Wednesday, January 8, 2025

సమన్వయంతో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించనున్న విద్యుత్ దినోత్సవం, పారిశ్రామిక దినోత్సవం, సాగునీటి దినోత్సవం, ఊరురా చెరువుల పండగ, సంక్షేమ సంబురాలు, సుపరి పాలన దినోత్సవాలను అధికారులందరూ సమన్వయంతో మమేకమై పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కోరారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణ లో భాగంగా జూన్ 5 నుండి 10 వరకు ఆయా దినోత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల ఐదున విద్యుత్ దినోత్సవాన్ని సజావుగా నిర్వహించాలన్నారు.

రైతులను ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు తెలియజేయాలన్నారు. జూన్ 6న పారిశ్రామిక దినోత్సవం అన్ని పారిశ్రామిక వాడలలో జరపాలన్నారు. ఫ్యాక్టరీ వారిగా కార్మికులు సిబ్బందితో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర అవతరణ తదుపరి పారిశ్రామిక రంగంలో సాధించిన విజయాల గురించి వివరించాలన్నారు. ఐటీ రిలేటెడ్ ఉద్యోగులు, మీసేవ కేంద్రాల నిర్వహకులు, అందరూ భాగస్వాములు కావాలన్నారు. మీసేవ కేంద్రాలు, అన్ని ఫ్యాక్టరీలు రైస్ మిల్లర్స్ సీరియల్ బల్బు లతో అలంకరించాలని, దశాబ్ది ఉత్సవాల లోగో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయి సమావేశం పటాన్చెరు లోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో జరుగుతుందని, ఆయా అనుబంధ శాఖల వారు, పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

7న సాగునీటి దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను గౌరవ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాలు వస్తున్నందున ఈ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరాదని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలన్నారు. నాడు నేడుకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్ల నిర్మాణం, ఎత్తిపోతల పథకాలు, జిల్లాలో సాగునీటి వసతి ఏ విధంగా పెరిగింది అన్నది స్టాల్స్ లో ప్రతిబింబించాలని అన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టుతో ఒక్క మునిపల్లి మండలంలోని 28 వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు.

ఇరిగేషన్ శాఖ డి ఈ, ఏ ఈ లకు వ్యవసాయ శాఖ ఏవోలు ఏఈవోలు సహకరించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఊరూరా చెరువుల పండుగ బ్రహ్మాండంగా జరపాలని, చెరువుల వద్దకు అన్ని కులవృత్తులవారు,రైతులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ప్రొసీశన్ తో వెళ్లాలని, కట్ట మైసమ్మ దేవాలయాలను విద్యుదీకరించి, పూజలు చేయాలని అందుకు అవసరమైన ఆయా ఏర్పాట్లను సజావుగా చేయాలని సూచించారు. తెలంగాణ సంక్షేమ దినోత్సవం, సుపరిపాలన దినోత్సవం ను ఆయా అధికారులు ప్రణాళికతో నిర్వహించాలని సూచించారు.ఆయా శాఖల అధికారులు ,అనుబంధ శాఖల అధికారులు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేసి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇరిగేషన్ శాఖ సిఈ అజయ్ కుమార్, ఎస్ ఈ మురళీధర్, విద్యుత్ శాఖ ఎస్ ఈ మాధవరెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం ప్రశాంత్ కుమార్, డిఆర్‌డిఓ శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్‌ఓ నగేష్, ఆర్డిఓ రవీందర్ రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన బ్యాడ్జిని కలెక్టర్‌కు అదనపు కలెక్టర్ అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News