Monday, January 20, 2025

వంట గ్యాస్ వరమూ ఎన్నికల ఎరే!

- Advertisement -
- Advertisement -

రాఖీ దినోత్సవ సందర్భంగా వంట గ్యాస్ ధరను రూ. 200 తగ్గించి మహిళలకు కానుకగా ఇస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది కానుక లేక వంచన అన్నది గమనించాల్సి ఉంది. సిలిండర్ ధర పెరిగింది ఎంత, తగ్గింది ఎంత అన్నది కూడా గమనించాలి. భారతదేశంలో సుదీర్ఘ కాలం ప్రజలు కట్టెల పొయ్యి పైనే వంట చేయటంతో పాటు స్నానానికి వేడి నీళ్లు కాసుకునేవారు. కాలక్రమంలో కిరోసిన్ పొయ్యిల వాడుకలోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ స్టౌలు ఒక వర్గం ప్రజలు వినియోగించారు. ఈక్రమంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా గ్యాస్ స్టౌల వినియోగం ప్రారంభించారు. నేడు 90% వినియోగానికి చేరుకుంది. నేడు దేశ వ్యాప్తంగా 30 కోట్లకు పైగా గ్యాస్ స్టౌల వినియోగదారులున్నారు. ఇందులో 9 లక్షల ఉజ్వల పథకం వినియోగదారులున్నారు. ప్రజలను ఉద్యమ బాట నుండి మరల్చేందుకు కొన్ని సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని వస్తువులపై సబ్సిడీలను ప్రకటించింది. ఎరువుల సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ, కిరోసిన్, వంట గ్యాస్ సబ్సిడీ అందులో భాగమే.

యుపిఎ ప్రభుత్వ పాలనలో సబ్సిడీతో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రూ. 414 ఉంది. మార్కెట్ ధర వెయ్యికి పైగా ఉంది. సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు గృహ అవసరాలకు 6 సిలిండర్లు చాలని 2012 లో యుపిఎ ప్రభుత్వం ప్రకటించింది.దీనిపై విమర్శలు రావటంతో 2013 జనవరిలో 9 పెంచింది. తిరిగి ఏప్రిల్ 2013లో 12 సెలిండర్లు ఇస్తామని చమురు మంత్రి వీరప్ప మెయిలీ చెప్పారు. 2014 సాధారణ ఎన్నికలు దగ్గరలో ఉండటమే అందుకు కారణం. 2014 క్రితమే ఎల్‌పిజి ఖాతాదారుల, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను లింక్ చేసిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్‌ను యుపిఎ ప్రభుత్వ ముందుకు తెచ్చింది. ఎన్నికలతో పాటు ప్రజావ్యతిరేకత వ్యక్తం కావటంతో అది ఆచరణలోకి రాలేదు. 2004- 2005 నుండి 2013 యుపిఎ ప్రభుత్వం గృహఅవసరాల సిలిండర్లపై ఇచ్చిన సబ్సిడీ రూ. 2,14,474 కోట్లుగా ఉంది. మోడీ నాయకత్వాన ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది నెలలు మాత్రమే సబ్సిడీ ధరతో వంట గ్యాస్ అందించింది.

ఆ తర్వాత గ్యాస్ వినియోగదారులు, వారి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయాలని చెప్పి అందుకు గడువు 14 ఫిబ్రవరి -2015గా ప్రకటించింది. ఆ గడువు లోపు సబ్సిడీ గ్యాస్ అందిస్తామని, ఆ తర్వాత ఆధార్ లింక్‌గాని వారికి అందదని పేర్కొన్నది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ మొత్తం ధరను చెల్లించాలి. ఆ తర్వాత సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాకి జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మోడీ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయం సబ్సిడీ ఎత్తి వేతకేనని అనేక మంది విశ్లేషకులు పేర్కొన్నారు.సబ్సిడీ ఎత్తవేత గురించి విశ్లేషకులు, ప్రజాసంఘాలు చెప్పిందే నిజమని మోడీ ప్రభుత్వం రుజువు చేసింది. 150 నుండి 200 వరకు సబ్సిడీ కొద్ది నెలలు పాటు బ్యాంకు ఖాతాలకు జమ చేసినా అది కూడా చాలా మంది ఖాతాల్లో పడలేదు. 2016 నుంచే సబ్సిడీ బ్యాంకు ఖాతాలకు జమకాని పరిస్థితి అప్రకటితంగా ఏర్పడింది.

సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ప్రకటించటం, వాటిని నీరుగార్చటంలో గత పాలకులకు ఆరితేరి ఉన్నారు. మోడీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ అసలు సబ్సిడీలనే రద్దు చేస్తున్నది. కిరోసిన్ సబ్సిడీ రద్దు చేసింది. వంట గ్యాస్‌పై సబ్సిడీని 2018 నుండి 2022 వరకు ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వచ్చింది. యుపిఎ 9 సంవత్సరాల పాలనలో రూ. 2,14,474 కోట్లు వంట గ్యాస్ సబ్సిడి ఇస్తే, మోడీ ప్రభుత్వం ఇచ్చింది 36,598 కోట్లు మాత్రమే. దీన్ని గమనిస్తే మోడీ ప్రభుత్వం సబ్బిడీ ఎత్తివేతకు ఎలా శ్రీకారం చుట్టింది అర్ధమవుతుంది. 2014లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 414 రూపాయల ఉండగా మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015 డిసెంబర్‌లో రూ. 600, 2016లో రూ. 630, 2017లో రూ. 646, 2018లో రూ. 900, 2019లో రూ. 700, 2020లో రూ. 910, 2022లో రూ. 1100 వందలకు పెరిగి 2023 నాటికి రూ. 1150 చేరింది. వాణిజ్య అవసరాల సిలిండర్ ధర రూ. 2,325లకు పెరిగింది. మోడీ తొమ్మిది సంవత్సరాల పాలనలో గృహవినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 700లకు పైగా పెరిగింది.

గతంలో ఎల్‌పిజి 14.2 గ్యాస్ కనెక్షన్ తీసుకోవటానికి 1450 కడితే సరిపోగా, ఇప్పుడు దాన్ని రూ. 3 వేలకు పెంచారు. వాణిజ్యపర గ్యాస్ కనెక్షన్ రూ. 2550 ఉండగా ఇప్పుడు రూ. 3,600కి పెరిగింది. వంట గ్యాస్ ధర పెరగటానికి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగటమే కారణమని మోడీ ప్రభుత్వం చెప్పటం ఏమాత్రం వాస్తవం కాదు. 16 మే-2014న ముడి చమురు బ్యారల్ ధర 107.09 డాలర్లు ఉండగా నేడు 73 డాలర్లకు తగ్గింది. గత 74 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధర తగ్గు ముఖంలో ఉన్న ది. 2020 జనవరిలో దేశంలో ముడి చమురు బ్యారల్ ధర 64.31 డాలర్లు ఉండగా, మార్చిలో బ్యారల్ ధర 33.36 డాలర్లకు తగ్గింది. మేలో బ్యారల్ ధర కేవలం 19.9 డాలర్లకి పడిపోయింది. ఈ వాస్తవాన్ని గమనిస్తే ముడి చమురు ధరలు పెరగకపోగా గణనీయంగా తగ్గాయన్నది వాస్తవం. మోడీ ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవం. ముడి చమురు ధరలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దిగుమతులపై సుంకాన్ని 12 సార్లు పెంచింది.

దాని ఫలితంగా పెట్రోల్ ధర 211%, డీజిల్ ధర 443% పెరిగింది. పన్నులు పెంచటం ద్వారా రూ. 14.66 లక్షల కోట్లకు పైగా మోడీ ప్రభుత్వం ప్రజల డబ్బులను కొల్లగొట్టింది. ఈ మొత్తాలను కార్పొరేట్ కంపెనీలకు రాయితీలుగా ఇస్తున్నది. రాఖీ దినోత్సవ సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 200 తగ్గించి మహిళలకు కానుక ఇచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్న మోడీ ప్రభుత్వం, 8- మార్చి -2023లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వంట గ్యాస్ ధర పెంచటం కూడా మహిళలకు కానుకగా ఇవ్వటమే గదా! తొమ్మిది సంవత్సరాల్లో రూ. 800 దాకా గ్యాస్ ధర పెంచి రూ. 200 తగ్గించటం కానుకగా మహిళలు భావించాలా! తగ్గించిన రూ. 200 కూడా చమురు సంస్థలనే భరించమని, పెద్ద ఎత్తున వచ్చిన లాభాల్లో అందుకు కేటాయించాలని మోడీ ప్రభుత్వం చెప్పనట్లు వార్తలు వచ్చాయి. దీన్ని గమనిస్తే చమురు సంస్థల లాభాలకు మోడీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది వెలడవుతుంది. రానున్న ఎన్నికల్లో మహిళల ఓట్లు పొందేందుకే గ్యాస్ ధర రూ. 200 తగ్గింపు తప్ప, మహిళలపై ప్రేమ కాదని అర్ధం చేసుకుని పెంచి గ్యాస్ ధర మొత్తాన్ని తగ్గించాలని, ఆస్తి హక్కు కల్పించాలని, చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, లింగ వివక్ష రద్దు చేయాలని దేశ మహిళలందరూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News