ప్రపంచం మొత్తం మీద అసాధారణ వాతావరణ పరిణామాలకు తోడు ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం ఫలితంగా తలెత్తిన ఇంధన సంక్షోభం, బొగ్గుపులుసు వాయువుల వెల్లువను తగినంతగా ప్రపంచ దేశాలు కట్టడి చేయలేకపోతున్నాయి. భవిష్యత్తులో భూగోళాన్ని ఎలా పరిరక్షించుకోవాలన్న ప్రధాన అంశాలు చర్చించేందుకు ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న వాతావరణ ‘కాప్’ సదస్సులు మొక్కుబడిగా సాగుతున్నాయి తప్ప అనుకున్న లక్షాలను సాధించడం లేదు. వాతావరణ మార్పులను నివారించడానికి ఎలాంటి ప్రణాళికలు చేపట్టాల్సి ఉంటుందో సదస్సులోని సభ్యదేశాలు తప్పనిసరిగా చర్చించవలసి ఉంటుంది.
ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నా అగ్రదేశాలు ఈ విషయంలో అంటీఅంటనట్టు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు కాప్ 29 సదస్సులో కూడా అగ్రదేశాలు నిధుల కేటాయింపు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం స్పష్టమైంది. అజర్‌బైజాన్ రాజధాని బాకు వేదికగా ఐక్యరాజ్యసమితి కాప్ 29 పర్యావరణ సదస్సులో దాదాపు (నవంబర్ 11 నుంచి 24 వరకు) 14 రోజుల పాటు సాగిన చర్చలు అనుకున్న లక్షాల సాధన విషయంలో అసంతృప్తినే మిగిల్చాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులపై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు అందజేయాల్సిన ఆర్థిక సాయం 300 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. పదేళ్లపాటు ప్రతి సంవత్సరం 300 బిలియన్ డాలర్లు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంపన్న దేశాలు నిధులు సమకూర్చాలని కాప్29 సదస్సు చేసిన తీర్మానంపై భారత్‌తో సహా వర్ధమాన దేశాలన్నీ అసంతృప్తి వ్యక్తం చేశాయి.
ఏటా 300 బిలియన్ డాలర్లు చాలవని, కనీసం 1.3 ట్రిలియన్ డాలర్లయినా ఇవ్వాలని వాదించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏటా ఎదుర్కొంటున్న వాతావరణ బీభత్సం, ఇతర సమస్యల సవాళ్లతో పోలిస్తే 2035 వరకు ఏటా కేటాయించే ఈ 300 బిలియన్ డాలర్ల మొత్తం చాలా అల్పమైనదని భారత్ విమర్శించింది. అయితే అగ్రరాజ్యం అమెరికా మాత్రం 300 బిలియన్ డాలర్ల వాతావరణ నిధి తీర్మానం ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించింది. 2015లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కాప్ సదస్సులో ఆమోదించిన 1.5 డిగ్రీల సెల్సియస్ స్థాయికి ప్రపంచ ఉష్ణోగ్రతలను తగ్గించే లక్షం ఈనాటికీ సాంకేతికంగా చూసినప్పుడు సాధ్యమేనని, ఐతే రాబోయే పదేళ్లలో మాత్రం వాతావరణంలో కలుషిత వాయువులను గణనీయంగా తగ్గించుకోవలసిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఆనాడు పారిస్ ఒప్పందంపై 200 దేశాలు సంతకాలు చేశాయి.
పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ శతాబ్దాంతానికి వాతావరణంలో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతాయని తాజా అంచనాలు చెబుతున్నాయి. 2023లో 57.1 గిగా టన్నుల కార్బన్‌డైయాక్సైడ్ వాయువుల వరకు ప్రపంచ ఉద్గారాలు రికార్డు స్థాయిలో చేరుకున్నాయి. ఇవి 2022 నాటికన్నా 1.3 శాతం ఎక్కువ. వీటిలో 77% జి20 దేశాల నుంచే వెలువడుతున్నాయి. ఈ ఉద్గారాలను తక్షణం నిరోధించలేకుంటే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ సెల్సియస్ వరకు భూతాపాన్ని అదుపు చేయాలన్న పారిస్ సదస్సు ఒప్పంద లక్షం కొన్నేళ్లలోనే కనుమరుగైపోయే ప్రమాదం ఉంటుంది. వాతావరణ మార్పుల కట్టడికి కట్టుబడి ఉండటం ఎంతో వ్యయంతో కూడుకున్న లక్షం.
అందుకు వర్ధమాన దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని అభివృద్ధి చెందిన దేశాలు 2009 కొపెన్‌హెగెన్ వాతావరణ సదస్సులో ప్రతిజ్ఞ చేసినా, అది ఇంతవరకు సరిగ్గా అమలు కాలేదు. అలాగే కాప్ 26 సదస్సులో శిలాజ ఇంధనాల వినియోగాన్ని విడిచిపెట్టాలన్న ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయాన్ని కొంతవరకు పట్టించుకోకుండా పక్కన పెడితే బాగుంటుందని సౌదీఅరేబియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఐక్యరాజ్యసమితిని పరోక్షంగా అభ్యర్థించాయి. ఈ సమస్యను నీరు గార్చాలని కోరుతూ ప్రభుత్వాల నుంచి, కంపెనీల నుంచి, మరికొన్ని సంస్థల నుంచి దాదాపు 3200 అభ్యర్థనలు వచ్చాయి. మొత్తం మీద శిలాజ ఇంధనాల వినియోగాన్ని అంత తొందరగా తగ్గించవలసిన అవసరం లేదన్న అభిప్రాయంలో అమెరికా తదితర అగ్రదేశాలు ఉన్నాయి. బొగ్గు వినియోగాన్ని బాగా తగ్గించాలన్నదే కాప్ సదస్సుల ప్రధాన అజెండా అయినప్పటికీ ఆ మేరకు బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయడానికి ఆస్ట్రేలియా తదితర దేశాలు ముందుకు రావడం లేదు.
బొగ్గు నుంచి వెలువడే వాయువులను శూన్యస్థాయికి తీసుకురావాలన్న ప్రతిపాదనకు అగ్రదేశాలు మొగ్గు చూపడం లేదు. 2030 నాటికి అడవుల నిర్మూలనను పూర్తిగా అరికడతామని ఆస్ట్రేలియాతోపాటు మరో 123 దేశాలు కాప్ 26 సదస్సులో ప్రమాణ పత్రం పై సంతకాలు చేశాయి. అంతకన్నా ముందు కూడా ఇలాంటి ఒప్పందాలు అనేకం జరిగాయి. ఇవి అమలులోకి రానప్పుడు ఫలితం ఏముంటుంది? హిమాలయాలు వంటి సున్నిత ప్రాంతాల్లో అడవులను నరికి వేయడం, నిర్మాణాలు చేపట్టడం ఫలితంగా తీవ్ర వైపరీత్యాలు సంభవిస్తుండటం మనకు నిత్యం అనుభవమవుతున్నాయి. ఆసియా మొత్తం మీద అటవీ భూములు తగ్గిపోగా, అభివృద్ధి నిర్మాణాల పేరుతో అటవీ భూముల పరిరక్షణ చట్టాలనే మార్చి వేస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇంతవరకు జరిగిన వాతావరణ సదస్సులు ప్రమాణ పత్రాలకే పరిమితమైన మొక్కుబడి సదస్సులుగా మిగిలిపోయాయి.