శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని గుల్మార్గ్‌లో మార్చి 7న ఫ్యాషన్ షో నిర్వహించడంపై వివాదం చెలరేగింది. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ కార్యక్రమం జరగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీని ఈ అంశం కుదిపేసింది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ),పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) , స్వతంత్ర సభ్యులు ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. అశ్లీల కార్యక్రమాన్ని ఖండించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. ముస్లిం ప్రజలు రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నప్పుడు అలాంటి కార్యక్రమం ఎలా జరిగిందో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఫ్యాషన్ షో పై వివాదం అనవసరమైన అంశమని బీజేపీ సభ్యులు వాదించారు.
అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను అంగీకరించాలని అన్నారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సభలో మాట్లాడుతూఏ తమ ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. గుల్మార్గ్‌లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమం ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఇలాంటి కార్యక్రమాలు ఏ సమయం లోనూ జరగకూడదు. ఈ ఫ్యాషన్ షోతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. వారు (నిర్వాహకులు ) ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది ఒక హోటల్‌లో నిర్వహించిన నప్రైవేట్ షో. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని సభకు వివరించారు.