మన తెలంగాణ/హైదరాబాద్: బెంగళూరు లో ఓ రేవ్ పార్టీని అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాం చ్ భగ్నం చేశారు. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో ఈ పార్టీ జరిగింది. స్థానిక జిఆర్ ఫామ్ హౌస్‌లో హైదరా బాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించినట్లుగా బెంగళూరు సిసిబికి సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రే వ్ పార్టీలో భారీగా లిక్కర్ తో పాటుగా పెద్ద ఎ త్తున డ్రగ్స్ కూడా యువతీ, యువకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. గోపాల్ రెడ్డికి చెందినదని పోలీసుల విచారణలో వెల్లడైంది.. రేవ్ పార్టీలో పోలీసులు మాదక ద్రవ్యాలను భారీగా గుర్తించారు.
ఈ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ పరి శ్రమకు చెందిన వారు కూడా ఉన్నారని తెలిసింది. ఈ రేవ్ పార్టీలో వైసిపి ఎంఎల్‌ఎ కాకాణి గోవర్థన్ పేరుతో పాస్ ఉన్న కారు కూడా గుర్తిం చినట్లు తెలిసింది. 17 గ్రాముల ఎండిఎంఎ పిల్స్, కొకైన్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసు కున్నారు. మొత్తం ఐదుగురిని సిసిబి అదుపులోకి తీసుకుంది. అయితే, సినీ నటి హేమ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లుగా వదంతులు వచ్చాయి. దీనిపై ఆమె స్పష్టత ఇచ్చారు. ఈ రేవ్ పార్టీలో దాదాపు 71 మంది యువకులు, 30 మంది వరకూ యువతులు పాల్గొన్నట్లు తెలిసింది. వారందరినీ అదుపులోకి తీసుకొని డ్రగ్స్ సేకరించిన వారిని గుర్తించడం కోసం మెడికల్ టెస్టులు చేయించారు. ఈ రేవ్ పార్టీ కోసం హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చి మరీ పలువురు హాజరైనట్లు తెలిసింది.
నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను : టాలీవుడ్ నటుడు శ్రీకాంత్
‘నేను హైద్రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం.. మొన్నేమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లానని అన్నారు. వార్తలు రాసిన వాళ్లు తొందరపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. నేనే షాకయ్యాను. దయచేసి ఎవ్వరూ నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు, పబ్స్‌కు వెళ్లే వ్యక్తిని కాను నేను. ఎప్పుడైనా బర్త్‌డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దు. విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు’ అంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ పేర్కొన్నారు.
నాకు ఎలాంటి సంబంధం లేదు : సినీ నటి హేమ
మరోవైపు ఈ పార్టీలో తెలుగు సినీనటి హేమ కూడా పాల్గొన్నారనే వదంతులు వినిపించాయి. ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. తాను ఎక్కడకు వెళ్లలేదని చెప్పారు. హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఇక్కడ ఫామ్‌హౌస్‌లోనే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. తనపై వస్తోన్న వార్తలను నమ్మవద్దని, అవి ఫేక్ న్యూస్ అని పేర్కొన్నారు. అక్కడ ఎవరు ఉన్నారో తనకు తెలియదని వివరించారు. దయచేసి మీడియాలో తనపై వచ్చే వార్తలను నమ్మకండని హేమ విజ్ఞప్తి చేశారు.
నా పేరు రావడం వెనుక కుట్ర దాగుందన్న మంత్రి కాకాణి
బెంగళూరు రేవ్ పార్టీలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన వారు ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంతో తాజాగా ఆయన స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీలో తన పేరు తెర మీదికి రావడం వెనక కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. ఎంఎల్‌ఎ స్టిక్కర్ ఉందన్న నెపంతో తనపై బురద చల్లడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదంతా టిడిపి నాయకులు చేస్తున్న దుష్ప్రచారమేనని ఆయన తెలిపారు.
ఇదంతా వాళ్ళ కుట్ర రేవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్ తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పేరుతో ఉందని అతను ఎవరో కూడా తనకు తెలియదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టిడిపి నేతలు, వాళ్ళ అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశానన్న మంత్రి కాకాణి కారుపై ఎంఎల్‌ఎ స్టిక్కర్స్ వినియోగించిన వారు జిరాక్స్ కాపీలను వినియోగించారని నా ప్రమేయం లేకుండానే వారు నా పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్స్ వినియోగించారని, దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. బెంగళూరు నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్న ఆయన సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. .తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టం చేశారు.
రేవ్‌పార్టీలో ట్విస్ట్.. హేమ పార్టీలోనే ఉందంటూ పోలీసుల ప్రకటన..!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. టాలీవుడ్ నటి హేమ ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లు కన్నడ మీడియాలో టాక్ వినిపించింది. అయితే మొదట దీనిపై స్పందించిన హేమ తాను రేవ్ పార్టీలో లేనని, హైదరాబాద్ లో ఉన్నానని తెలిపింది. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని తెలిపింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏం సంబంధంలేదని తెలిపింది. తనను ఈ వివాదంలోకి లాగొద్దంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే ఇక్కడే బెంగళూరు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీకి హాజరైన వారి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. అందులో సినీ నటి హేమ ఫోటో కూడా ఉంది. పార్టీలో ఉన్నవారి లిస్టులో నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల ప్రకటనతో నటి హేమ అడ్డంగా బుక్కై పోయారు. కాగా నటి హేమ తెలుగు, తమిళం, మళయాలం సినిమాల్లో నటించింది. వందలాది సినిమాల్లో ఆమె వివిధ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.