గరిష్టంగా రూ 20 వరకూ ఉపశమనం
సుంకాలు ఇతర చర్యలతో కళ్లెం
టోకు రేటుపై కేంద్రం వివరణ
న్యూఢిల్లీ : దేశంలోని ప్రధాన మార్కెట్లలో వంటనూనె టోకు ధరలు కిలోకు రూ 5 నుంచి రూ 20 వరకూ తగ్గాయి. నూనెల బ్రాండ్లను బట్టి ఈ తగ్గింపు పరిణామం నెలకొంది. కేంద్రం ఇటీవలి కాలంలో తీసుకున్న పలు చర్యలతో వంటనూనెల ధరలకు కళ్లెం పడిందని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం తెలిపారు. దిగుమతి సుంకాలలో తగ్గింపులు వంటి పలు చర్యలను తీసుకున్నట్లు, దీనితో వంటనూనెల ధరలు గాడిలో పడుతున్నట్లు వివరించారు. కేంద్రం ఇటీవలే పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. రాష్ట్రాలు వ్యాట్‌ను సడలించాలని సూచించింది. ఇప్పుడు వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు తరువాత పేరు మోసిన చమురు ఉత్పత్తి కంపెనీలు తమ సరికొత్త సరుకుపై ధరల తగ్గింపుతో సవరించిన రేట్లు అమర్చారని పాండే తెలిపారు. చాలా కాలంగా వివిధ రకాల వంటనూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో పండుగలు, ఉత్సవాల సీజన్‌లో మధ్యతరగతి ప్రజలు దీని భారాన్ని మోయాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో జాతీయంగా వంటనూనెల ధరలు పెరుగుతూ వచ్చాయి.
వంటకు వాడే నూనెల సరఫరా అరకొరగా ఉండటం ప్రధాన సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో మనం వంటనూనెను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న ఇండోనేషియా, బ్రెజిల్ ఇతర దేశాలలో ఈ సరుకును జీవ ఇంధన అవసరాలకు వాడుతున్నారు. దీనితో అక్కడి నుంచి సరఫరాలు తగ్గాయి. ఈ క్రమంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నివారణకు తాము దృష్టి సారించామని పాండే ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పలు చర్యలు చేపడుతూ వస్తున్నామని, ముందుగా ఇంపోర్డు డ్యూటీని తగ్గించామని ఈ క్రమంలో చిల్లర ధరలు తగ్గినట్లు దాదాపు 167 కేంద్రాల నుంచి సరైన సమాచారం అందిందని తెలిపారు. ఇది చాలా సంతోషకర పరిణామం అన్నారు. ఒక్కో ప్యాకెట్‌కు (కెజి పరిణామం) కనీసం రూ 5 నుంచి రూ 20 వరకూ తగ్గుముఖం పట్టిందని తెలిపారు.
పూర్తి స్థాయిలో పలు రిటైల్ మార్కెట్లలో వంటనూనెల ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నట్లు వివరించారు. ఢిల్లీలో పామాయిల్ ధరలు రూ 5 మేర తగ్గింది. దీనితో ఈ నెల మూడు నుంచి ఇక్కడ కిలో నూనె ధర రూ 133 అయింది. ఇక ఇతర ప్రాంతాలలో కూడా ధరలు తగ్గాయని పట్టికను చూపారు. పల్లీ , సోయాబిన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు కూడా మూడో తేది రికార్డుతో చూసుకుంటే తగ్గుదలలో ఉన్నాయని తెలిపారు. పలు చర్యలు తీసుకుంటున్నా ఇప్పటివరకూ దేశంలో ఆవాల నూనెల ధరలు అదుపులోకి రాలేదని పాండే అంగీకరించారు. అయితే ఇప్పుడు దిగుమతి సుంకాలలో తగ్గింపులతో ఇకపై ఈ నూనె ధర కూడా తగ్గుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.