మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్మాణ దశలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భారీ చోరీ జరిగింది. కమాండ్ కంట్రోల్ ఉన్న సుమారు రూ.10 లక్షల విలువ చేసే 38 కాపర్ బండిల్స్‌ను చోరీ కావడంతో ప్రాజెక్టు మేనేజర్ సురేశ్ కృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. కమాండ్ కంట్రోల్ పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంటున్న క్రమంలో చోరీ జరగడంపై పోలీసులు బాసులు సీరియస్ అవుతున్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు ః
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భారీ చోరీ ఘటనపై నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు సంబంధించి నిర్మాణ సంస్థ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఇంటి దొంగల పనా…? లేక బయటి వ్యక్తులు ఎవరైనా చేశారా..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా చోరీ ఎలా జరిగిందని ప్రాజెక్ట్ అధికారులతో విచారణాధికారులు చర్చించారు. చోరీకి గురైన 38 కాపర్ బండిల్స్ విలువ సుమారుగా పది లక్షల మేరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీటిని ఎవరైన దొంగతనం చేశారా? లేక దాచారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ చోరీ నిజంగానే జరిగిందా లేక నిర్మాణంలో భాగంగా ఎక్కడైనా ఉపయోగించాక లెక్కకు అందడం లేదా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న పోలీస్ కంట్రోల్ సెంటర్‌లోనే దొంగలు చోరీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Copper bundle worth rs 10 lakh stolen in Police bhavan in Hyderabad