దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలూ వర్సెస్ రాజ్యాంగాధినేతల మధ్య ఘర్షణ వాతావరణం రోజురోజుకు చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో విభిన్న ప్రభుత్వాలున్నప్పుడు ఈ ఘర్షణ అనివార్యమవుతోంది. అధికారాల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి జరుగుతూనే ఉంది. తరుచూ ఏవో ఒక ప్రకంపనలు చెలరేగుతూనే ఉన్నాయి. కేరళ, తమిళనాడు ఇలా ఒక్కోరాష్ర్టంలో గవర్నర్ వ్యవస్థ వివాదం అవడంతో దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది.
రాష్ట్రాలలో గవర్నర్లు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీతో సహా కేంద్ర భూభాగాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. గవర్నర్ నామమాత్రపు అధిపతిగా వ్యవహరిస్తారు, అయితే నిజమైన అధికారం రాష్ట్రాలలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వారి మంత్రి మండలిపై, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ వద్ద ఉంటుంది.ఢిల్లీ, పుదుచ్చేరి మినహా గవర్నర్ ఒక ముఖ్యమంత్రి నేతత్వంలోని మంత్రుల మండలితో అధికారాన్ని పంచుకుంటారు. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఓ గవర్నర్ అవసరం. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను ఐదేళ్ల కాలానికి భారత రాష్ర్టపతి నియమిస్తారు. ఆర్టికల్ 154 ప్రకారం రాష్ర్ట గవర్నర్‌కి కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. పరోక్షంగా అధికారుల ద్వారా పరిపాలన చేయవచ్చనేది దీనర్థం. అయితే గవర్నర్ వ్యవస్థ అనేది స్వాతంత్య్రానికి పూర్వం అంటే బ్రిటీష్ పాలన నుండే ఉన్నది.
అప్పట్లో వైశ్రాయ్ కీలకమైన పదవి. గవర్నర్ కేవలం కార్యనిర్వాహక అధిపతి. బ్రిటీష్ చట్టాలకు అనుగుణంగా నాడు ఏర్పడిన ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య గవర్నర్ వ్యవస్థ వారధిలా ఉండాలనే ఉద్దేశంతో దీనిని కొనసాగిస్తున్నారు. కానీ ఇదే గవర్నర్ వ్యవస్థను ఆసరా చేసుకుని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించిన సందర్భాలున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం ఓ బిల్లును ఆమోదించినప్పుడు స్పష్టత కోరే అధికారం గవర్నర్‌కు ఉంది. అయినా ఆ బిల్లును అమలు చేసే అధికారం రాష్ర్ట ప్రభుత్వానిదే. దేశంలో గవర్నర్లకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. చాలా రాష్ట్రాల్లో గతంలో ఇలాంటి వివాదాలు తారాస్థాయికి వెళ్లాయి. మొన్నటిదాకా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ అక్కడి గవర్నర్ మధ్య వివాదం గతంలో నిత్యకత్యంలా మారింది. అసలు గవర్నర్ పదవి అనేది ఫెడరల్ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించాల్సిన బాధ్యతాయుతమైన స్థానం. అయితే ఇక్కడ బాధాకరమైన విషయమేమంటే రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం ఉన్నపుడు, కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న గవర్నర్లు ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడం వంటి ఆరోపణలు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా మిగిలింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వ్యవహారంపై ఇచ్చిన తీర్పులో, రాష్ర్ట శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించినా, మళ్లీ అవే బిల్లులు తిరిగి రెండోసారి ఆమోదించి పంపినప్పుడు వాటిని రాష్ర్టపతికి పంపకుండా తన వద్దే ఉంచుకోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా ఉందని, గవర్నర్ తన పదవి ద్వారా స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని హెచ్చరించింది. అలాగే బిల్లులను ఆమోదించడంలో ఆలస్యం చేయకూడదని, మూడు నెలల వ్యవధిలోనే నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.
అలాగే వైస్ ఛాన్సలర్లు, ఇతర విద్యా వ్యవస్థ సంబంధిత నియామకాల్లో రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాలపై జాప్యం చేయకూడదన్న సూచన కూడా ఈ తీర్పులో ఉంది.అయితే ఇది కేవలం తమిళనాడు గవర్నర్ విషయంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందనేది న్యాయనిపుణుల అభిప్రాయం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కేంద్ర, రాష్ర్ట సంబంధాల్లో స్పష్టత తీసుకురావడంతో పాటు, ఫెడరల్ వ్యవస్థను మరింత బలపరిచే దిశగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా గవర్నర్ వ్యవహారశైలి మారకపోతే, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దిగజారే ప్రమాదం ఉంది. గవర్నర్ ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, రాజ్యాంగ ప్రమాణాలను గౌరవించే వ్యక్తిగా ఉండాలన్నది ఈ తీర్పు ద్వారా వెల్లడైన సందేశం.
ఈ గవర్నర్ల వివాదమనేది మన తెలుగు నేలను కూడా గతంలో ఆవహించిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి ఎపి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకు పనిచేసిన గవర్నర్లలో అత్యంత వివాదాస్పదుడు రావ్‌ులాల్.1984లో ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసి నాదెండ్ల భాస్కరరావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనుమతించిన గవర్నర్‌గా ఆయన చరిత్రలో నిలిచారు. ఆనాటి కాంగ్రెస్ సారథ్యంలో ఇందిరా గాంధీ అయినా, నేడు బిజెపి సారధ్యంలో నరేంద్ర మోడీ అయినా కేంద్రంలో ప్రభుత్వం మారిన ప్రతీసారి రాష్ట్రాల్లో తమ ఇష్టానుసారంగా గవర్నర్లను మార్చే చర్యల వల్ల రాష్ర్ట ప్రభుత్వాలకు గవర్నర్ వ్యవస్థే ఇబ్బందికరంగా మారింది. దాని పర్యవసానంగానే నేడు గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ బిజెపియేతర రాష్ర్ట ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయా ప్రభుత్వాల నేతత్వంలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయటం లేదు. దీనివల్ల గవర్నర్ వ్యవస్థ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిస్తుంది.
ఇది రాష్ట్రాల మధ్య విభేదాలకు దారితీస్తుంది. మోడీ ప్రభుత్వం గవర్నర్లను అడ్డుపెట్టుకుని రాష్ట్రాల హక్కుల మీద, రాజ్యాంగంలోని ఫెడరల్ సూత్రాల మీద తీవ్రమైన దాడి చేయడం 2014 నుండి జరుగుతూనే ఉంది. మహరాష్ర్ట, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, కర్నాటక, కేరళలో ఈ దాడులను చూశాం. గవర్నర్లకు రాజ్యాంగం ఇచ్చిన కొన్ని విచక్షణాధికారాలను ఉపయోగించుకుని వారు సమాంతర అధికార కేంద్రాలుగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. మన రాజ్యాంగంలోని అన్ని మౌలిక అంశాల మీద అంటే లౌకికత్వం, ప్రజాసామ్యం ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాసామ్యం, ఫెడరలిజం మొదలైన రాజ్యాంగ మౌలిక అంశాలన్నింటి మీద జరుగుతున్న దాడిలో ఇదో భాగం. అందుకే ప్రజాస్వామ్యంలో ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఆరో వేలుగా ఉండి, అసలు ప్రజాస్వామ్యాన్నే పెను ప్రమాదంలోకి నెడుతున్న ఈ గవర్నర్ వ్యవస్థ అవసరం ఇంకా ఉన్నదా? అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
నాదెండ్ల శ్రీనివాస్
96764 07140 వ్యవస్థ