకం అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకుంది. పరిశోధనా లభ్యతను జాతీయ స్థాయిలో అందించడానికి భారతదేశం చేసిన కృషిని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, విధాన రూపకర్తలు ప్రశంసించారు. ఈ పథకం అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది, ప్రత్యేకించి ఖరీదైన జర్నల్ సబ్‌స్క్రిప్షన్ల వల్ల పరిశోధన ప్రగతి అడ్డుపడుతున్న దేశాలకు ఈ పథకం యొక్క భవిష్యత్ అవకాశాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కానీ దీని దీర్ఘకాలిక విజయం కోసం నిరంతర పర్యవేక్షణ అవసరం.
పరిశోధకులు ఇతర సంస్థల నుండి సాధారణ అభిప్రాయాలు సేకరించడం ద్వారా, లభ్యమయ్యే సేవల విధానాలను మెరుగుపరచడం సాధ్యమవుతుంది. మెరుగైన సబ్‌స్క్రిప్షన్ల ఒప్పందాలను చేసుకోవడం సాధ్యమవుతుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనా సాధనాలు, అధునాతన డిజిటల్ లైబ్రరీలను ఈ పథకంలో ఏకీకృతం చేయడం ద్వారా దాని ప్రభావాన్ని మరింత పెంచవచ్చు. ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో పరిశోధనకు సమాన ప్రాప్యత ఇప్పుడు ఒక విలాసవంతమైన అంశం కాదు, అవసరమైన అంశం.
డా. రాధిక రాణి