Monday, March 3, 2025

యూపిఎస్‌తో కార్పొరేట్‌లకు మేలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  యూపిఎస్‌తో కార్పొరేట్‌లకు మేలు జరుగుతుందని రాష్ట్ర కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (సిపిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆందోళన వ్యక్తం చేశారు. గో బ్యాక్ యూపిఎస్ అంటూ రాష్ట్ర కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద యూపిఎస్ వద్దని యుద్ధభేరి ధర్నా జరిగింది. కార్యక్రమానికి వేలమంది సిపిఎస్ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్‌లు భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరయ్యారు.

ఈ ధర్నాను ఉద్ధేశించి సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని, ఏప్రిల్ 01వ తేదీ నుంచి అమల్లోకి రానున్న యూపిఎస్‌కు వ్యతిరేకంగా ఆరోజు ఉద్యోగులు బ్లాక్ డే జరుపుకోవాలని, మే 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి అధిక సంఖ్యలో సిపిఎస్ ఉద్యోగులు హాజరుకావాలని, సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టుకొని లక్ష మందితో కలాల కవాతు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర వసూలు చేసిన 10.5 లక్షల కోట్ల రూపాయలు యూపిఎస్ వల్ల అప్పనంగా కార్పొరేట్ చేతుల్లోనికి వెళ్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పది సంవత్సరాలుగా సిపిఎస్ వద్దని ఓపిఎస్ మాత్రమే సామాజిక భద్రతను చేకూర్చుతుందని తాము పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ యూపిఎస్ విధానాన్ని తీసుకొచ్చికేంద్రం ఉద్యోగులను గందరగోళానికి గురి చేస్తుందన్నారు. ఇది ఏ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి ఆమోదయోగ్యంగా లేదన్నారు. ఈ యూపిఎస్‌లో 56 జే రూల్ ప్రకారం ఉద్యోగి కాంట్రిబ్యూషన్ 10 శాతం కాగా, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ 10 శాతం అని, ఇలా సర్వీస్ మొత్తం జమ అయిన పెన్షన్ నిధిని ఉద్యోగి ప్రాన్ అకౌంట్ ద్వారా ఎన్‌పిఎస్ ట్రస్ట్‌కు బదిలీ చేశాకే ఉద్యోగి సర్వీస్ పెన్షన్ నిర్ణయం జరుగుతుందన్నారు.

గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, ప్రస్తుత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ను అమలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రతినెల రాష్ట్రం నుంచి సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ 450 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ కు ఎన్‌పిఎస్ ట్రస్ట్ ద్వారా తరలిపోతాయన్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూరాకుల శ్రీనివాస్, కోటకొండ పవన్, పోల శ్రీనివాస్, నరేందర్ రావు, శ్యామ్ సుందర్, శ్రవణ్ ,మల్లికార్జున్, గడ్డం వెంకటేష్, ఆవునూరి రవి, శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News