Wednesday, January 22, 2025

కోమటిరెడ్డికి ఊహించని షాక్.. నల్గొండ కాంగ్రెస్‌లో రచ్చ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా పార్టీలోని శ్రేణుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నల్గొండలో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో నిక్సాన కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో వెలసిన పోస్టర్లు పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. కోవర్ట్ వెంకటరెడ్డి నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన అంటూ వేసిన పోస్టర్లలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టార్గెట్ చేశారు. హైదరాబాద్‌విజయవాడ హైవే నకిరేపల్లి మండలం చందంపల్లి దగ్గర కోవర్ట్ వెంకటరెడ్డి అంటూ వేసిన పోస్టర్లలో 13 ప్రశ్నలను సంధిస్తూ నిక్సాన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన అంటూ అందులో తమ గోడు వెల్లడించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి వేసిన పోస్టర్లలో సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంలలో సర్పంచ్ ను, ఎంపిటిసిలను గెలిపించుకోలేని అసమర్ధుడు అంటూ పేర్కొన్నారు. అంతేకాదు సొంత సోదరుడిని నార్కెట్ పల్లి జడ్పిటిసిగా గెలిపించుకోలేని అసమర్ధుడని, 20 వార్డులు ఉండే నకిరేకల్ మున్సిపాలిటీలో రెండు వార్డులు మాత్రమే కాంగ్రెస్ గెలవడానికి కారణం ఎవరిని ప్రశ్నించారు. చిట్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డిని బిఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత యునానిమస్ ఎలా అయ్యారో చెప్పాలని నిలదీశారు. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంఎల్‌సి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి నగేష్ నిలబడతానంటే ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు.

నకిరేపల్లి నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాలు ఎన్ని చేయించారో చెప్పాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి తరపున ప్రచారం చేసిన నకిరేకల్ నియోజకవర్గం లో నీవు నియమించిన మండల పార్టీ అధ్యక్షుల పైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? దీనికి కారణం ఎవరు? అంటూ ప్రశ్నించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎందుకు లేదో చెప్పాలన్నారు. బిసి వర్గానికి చెందిన స్వామి గౌడ్, మల్లేష్ గౌడ్, భిక్షమయ్యగౌడ్‌లను అనేక ఇబ్బందులకు గురి చేసి పార్టీ నుంచి వెళ్లిపోయే విధంగా చేసింది నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యుల్ని కూడా గెలిపించుకోలేని నీవు స్టార్ క్యాంపెయినర్ కి అర్హుడివా? అంటూ నిలదీశారు.

సొంత తమ్ముడైన రాజగోపాల్ రెడ్డి ని, అధిష్టానం పై ఒత్తిడి చేసి టికెట్ ఇప్పించిన చిరుమర్తి లింగయ్య పార్టీ మారుతుంటే ఆపగలిగావా? అంటూ ప్రశ్నించారు. అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసులను చెత్తబుట్టలో వేసిన నువ్వు అధిష్టానాన్ని అగౌరవపరచలేదా అంటూ ప్రశ్నించారు. అసలు 2022లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ మెంబర్షిప్ లో నీకు సభ్యత్వం ఉందా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేశారు. నల్గొండ జిల్లాలో పార్టీ నాశనం కావడానికి కారణం ఎవరు నువ్వు కాదా? అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 13 ప్రశ్నలు సంధించి టార్గెట్ చేశారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై నల్గొండలో వెలసిన ఈ పోస్టర్లు స్థానికంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. ఈ పోస్టర్లు వేసిన వారు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం స్థానికంగా చర్చ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News