Sunday, January 19, 2025

ఫోన్ ట్యాపింగ్‌కు నియంత్రణ ఎక్కడ!

- Advertisement -
- Advertisement -

రాజకీయాల్లో పార్టీల వ్యూహాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రత్యర్థులను, విపక్షాలను కట్టడి చేయడానికి అధికార పార్టీలు ఫోన్ ట్యాపింగ్‌ను బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఫోన్ ట్యాపింగ్‌కు కూలిపోయిన రాజ్యాలు, రాజ్యాధినేతలున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ అనే భేదం లేకుండా అధికారంలో ఉన్న పార్టీలన్నీ తన బలాన్ని ప్రజాభిమానంతో పెంచుకోవడం కన్నా ప్రత్యర్థుల కదలికలను, వ్యూహాలను ఫోన్ ట్యాపింగ్‌తో తెలుసుకుని కౌంటర్‌గా వ్యూహాలు అమలు చేయడంతో పాటు ప్రత్యర్థులను లేదా తస్మదీయులపై కేసులు పెట్టడం కూడా సరికొత్త రాజనీతిగా కనిపిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను ‘టెలిఫోన్ ట్యాపిం గ్’ కుదిపివేస్తున్నది.

గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బిజెపిలు ‘టెలిఫోన్ ట్యాపింగ్’ ను ప్రధాన ఆయుధంగా మార్చుకోవడంతో లోక్‌సభ ఎన్నికల ముందు ఇదే ప్రధానాంశంగా మారింది. ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. అగ్ర రాజ్యంగా పేరు పొందిన అమెరికాలో 1974లోనే ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ నేరారోపణ రుజువు కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. ఇది వాటర్ గేట్ కుంభకోణంగా ప్రపంచ వ్యాప్తంగా చరిత్రకెక్కింది. దేశంలో కూడా గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటకలలో అధికార పార్టీలు తమ ప్రత్యర్థులపై నిఘాను అనధికారికంగా అమలు చేసి అప్రతిష్ఠపాలయ్యారు.

ముఖ్యంగా కర్నాటకలో అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన ప్రధాన ప్రతర్థి దేవగౌడపై టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఆధారాలతో సహా దొరికిపోయి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. చరిత్రలో ఇలాంటివి అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో జరుగుతున్నా బయటికి వచ్చేవి కొన్ని మాత్రమే. గతంలో ప్రభుత్వాలు, రాజ్యాధినేతలు టెలిఫోన్ ట్యాపింగ్‌లో ఇరుక్కుపోయిన చేదు అనుభవాలున్నా రాజ్యాధినేతలు టెలిఫోన్ ట్యాపింగ్‌నే ఆయుధంగా మార్చుకోవడం ఆధునిక రాజ్యనీతిగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ రోజుకో మలుపు తిరుగుతున్నది. సీనియర్ పోలీసు అధికారులు సహా అనేక మంది రాజకీయ నేతలు పేర్లు కూడా బయటికి వస్తున్నాయి. అయితే ఇవి సాక్షాధారాలతో ఎలా రుజువు అవుతాయనేది ఇప్పుడే చెప్పలేకున్నా అసలు టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం టెలిఫోన్‌ను ట్యాప్ చేయడం నేరం. దీనికి తగిన శిక్షలున్నాయి.

కానీ రాజకీయ నేతలెవరికీ ఈ చట్టం ప్రకారం శిక్షలు పడలేదు. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ సెక్షన్ 5(2) ప్రకారం ఇతరుల ల్యాండ్ లేదా మొబైల్ ఫోన్ సంభాషణలు వినడం నేరం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తిగా భంగకరం. దేశ రక్షణ, సమగ్రత, సార్వభౌమాధికారానికి ప్రమాదం ఏర్పడిన అరుదైన సందర్భాలలోనే ట్యాపింగ్‌ను అనుమతిస్తారు. అది కూడా కేంద్ర, రాష్ట్ర హోం సెక్రటరీలు అనుమతించాలి. ట్యాపింగ్‌కు అనుమతి అవసరమనుకుంటే హోం సెక్రటరీలు తొలుత 2 నెలలకే అనుమతిస్తూ ట్యాపింగ్ ఆర్డర్ ఇస్తారు. అది ప్రత్యేక పరిస్థితిలో 6 నెలలకు మించకూడదు. దీనిని నియంత్రించడానికి ప్రత్యేక రివ్యూ కమిటీ కూడా ఉంటుంది. దీనికి తోడు సుప్రీం కోర్టు కూడా పలు సందర్భాల్లో టెలిఫోన్ ట్యాపింగ్ చట్ట అనుమతి దుర్వినియోగం కాకుండా అనేక పరిమితులు కూడా విధించింది.

కాని దేశంలో అనేక రాష్ట్రాల్లో ట్యాపింగ్ అనేది అధికార పార్టీ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. నేటి ప్రధాని నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ రాష్ట్రంలో ఒక మహిళ టెలిఫోన్‌ను ట్యాప్ చేశారని అప్పట్లో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ట్యాపింగ్‌లో కూడా ఆధునికత చోటు చేసుకున్నది. టెక్నాలజీ పెరుగుదలతో పాటు సంభాషణలు వినే రికార్డు చేసే అత్యాధునిక సామగ్రి ప్రపంచ విపణిలో సులభంగా దొరుకుతున్నది. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా టెలిఫోన్ ట్యాపింగ్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నదని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నది.

కాని అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్‌ను నియంత్రించే ప్రత్యేక చట్టాలు ఎవరూ చేయడం లేదు. ట్యాపింగ్ ఆరోపణలు ఆధారాలతో సహా రుజువు కాకపోవడంతో ఎవరికీ శిక్షలు పడడం లేదు. ఈ చట్టం అంటే భయం కూడా ఎక్కడా లేదు. అందుకే ఎవరు అధికారంలో ఉన్నా ప్రత్యర్థులపై ట్యాపింగ్ వాడుకోవడం షరా మామూలుగా మారింది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఈ పెడ ధోరణులను అరికట్టే విశాల హృదయమున్న పాలకులెవరో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News