బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి తీరాన్ని దాటింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. శనివారం విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా… గుంటూరు(D) ఉప్పలపాడులో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోవడంతో ఓ టీచర్, ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మంగళగిరి గండాలయపేటలో కొండచరియలు విరిగిపడి నాగరత్నమ్మ అనే మహిళ చనిపోయింది.
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కృష్ణా: 08672-252572, గుంటూరు:0863-2234014, అనకాపల్లి:08924-226599, కోనసీమ:08856-293104, తూ.గో:8977935609, ప.గో: 08816-299219 ఏలూరు: 18002331077, ఎన్టీఆర్:0866-2575833, శ్రీకాకుళం:08942-240557, మన్యం:08963-293046, విజయనగరం:08922-236947, బాపట్ల-8712655881 నంబర్లను ఏర్పాటు చేశారు.