Monday, December 23, 2024

కొలీజియం వివాదం

- Advertisement -
- Advertisement -

హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకం, బదిలీల వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య వివాదం రోజురోజుకు వేడెక్కి పరాకాష్ఠ కు చేరుకుంటున్నది. బెంగాల్ గవర్నర్‌గా అత్యంత వివాదాస్పదుడనిపించుకొని ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన జగ్దీప్ ధన్‌కడ్ శుక్రవారం నాడు ఈ అగ్గి మీద కిరోసిన్ చల్లి మరింతగా రగిలించారు. కొలీజియం వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి)ను నెలకొల్పుతూ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన 99వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించే రాజ్యాంగ నిబంధనను న్యాయ వ్యవస్థ రద్దు చేయడం ప్రపంచంలో ఎక్కడా జరగని విడ్డూరమని ఆయన అన్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఉన్న వేదిక మీద నుంచే ఆయన ఈ వ్యాఖ్యానం చేశారు.

ఉన్నత న్యాయమూర్తుల నియామక వ్యవస్థపై గత కొంత కాలంగా రగులుతున్న చిచ్చును ధన్‌కడ్ ఈ విధంగా రాజేయడం అనుకోకుండా జరిగిన పరిణామమని ఎంత మాత్రం భావించలేము. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు గత కొంత కాలంగా కొలీజియం వ్యవస్థపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ సహా అనేక మంది పెద్దలు కొలీజియంను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. న్యాయమూర్తులుగా నియమించదగ్గ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ప్రభుత్వానికి రెండవసారి పంపించిన తర్వాత వాటిని అది తప్పనిసరిగా ఆమోదించి తీరాలని జస్టిస్‌లు సంజయ్ కిషన్ కౌల్, అభయ్ వోకాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత నెలలోనే స్పష్టం చేసింది. కోల్‌కతా హైకోర్టు న్యాయవాది శాక్యసేన్ (మాజీ హైకోర్టు న్యాయమూర్తి శ్యామల్ సేన్ కుమారుడు) పేరును 2017 డిసెంబర్‌లో హైకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, సుప్రీంకోర్టు కొలీజియం ఆ పేరును తిరస్కరిస్తూ వెనక్కి పంపించింది.

2019 జులైలో అదే పేరును కోల్‌కతా హైకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు కొలీజియంకు తిరిగి సిఫారసు చేయగా అది ఆ పేరును ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆయన నియామకం ఇప్పటికీ పెండింగ్‌లోనే వుంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో సిబిఐ తరపు న్యాయవాదిగా పని చేసిన కర్నాటకకు చెందిన సీనియర్ అడ్వొకేట్ నాగేంద్ర నాయక్‌ను సుప్రీంకోర్టు కొలీజియం 2019 అక్టోబర్‌లో మరి ఎనిమిది మంది న్యాయవాదుల పేర్లతో కలిసి సిఫారసు చేయగా మిగతా వారందరినీ న్యాయమూర్తులుగా నియమించిన కేంద్ర ప్రభుత్వం నాయక్ పేరును మాత్రం పెండింగ్‌లో వుంచింది. ఆ పేరును గత సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు కొలీజియం మళ్ళీ ప్రభుత్వానికి పంపించినా నియామకం మాత్రం జరగలేదు.

గత ఫిబ్రవరి 16న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ అధ్యక్షతన గల కొలీజియం అబ్దుల్ ఘనీ అబ్దుల్ హమీద్, ఆర్ జాన్ సత్యన్ సహా ఆరుగురి పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేయగా వీరిద్దరినీ మినహాయించి మిగతా నలుగురినీ న్యాయమూర్తులుగా నియమించారు. కేంద్ర పాలకుల వ్యక్తిగత ఇష్టానిష్టాల మేరకే న్యాయమూర్తుల నియామకం జరుగుతున్నదని, ఈ విషయంలో కొలీజియంను ధిక్కరించి తాను కోరుకొన్న విధంగా వడపోతకు కేంద్రం సాహసిస్తున్నదని స్పష్టపడుతున్నది. కేవలం ఆ కారణంగానే సుప్రీంకోర్టు కొలీజియం రెండవ సారి సిఫారసు చేసిన పదకొండు పేర్లను కేంద్రం స్తంభింపచేసిందని ఇది కోర్టు ధిక్కారమని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇండియాలో సమాజం ఇంకా తగినంతగా పరిణతి చెందలేదని ఈ దశలో న్యాయమూర్తుల నియామక బాధ్యతను రాజకీయ పాలకులతో పంచుకోలేమని, ఈ నియామకాల వ్యవస్థను స్వతంత్రంగా వుంచడం ద్వారానే ఈ దేశ పౌరుల హక్కులను కాపాడగలమని ఎన్‌జెఎసిని రద్దు చేసిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ జెఎస్ కేహార్ స్పష్టం చేశారు. కొలీజియం వ్యవస్థలో భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు వుంటారు.

ఎన్‌జెఎసిలో భారత ప్రధాన న్యాయమూర్తి, మరి ఇద్దరు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జీలతో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ‘ప్రముఖ వ్యక్తులు’ సభ్యులవుతారు. ఈ ప్రముఖ వ్యక్తులు ఇద్దరినీ సిజెఐ, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునితో కూడిన కమిటీ నియమిస్తుంది. ఎన్‌జెఎసిలోని ముగ్గురు న్యాయమూర్తులు ఆమోదించే పేర్లకు మిగతా ముగ్గురూ పచ్చజెండా ఊపాలి. అలాగే రాజకీయ నేపథ్యమున్న వారి సిఫారసును వీటో చేసే అధికారం న్యాయమూర్తులకు వుంటుంది. దీని వల్ల రాజకీయ జోక్యం తప్పనిసరిగా పెరుగుతుంది. అయితే కొలీజియం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతున్న మాట కూడా వాస్తవమే. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల విషయంలో రాజకీయ జోక్యం ఎంత మాత్రం తగదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News