Sunday, December 22, 2024

దూరదర్శన్ లోగో రంగు మార్పుపై వివాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రసార సంస్థ ‘దూరదర్శన్ ’ రంగు మారడంపై వివాదం రేగుతోంది. గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా, ఇటీవల దాన్ని కాషాయ (ఆరెంజ్) రంగులోకి మార్చినట్టు సంస్థ అధికారికంగా వెల్లడించింది. “మా విలువలు అలాగే ఉన్నాయి. కానీ ఇకనుంచి మేం కొత్త అవతార్‌లో అందుబాటులో ఉంటాం. కొత్త ప్రయాణానికి సిద్ధం కండి” అని ఆ సంస్థ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

ఈ రంగు మార్పుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. “స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ సాధించేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది . జాతీయ ప్రసార సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నమే ” అని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. అటు దూరదర్శన్ మాతృక సంస్థ ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సిర్కార్ ఈ మార్పును తప్పు పట్టారు. ఈ మార్పుతో ఇది ఇక ప్రసార భారతి కాదు, ప్రచార భారతి అనే భావన కలుగుతోందని విమర్శించారు.

ప్రసార భారతి ప్రస్తుత సీఈవో గౌరవ్ ద్వివేది ఈ మార్పును సమర్థించారు. దృశ్య సౌందర్యాన్ని మరింత పెంచేందుకే రంగును మార్చామని, దీనిపై విమర్శలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 1959 సెప్టెంబర్ 15న తొలిసారి దూరదర్శన్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి. ఆ తర్వాత దీన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కిందకు తీసుకు రాగా, జాతీయ బ్రాడ్ కాస్టర్‌గా మారింది. అనంతరం డీడీ నెట్‌వర్క్ కింద అనేక ఛానళ్లను తీసుకొచ్చారు. ప్రస్తుం దూరదర్శన్‌లో ఆరు జాతీయ , 17 ప్రాంతీయ ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి. గతంలో పలుమార్లు దీని లోగో రంగులను మార్చారు. నీలం, పసుపు, ఎరుపు ఇలా అనేక రంగుల్లో కన్పించినప్పటికీ, గ్లోబ్ చుట్టూ రెండు రేకల డిజైన్ మాత్రం మారలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News