భోపాల్: ఓ ఎఎస్‌ఐని బిజెపి నేత బెదిరించడంతో పోలీస్ అధికారి తన యూనిఫామ్‌ను చింపేసి మూడు సింహాలు ఉన్న పోలీస్ క్యాప్‌ను బయటకు విసిరేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బైదాన్ పోలీస్ స్టేషన్‌లో వినోద్ మిశ్రా అనే పోలీస్ ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానిక బిజెపి కౌన్సిలర్ గౌరి భర్త అర్జున్ అనే బిజెపి నేత తన ఇంటి ముందు డ్రైనేజీపై నిర్మాణం చేపట్టాడు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఎఎస్‌ఐ వినోద్ మిశ్రా బిజెపి కౌన్సిలర్ గౌరితో ఎఎస్‌ఐ మాట్లాడుతుండగా వాగ్వాదం జరిగింది. గౌరి భర్త అర్జున్ పలుమార్లు సదరు ఎఎస్ఐని యూనిఫామ్ తీసేసి జాబ్‌లో నుంచి తొలిగిస్తానని హెచ్చరించాడు. దీంతో ఎఎస్‌ఐ వినోద్ కోపంతో రగిలిపోయి తన యూనిఫామ్ చింపేసి అనంతరం పోలీస్ టోపీని విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎనిమిది నెలల క్రితం జరిగిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. బిజెపి నేత అర్జున్‌తో పాటు ఎఎస్‌ఐపై చర్యలు తీసుకున్నామని ఎస్‌పి నివేదిత గుప్తా తెలిపారు.