Monday, January 20, 2025

వంటనూనెల ధరలు సలసల!

- Advertisement -
- Advertisement -

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే వ్యాపారులు మరొకటి తలచారు. దీంతో వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వంటనూనెలపై దిగుమతి సుంకం 20శాతం పెంచటంతో నూనెల ధరలు ఒక్కసారిగా సెగలు చిమ్ముతున్నాయి.వ్యాపారులు లీటరు వంటనూనెల ధరలు ఏకంగా పది రూపాయల నుంచి రూ.20కి పెంచివేశారు. చిల్లర దుకాణాల్లో వీటికి అదనంగా మరో రూ.5 ఎక్కువే లాగుతున్నారు.కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెలకు మాత్రమే దిగుమతి పన్నులు 20శాతం పెంచింది. అయితే వ్యాపారులు ఇదే అదనుగా భావించి ఏకంగా వేరుశనగ, నువ్వులు , ఆవాలు,కొబ్బరి , రైస్‌బ్రాన్ అయిల్ తదతర వాటి ధరలను కూడా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల నూనెల దిగుమతి పన్నుల ధరలను పెంచిందని సమర్ధించుకుంటున్నారు.

ఇష్టమైతే కొనండి లేదంటే పదండి అని ముఖాన్నే చెబుతున్నారు.కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతి సుంకం 20శాతం పెంచిన తర్వాత దేశంలోకి దిగుమతి అయ్యే నూనెలకు మాత్రమే పెంచిన సుంకం మేరకు కొత్త రేట్లను అమలు చేయాల్సివుంది. అయితే వ్యాపారులు తమ వద్ద నిల్వ ఉన్న నూనెల ప్యాకెట్లపై పాత ధరను మార్చి వేసి విక్రయిస్తున్నారు. ప్యాకెట్లకు ధరల వద్ద ఉన్న సూచిపై స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నారు. పొద్దుతిరుగుడు నూనె ధర లీటరు ప్యాకెట్ పాత వాటి ధర రూ.110 ఉండగా దీన్ని రూ.120గా స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు. అన్ని రకాల వంటనూనెలపైనా ధరులు రూ.10నుంచి 15 రూపాయలకు పెంచి కొత్తగా స్టిక్కర్లు అతికించి యధేశ్చగా విక్రయాలు జరుపుతున్నారు. రిఫైండ్ పామాయిల్ , సోయా, పొద్దుతిరుగుడు నూనెలపైన కేంద్ర ప్రభుత్వం విధించిన సెస్‌కు అదనంగా అగ్రికల్చర్ సెస్‌భారం కూడా అన్ని వర్గాల వినియోగదారులపైన పడుతోంది.

60శాతం విదేశీ వంటనూనెలే:
మార్కెట్లలో వంటనూనెల విక్రయాల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి అయ్యే వంటనూనెలే కనిపిస్తున్నాయి. వీటిలో అత్యధికంగా పామాయిల్ , పొద్దుతిరుగుడు, సోయా నూనెలె ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గణాంకాల మేరకు ఏటా 25బిలియన్ మెట్రిక్ టన్నుల వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఏటా లక్ష కోట్ల నుంచి 1.20లక్షల కోట్ల మేరకు ఖర్చు చేయాల్సివస్తోంది. వంటనూనెల దిగుమతి ద్వారా విదేశీ మారక నిల్వలు హరించుకుపోతున్నాయి. మలేషియా, థాయ్‌లాండ్ , ఇండోనేషియా, ఉక్రేయిన్ తదితర దేశాల నుంచే అత్యధికంగా పామాయిల్, పొద్దుతిరుగుడు తదితర వంటనూనెల దిగుమతి జరుగుతోంది. ఉక్రేయిన్ యద్దం నేపధ్యంలో గత రెండేళ్లుగా ఆ దేశం నుంచి దిగుమతి తగ్గినా ,ఆ స్థానంలో మిగిలిన దేశాల నుంచి దిగుమతి పెరిగింది. ప్రపంచంలో వంట నూనెలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ప్రధమ స్థానంలో ఉంది.

స్వయం సమృద్ది నినాదాలకే పరిమితం !
దేశంలో వంట నూనెల స్వయం సమృద్ది కేంద్ర ప్రభుత్వ నినాదాలకే పరిమితమవుతూ వస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత దశాబ్ద కాలంగా స్వయం సమృద్ది ప్రణాళికలు ఆచరణకు నోచుకోలేకపోతున్నాయి. దేశంలో పామాయిల్ పండించే రాష్ట్రాల్లో దక్షిణాదిన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , కేరళ రాష్ట్రాల్లోనే 90శాతం ఆయిల్‌పామ్ సాగు జరుగుతోంది. ఈ రాష్ట్రాలనుంచే పామాయిల్ అధికంగా ఉత్పత్తి జరుగుతోంది.దేశంలో 10లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగును పెంచే అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆశించిన ఫలితాలను పొందలేకపోతోంది. ఆయిల్‌పామ్ సాగు పెంపుదలకోసం మాత్రమే కేంధ్ర ప్రభుత్వం 11వేల కోట్లతో ప్రణాళిక అమలు చేస్తుండగా అందులో కేంద్రం రూ.8800కోట్లు మాత్రమే భరిస్తోంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలపైనే రుద్దుతోంది.పొద్దుతిరుగుడు , వేరుశనగ ,ఆవాలు , నువ్వులు తదితర పంటల సాగుకు ఎటువంటి ప్రోత్సాహాలు ప్రభుత్వం నుంచి అందటం లేదు. కనీసం ఆ దిశగా కూడా కేంద్రం ఆలోచించటం లేదన్న విమర్శలు వస్తున్నారు.ఆయిల్ పామ్ సాగు పట్ల రైతులు స్వచ్చందంగా ముందుకు రావటం లేదు. సబ్సిడీల ఆశతోనే లక్ష్యాలు చేరుకోవటం సాధ్యపడటం లేదని అధికారులు చెబుతున్నారు.

కనిపించని నిఘా..సామాన్యుడికే ధరల సెగ:
వ్యాపారులు అన్ని రకాల వంటనూనెల ధరలు పెంచి విక్రయాలు చేస్తుంటే నిఘా ఆధికారగణాలు చోద్యం చూస్తున్నాయి. మూడు రోజులుగా మాల్స్‌లో , కిరాణా షాపుల్లో వంటనూనెల ధరలు పెంచి విక్రయాలు చేస్తుంటే ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. రానున్నది దసరా, దీపావళి , క్రిష్టమస్ తదితర పండుగల సీజన్ కావటంతో వ్యాపారులు తమ వద్ద ఉన్న నిల్వలను కూడ గిడ్డంగుల్లో దాచేసి అధిక ధరలకు విక్రయించి సోమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం . వంటనూనెల ధరల సెగలతో సామన్యులే విలవిలలాడాల్సివస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News