Sunday, March 16, 2025

ప్రాంతాల మధ్య పునర్‘విభజన’!

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ స్థానాల పునర్విభజన చర్చ దేశంలో ఒక ప్రధాన ఎజెండాగా ముందుకొస్తున్నది. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ విషయం మరింత ఆందోళనకు దారితీస్తున్నది. ఉత్తరాది, దక్షిణాదిల మధ్య ఒక పెను వివాదంగా మారబోతున్నది. ఇప్పుటికే హిందీ భాష విషయంలో తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో లాగా ప్రతిఘటన లేకపోయినప్పటికీ హిందీకి అనుకూలత అయితే లేదు. ఇది ఇలా సాగుతుండగా, నియోజక వర్గాల పునర్విభజన విషయం ముందుకొచ్చి అన్ని వర్గాల ప్రజలను, రాజకీయ పార్టీలను కదిలించి వేస్తూన్నది.
పునర్విభజన పెరిగే స్థానాలను పరిశీలించిన తర్వాత దక్షిణాదిలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపైన తీవ్ర అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, భారతీయ జనతా పార్టీ నాయకులు దక్షిణాదిలో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం లేదని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రకటిస్తున్నారు. కాని దీనికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. ఇప్పటికీ లోక్‌సభ స్థానాల పునర్విభజన జనాభా దామాషా ప్రకారం జరగాలనేది రాజ్యాంగంలో పేర్కొన్న అంశం. దీని ప్రకారం జరిగితే దక్షిణాది రాష్ట్రాలు కొన్ని స్థానాలను కోల్పోతుండగా, ఉత్తరాదిలో ముఖ్యంగా నాలుగైదు రాష్ట్రాలు అనూహ్యంగా తమ స్థానాలను పెంచుకుంటున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రాల స్థానాలు ఎక్కువ. అందువల్ల భారత ప్రధాని కాగలిగే నాయకులు ఎవ్వరూ దక్షిణాది రాష్ట్రాలనుంచి ఎన్నిక కావడం లేదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికైన వాళ్లే ఇప్పటికీ ప్రధాన మంత్రులవుతున్నారు. ప్రత్యేక రాజకీయ కారణాల దృష్టా పి.వి. నరసింహారావు, దేవెగౌడ ఇందుకు మినహాయింపు.
ఇప్పుడు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా 2026లో లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన 543 స్థానాలకు జరిగితే ఉత్తరప్రదేశ్ 80 స్థానాల నుంచి 91కి పెరుగుతుంది. బీహార్ 40 నుంచి 50, రాజస్థాన్ 25 నుంచి 31, మధ్యప్రదేశ్ 29 నుంచి 33కు పెరుగుతాయి. అదే విధంగా దక్షిణాదిలో తమిళనాడులో స్థానాలు 39 నుంచి 31కి తగ్గి 8 స్థానాలు కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 42 నుంచి 34కు, కేరళ 20 నుంచి 12, కర్నాటక 28 నుంచి 26కు తగ్గుతాయి. నాలుగు దక్షిణాది రాష్ట్రాలు కలిపి 26 స్థానాలు కోల్పోతాయి.అంటే ఇప్పటికే ఉత్తరాదితో పోలిస్తే చాలా తక్కువ స్థానాలున్నాయి. దీనితో మరింత కిందికి పడిపోయే ప్రమాదమున్నది. రెండో అంచనా ఇంకా చాలా భయంకరంగా ఉండబోతున్నది. ఇప్పుడు అమలు జరుగుతున్న 1971 జనాభా లెక్కల ప్రకారం జరుగుతున్నాయి. ప్రస్తుతం జరగాల్సిన ఎన్నికల జనాభా లెక్కలు ఈ సంవత్సరం జరిగితే, అది 2026 జనాభా లెక్కలవుతాయి. దాని ప్రకారం మన దేశ జనాభా దాదాపు 140 కోట్లకు పైగా చేరబోతున్నది. అయితే ఈ జనాభా పెరుగుదల వల్ల లోక్‌సభ స్థానాలను పెంచితే ఆ సంఖ్య 848 పెరిగే అవకాశముంటుందని నిపుణులు భావిస్తున్నారు. దాని ప్రకారం వెళితే ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 143 స్థానాలు పెరిగి, 63 అదనంగా పొందుతుంది.
బీహార్‌లో 40 నుంచి 79, రాజస్థాన్‌లో 25 నుంచి 50 పెరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 272 స్థానాలకు సంఖ్య చేరబోతున్నది. ఇదే వరుసలో తమిళనాడులో 10, ఆంధ్ర, తెలంగాణల్లో 12, కర్నాటకలో 13, కేరళలో ఒక్క సీటు కూడా పెరగడం లేదు. అక్కడ వందల్లో, ఇక్కడ పదుల్లో పెరుగుదల ఉంది. ఈ వ్యత్యాసానికి కారణం జనాభా పెరుగుదలలో తేడాలు. ఉత్తర భారతంలో ముఖ్యంగా మధ్య భారతంలో ఉన్న సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు దీనికి దోహదం చేశాయి. ఇటీవల దేశంలో పెరుగుతున్న మత దురహంకార ధోరణులు, కులవివక్ష, అణచివేత, హత్యలు ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఉత్తర, దక్షిణ భారతాలలో పెరుగుతున్న ఈ వ్యత్యాసాలను గత 70 ఏళ్ల క్రితమే బాబా సాహెబ్ అంబేద్కర్ చక్కగా విశ్లేషించారు. ఉత్తరాది, దక్షిణాది మధ్య పెరిగే అసమానతలు అన్ని రంగాల్లో విస్తరించి చివరకు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగ సభ సమయంలో కూడా అనేక భయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ రోజు ఇతర విషయాలు ప్రధానం కావడం వల్ల ఈ విషయాలను ప్రధాన చర్చలోకి రాలేదు. కాని ఆ రోజే కొంత మంది ఉత్తరాది పెత్తనంపై, ఉత్తరాది దురహంకారంపై హెచ్చరించారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంత నిక్కచ్చిగా కొన్ని విషయాల గురించి మాట్లాడేవారో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. ఆయన తన భాషా ప్రయుక్త రాష్ట్రాలు సమస్యలు సమాధానాలు అనే అంశంపై రూపొందించిన నివేదికలో సౌత్ వర్సెస్ నార్త్ అనే ఒక అంశం చాలా ముఖ్యమైనది. అది ఆయన రచనలలో మొదటి భాగంలో ఉంది. “ఉత్తరాది, దక్షిణాదిల మధ్య చాలా పెద్ద వ్యత్యాసమున్నది. ఉత్తరాది ప్రగతి నిరోధకం. దక్షిణాది ప్రగతిశీలం. ఉత్తరాది మూఢత్వం, దక్షిణాది హేతువాదం. దక్షిణాది విద్యలో పురోగతి, ఉత్తరాది వెనుకబాటుతనం. దక్షిణాది సంస్కృతి ఆధునికం. ఉత్తరాది సంస్కృతం ప్రాచీనం” ఈ మాటలు మనకు బాబా సాహెబ్ అంబేద్కర్ దార్శనికతను, ఆధునికతను సూచిస్తున్నాయి. దానికి ఆయన ఎన్నో ఉదాహరణలను ఇచ్చారు. అంతేకాకుండా చరిత్రకారుడు, రాజకీయవేత్త ఫణిక్కర్ మాటలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఆనాటికే ఉత్తరప్రదేశ్ సాగిస్తున్న రాజకీయ పెత్తనాన్ని ఫణిక్కర్ చాలా వివరంగా ఎత్తిచూపారు. అప్పటి రాష్ట్రాల పునర్యవస్థీకరణ కమిషన్ ముందు ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ అజమాయిషీ, జనాభా ఆధిక్యత వలన భవష్యత్‌లో దేశ ఐక్యత దెబ్బతింటుందని ఫణిక్కర్ హెచ్చరించారు.
మరొకరు చాలా ముఖ్యమైన జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు సి. రాజగోపాలచారి అన్నమాటలను కూడా అంబేద్కర్ ఈ వ్యాసంలో ప్రస్తావించారు. ఈ దేశం కేవలం ఒక సమాఖ్య కింద ఉండడం మంచిది కాదని, దక్షిణాదికి వేరుగా, ఉత్తరాదికి వేరుగా సమాఖ్యలు ఉండాలని, ఆ తర్వాత అది సమాఖ్యల కూటమిగా ఉండాలని సూచించారు. అట్లా లేకపోతే ప్రధాని, రాష్ట్రపతులు ఉత్తరాది నుంచే ఉంటారని, ఇది ఐక్యతకు మంచిది కాదని సూచించారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పునర్విభజన విషయానికి దీనికి సంబంధమేమిటనే సందేహం వస్తుంది. దీనికి ఇప్పటి పునర్విభజనకు, అంబేద్కర్ అభిప్రాయాలకు, ఇప్పటి పరిస్థితికి కూడా సంబంధం ఉంది.
ఇప్పుడు మనం ఎక్కువగా చర్చిస్తున్నది మధ్య భారత ఉత్తరాది రాష్ట్రాలు. ఇందులో ప్రధాన సమస్య జనాభా. అందుకే ఉత్తరాది పెత్తనం, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ రాజకీయ గుత్తాధిపత్యం పోవడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ కొన్ని సూచనలు చేశారు. అందులో మొదటిది ఉత్తరాది రాష్ట్రాల విభజన. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాలను విభజించడం వల్ల దేశంలో సమతుల్యత వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాదిలో మొదట విభజన జరిగి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్‌లు నూతన రాష్ట్రాలుగా అవతరించాయి. అయితే బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన వాటిలో ఇవి కొన్ని మాత్రమే.
బాబా సాహెబ్ అంబేద్కర్ ఉత్తరప్రదేశ్‌లో మూడు, బీహార్‌లో రెండు, మధ్యప్రదేశ్‌లో రెండు, మహారాష్ట్రలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా ఒక భాష ఒకే రాష్ట్రం కాకుండా, ఒక భాష అనేక రాష్ట్రాలుండవచ్చునని ఆయన తెలిపారు. అట్లా చేసి ఉంటే ఉత్తరప్రదేశ్‌లో స్థానిక భాషలు, మధ్యప్రదేశ్‌లో స్థానిక భాషలు కనుమరుగయ్యేవికావు. అంతేకాకుండా ఈ పునర్విభజన విషయం ఇంతటి వివాదానికి దారి తీసేది కాదు. అంతేకాకుండా మరో పరిష్కార మార్గాన్ని సూచించారు. ప్రస్తుతం ఉన్న దేశ రాజధాని ఢిల్లీ ఎంత మాత్రం పరిపాలన సౌలభ్యం ఉన్న ప్రాంతం కాదని, అందువల్ల హైదరాబాద్‌ను రెండో దేశ రాజధానిగా చేయాలని కూడా ప్రతిపాదించారు. అంబేద్కర్ మొఘల్‌లు, బ్రిటిష్ వాళ్లు రెండు రాజధానులు ఏర్పాటు చేసుకున్నారని, అందువల్ల కొత్త ఏమీకాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఇటువంటి మనస్పర్దలు రాకుండా ఉండాలంటే పునర్విభజనల సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే దక్షిణాది, ఉత్తరాది మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలి. అందుకుగాను గతంలో రాజనీతి వేత్తలు, దార్శనికులు చూపిన పరిష్కారాల గురించి ఆలోచించాలి. అంతవరకు పునర్విభజన అనే అంశాన్ని వాయిదా వేయాలి. వాయిదా వేయడం కొత్తమీ కాదు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయీ ప్రభుత్వం ఇటువంటి వైఖరినే అవలంబించారు.
భారతదేశం సమైక్యంగా, సమగ్రతతో ఉండాలంటే వివాదాలను పరిష్కరించాలి. అందుకు గాను ఇరు ప్రాంతాల నుంచి నిపుణులతో ఒక కమిటి వేసి అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి ఒక సరియైన విధానాన్ని రూపొందించాలి. ఒకవేళ మెజారిటీ ఉందని, తాము ఏమైనా చేయగలమనీ నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే దేశ ఐక్యత, సమైక్యత, సమగ్రత ప్రశ్నార్థకమవుతుంది.

– మల్లేపల్లి లక్ష్మయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News