న్యూఢిల్లీ : దేశంలో తారాస్థాయికి చేరుకుంటున్న టమాటల ధరల అదుపునకు కేంద్రం ఎట్టకేలకు నడుంబిగించింది. సంబంధిత వినియోగదారుల విభాగం బుధవారం పరిస్థితిని సమీక్షించింది. త్వరలోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి టమాట కొత్త పంట అందడం ఆరంభమవుతుంది. ఇది అందితే సహజంగానే ధరలు తగ్గుముఖం పడుతాయని కేంద్రం భావిస్తోంది. అయితే ఇది ఎప్పటికి సాధ్యం అవుతుందనేది వివరించలేదు. సరుకు అందే క్రమం ప్రకారం తదనుగుణంగా ధరలు తగ్గుముఖం పడుతాయని ప్రభుత్వం తెలిపింది.
ప్రాంతాల వారిగా విభిన్నసాగు
టమాట పంట సాగు ప్రాంతాల వారిగా వేర్వేరుగా ఉంటుంది. అయితే ఈ పంట ఎక్కువగా కాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఉంటుంది. కాగా జులై ఆగస్టు , అక్టోబర్ నుంచి నవంబర్ వరకూ కూడా టమాట పంట సాగు అవుతుంది . కానీ ఇది తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. గత నెలరోజులుగా ధరల పెరుగుదలకు కారణాల గురించి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. జులై ఆగస్టు పంటకాలానికి ఎక్కువగా నష్టం వాటిల్లిందని వివరించారు. జులై వానకాలం ఆరంభపు దశ. వర్షాల హెచ్చుతగ్గులతో పంట దెబ్బతినడం లేదా బాగా పండటం జరుగుతుంది. ఇక రహదారులపై రాకపోకలకు ఆటంకాలతో సరఫరాలపై ప్రభావం పడిందని , దీనితోనే ధరలు పెరిగాయని కేంద్రం తెలిపింది.