న్యూఢిల్లీ : వంటగ్యాసు ధరలు పెరిగాయి. ఎల్‌పిజి వంటగ్యాసు ధరలను సిలిండర్‌కు(14.2 కిలోలు) రూ 50 చొప్పున పెంచుతున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది. పెరిగిన రేట్లు సోమవారం నుంచి అమలులోకి వస్తాయి. పెరిగిన ధరతో ఇక గ్యాసు సిలిండర్‌ధర సోమవారం నుంచి రూ 769 అవుతుంది. ప్రాంతాలవారిగా ఈ ధరలో తేడాలు ఉంటాయి. ఇండేన్ గ్యాసు పేరిట దేశంలో అతి పెద్ద ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ రిటైల్‌గా సిలిండర్లు పంపిణీ చేస్తుంది. ఎల్‌పిజి సిలిండర్లపై సబ్సిడీయేతర రేట్లను నెలవారి ప్రాతిపదికన సమీక్షిస్తుంటారు. స్థానిక పన్నులను కలిపితే సిలిండర్ మరింత భారం అవుతుందని వినియోగదారులు ఉసూరుమంటున్నారు. గడిచిన డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ ఎల్‌పిజి సిలిండర్ల రేటు పెరగడం ఇది మూడోసారి. ఓ వైపు దేశంలో వరుసగా ఆరోరోజు కూడా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగి, ఇవి ఇప్పుడు ఇంతకు ముందెన్నడూ లేని స్థాయికి చేరిన దశలోనే వంటగ్యాసు ధర కూడా పెరిగింది.