Sunday, December 22, 2024

సహకార స్ఫూర్తే తారక మంత్రం

- Advertisement -
- Advertisement -

ఆర్థిక నిర్వహణ విషయంలో ఎన్‌డిఎ నేతృత్వంలోని కేంద్రానికి విపక్షంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరి ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలకు దారి తీశాయి. చివరకు ఈ విభేదాలు దేశంలో ప్రత్యేక దక్షిణాది దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ దాకా వెళ్ళాయి. విపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రంలోని బిజెపి వివక్ష, కక్షపూరిత ధోరణి వల్ల రాష్ట్రాల ప్రగతి రథాలు ఆగిపోయాయని కర్నాటక, కేరళ రాష్ట్రాలు ఢిల్లీలోనే ధర్నాను తలపెట్టడంతో ఆర్థిక పోరు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజాగా కీలకమైన సూచనలు చేసింది. తమ రాష్ట్రానికి రుణాలు రాకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని, రుణ సేకరణలపై అలవిమాలిన ఆంక్షలు పెట్టిందని, ద్రవ్య నిర్వహణ విషయంలో కేంద్రం జోక్యం లేకుండా చూడాలని సుప్రీం కోర్టులో కేరళ వ్యాజ్యం వేసింది.

ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు అటు రాష్ట్రాలకు, ఇటు కేంద్రానికి చురకలు వేస్తూ ద్రవ్య నిర్వహణ ఏ విధంగా వుండాలో తెలియజేసింది. రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య నిధుల విడుదల, అప్పులపై అనునిత్యం ప్రకటనల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కొన్ని కీలక పరిశీలనాత్మక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా రాష్ట్రాల ఆర్థిక నిర్వహణలో కేంద్రానికి సంబంధం లేదని రాష్ట్రాలు వాదించడం సరైనది కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రాల ద్రవ్య నిర్వహణ లోపభూయిష్టంగా వుంటే అది జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నందున కేంద్రానికి కూడా ఈ విషయంలో సంబంధం వుంటుందని సుప్రీం కోర్టు కేరళ వ్యాజ్యం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. కేరళ రుణ సేకరణపై కేంద్రంతో ఏర్పడిన విభేదాలను సహకార సమాఖ్య స్ఫూర్తితో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని విలువైన సూచన చేసింది. రాజ్యాంగం నిర్వచించిన సహకార సమాఖ్య స్ఫూర్తియే విభేదాల తెర వేస్తుందని ఆ సూచనలో సుప్రీం కోర్టు పేర్కొన్నది.

కేంద్రంపై కేరళ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే తప్ప ఆ రాష్ట్ర రుణాల విషయంలో చేసిన అభ్యర్థనను పరిశీలించమని కేంద్రం వాదించడం కూడా సరైనది కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 131 రాజ్యాంగ అధికరణ ప్రకారం రాష్ట్రాలకు పిటిషన్ వేసే హక్కును ఎవరూ కాదనలేరని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా కేంద్రానికి కూడా చురక వేసింది. అట్లాగని రాష్ట్రానికి ఆర్థిక నిర్వహణ విషయంలో సంపూర్ణ అధికారాలు ఎవరూ దఖలు చేయలేరని, కేంద్రం, రాష్ట్రాలు ఈ విషయంలో రాజకీయ ప్రయోజనాలకతీతంగా చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

రాష్ట్రమూ, కేంద్రమూ ఈ విషయంలో పట్టింపులకుపోతే వివాదాలు పరిష్కారం కాక సహకార సమాఖ్య స్ఫూర్తి దెబ్బ తింటుందని ఫలితంగా అటు కేంద్రమూ, ఇటు రాష్ట్రమూ నష్టపోతుందని సుప్రీం కోర్టు పరోక్షంగా ఉభయులకూ హితోపదేశం చేసింది. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ వున్నప్పుడు నిధుల పంపిణీ విషయంలోనూ, రుణాల సేకరణ విషయంలోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తూ పన్నులు సేకరిస్తూ కేంద్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరుస్తున్నాయి. కాని కేంద్రం జనాభా ప్రాతిపదికన తక్కువ జనాభా వుండి ఎక్కువ సంపదను, పన్నులను సమీకరిస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించేదిపోయి తక్కువ నిధులను కేటాయిస్తున్నది. ఫలితంగా జాతీయ స్థాయిలో సంపదలో అగ్రస్థానంలో వున్న రాష్ట్రాలు అభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి నిధులు రాక సతమతమవుతున్నాయి.

నిధుల కేటాయింపులో కీలక పాత్ర వహించే ఆర్థిక సంఘాల సూచనలు కూడా రాజకీయ ప్రయోజనాలతో కేంద్రం పాటించకుండా తమకు ఇష్టమైన లేదా తమ పార్టీలు పాలనలో వున్న ప్రభుత్వాలకు ఇతోధికంగా నిధులను పంపిణీ చేస్తున్నదని దీని వల్ల తాము అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేకపోతున్నామని తెలంగాణ, కర్నాటక, కేరళ లాంటి రాష్ట్రాలు చాలా కాలం నుంచి వాదిస్తున్నాయి. కేరళ, కర్నాటకలు ఇటీవల ఒక అడుగు ముందుకు వేసి ఢిల్లీలో ఆందోళనలు చేస్తే కేరళ ఏకంగా కేంద్రంపై న్యాయ పోరాటానికి పిటిషన్ వేసింది. దీనిపై విచారణ, వాద, ప్రతివాదనల మధ్య జస్టిస్ సూర్యకాంత్, కెవి విశ్వనాథ్‌ల ధర్మాసనం సహకార సమాఖ్య స్ఫూర్తినే ఆర్థిక వివాదాలకు పరిష్కారమని అభిప్రాయపడుతూ విచారణను వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News