అకారణంగా ఏదీ జరగదు, శూన్యం నుంచి ఏ ఒక్కటీ ఊడిపడదు. రెండున్నర సంవత్సరాలుగా వంట గ్యాస్ అధిక ధరల బండ బరువు కింద నలిగిపోతూ అలవికాని జీవన వ్యయంతో అతలాకుతలమైపోతున్న దీన భారత జనానికి వున్నట్టుండి కనీవినీ ఎరుగని ఊరట ఊరకే కలగదు. వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 200 తగ్గించడం ఎంత మాత్రం ఆశ్చర్యపోవలసిన అంశం కాదు. మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14.2 కిలోల బరువుండే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇది బుధవారం నుండే అమల్లోకి వస్తుంది. ఈ సౌకర్యాన్ని ఉజ్వల పథకం కింద ఇస్తున్న సిలిండర్లకూ వర్తింప చేయనున్నారు. ఈ సిలిండర్ల లబ్ధిదారులు ఇప్పటికే రూ. 200 సబ్సిడీని అనుభవిస్తున్నారు. దీనితో కలుపుకొంటే వారికి అందే సబ్సిడీ రూ. 400కి చేరుకొంటుంది. అలాగే ఉజ్వల పథకం కింద 75 లక్షల కొత్త సిలిండర్లను ఇవ్వాలని కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొన్నది.
రక్షాబంధన్, ఓనమ్ పండుగల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని కోట్లాది మంది తన అక్కా చెల్లెళ్లకు ఈ బహుమతిని ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ రెండు పండగలూ కొత్తగా ఈ ఏడాదే వస్తున్నాయని అనుకోవాలా? రాబోయే లోక్‌సభ ఎన్నికలే కోట్లాది మంది తన అక్కాచెల్లెళ్ల మీద ప్రధాని మోడీలో ఇంత ప్రేమ పుట్టుకొచ్చేలా చేశాయన్నదే అసలుసిసలైన వాస్తవం. ప్రజలు తమకున్న ఓటు హక్కుతో ఇచ్చిన అపరిమితమైన దేశాధికారాన్ని ఉపయోగించి తొమ్మిదిన్నరేళ్ళుగా వారికి గట్టిగా ఒక్క మేలైనా చేయని ప్రధాని మోడీకి ఎన్నికల వల్లనైనా వారి పట్ల ఇంతటి ప్రేమ కలగడం ఆనందించవలసిన విషయమే. ఇంత కాలం కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు సాధారణ ప్రజల జేబులు కొల్లగొట్టి కార్పొరేట్ల లాభాలను ఇబ్బడిముబ్బడిగా పెంచిన ప్రధానికి తనను అధికారంలోకి పంపించిన సాధారణ జనం మీద ఇన్నాళ్ళకైనా దయ కలగడం హర్షించవలసిన పరిణామమే. అయితే రూ. 200 తగ్గించిన తర్వాత కూడా దేశంలో వంట గ్యాస్ సాధారణ వినియోగదార్లకు ఆ సిలిండర్ ఖరీదైనదిగానే వుంటుంది.
ఎందుకంటే రూ. 200 మినహాయిస్తే సిలిండర్ ధర ఇంకా రూ. 903 వద్ద వుంటుంది. 2021 ఫిబ్రవరికి ముందు దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 694. ఆ నెల 4న రూ. 25తో ప్రారంభమైన పెంపు అదే నెలలో మరి రెండు సార్లు అదే కిమ్మత్తు మేరకు ఎగబాకింది. అలాగే 2021 మార్చి 21న మరో రూ. 25 పెరిగింది. అలా 2022 అక్టోబర్ 24 వరకు రూ. 15, రూ. 25, రూ. 50 వంతున పెరుగుతూ వచ్చింది. అలా రెండున్నర సంవత్సరాల పాటు సాధారణ ప్రజలను నిర్విరామమైన పెంపుతో బాధిస్తూ వచ్చిన ప్రధాని మోడీకి వారి మీద ఇంతటి కనికరం కలగడానికి కారణమైన రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రజలు ఎంతగానో రుణపడి వున్నారు. ఎన్నికలకు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినప్పటికీ అవి అనునిత్యం, ప్రతిరోజూ వస్తూనే వుండాలని వారు ఆశిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రజలు ఉపయోగించే ప్రతి సరకు మీద జిఎస్‌టిని ఎడాపెడా విధించి వారి బతుకులను దుర్భరం చేసిన ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని వారు ఎలా హర్షించగలుగుతున్నారన్నది కీలక ప్రశ్న. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 9.6 కోట్ల మంది లబ్ధిదారులున్నారు.
అలాగే సాధారణ గృహ వంట గ్యాస్ వినియోగదార్లు 31 కోట్ల మంది వున్నట్టు సమాచారం. అంతకు ముందు వరకు వున్న వంట గ్యాస్ సబ్సిడీని 2020 జూన్ నుంచి కేంద్రం నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ సబ్సిడీ మొదలైంది. అంటే ఏరు దాటేంత వరకు ఓటు మల్లయ్య దాటిన తర్వాత ఓటి మల్లయ్య అనేది మన ప్రజాస్వామ్యంలో ఎంతగా రుజువవుతున్నదో ప్రజలను రాజకీయ ప్రభువులు ఏ విధంగా మోసగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య గమనించదగినది. గత రెండు నెలల్లో ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రెండేసార్లు సమావేశమైందని, ఆ దెబ్బకు ఫలితంగానే కేంద్రం వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 200 తగ్గించిందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్ర పాలకులు హెలికాప్టర్లను ముందుగానే రిజర్వు చేసుకొంటున్న తీరును గమనిస్తే ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు రాగలవనిపిస్తున్నదని ఆమె అన్న మాట కూడా అతిశయోక్తి కాదనిపిస్తున్నది. అయితే పెట్రోల్, డీజెల్‌కు ఇప్పటికీ లీటరు వద్ద రూ. 100కు పైగా చెల్లిస్తున్న ప్రజలు ఈకాస్తా ఊరట చర్యలకు ఉబ్బితబ్బిబ్బు అయిపోరు. వాటి ధరలను కూడా తాత్కాలికంగా ప్రధాని మోడీ ప్రభుత్వం తగ్గించినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ప్రజలను వంచించి కార్పొరేట్ యజమానుల, దళారుల సేవలో తరించే పాలకుల పట్ల నిత్యం అప్రమత్తంగా వుండాలి.