Wednesday, January 22, 2025

హెచ్‌సిఎలో మళ్లీ రాజుకున్న వివాదాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: హైదరబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ)లో మళ్లీ వివాదం రాజుకుంది. హెచ్‌సిఎ అధ్యక్ష పదవి కాలం సెప్టెంబర్ 26తోనే పూర్తయింది. అయినా ఇప్పటికీ మహ్మద్ అజారుద్దీన్ హెచ్‌సిఎకు అనధికార అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంపై వైరి పక్షం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 10న హైదరాబాద్ క్రికెట్ సంఘంకు ఎన్నికలు నిర్వహించాలని ఆదివారం సమావేశమైన హెచ్‌సిఎ మాజీ సభ్యులు తీర్మానించారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో సర్వసభ్య సమావేశం నిర్వహించాలని భావించిన వారికి భద్రత సిబ్బంది గేటు బయటనే నిలిపివేశారు. వీరికి స్టేడియంలో ప్రవేశించేందుకు అనుమతించలేదు. దీంతో వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, శేష్‌నారాయణ్ తదితరుల పర్యవేక్షణలో స్టేడియం ముందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి 10న హెచ్‌సిఎకు ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఇదే సమయంలో అజారుద్దీన్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతేగాక అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదులు సయితం చేశారు. ఇక వచ్చే నెలలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ పరిస్థితుల్లో హెచ్‌సిఎలోని రెండు పక్షల మధ్య వివాదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడం మ్యాచ్ నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ విషయంలో భారత క్రికెట్ బోర్డు వెంటనే జోక్యం చేసుకోవాలని వివిధ క్లబ్‌లకు చెందిన ప్రతినిధులు, హెచ్‌సిఎ మాజీ సభ్యులు కోరుతున్నారు. ఇక అజారుద్దీర్, అర్షద్ అయూబ్ వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పటికే హైదరబాద్ క్రికెట్‌ను నిర్వీర్యం చేసింది. రెండు వర్గాలు పంతాలు పట్టింపులకు పోతుండడంతో వివాదం మరింత ముదురుతోంది. కాగా, పరిస్థితులను చూస్తుంటే ఈ వివాదానికి ఇప్పట్లో పరిష్కరం లభించడం కష్టంగానే కనిపిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News