‘సిఐ’ బాధితులకు సిపి భరోసా
మాజీ సిఐని 10 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్
బాధితులతో నేరస్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్
మనతెలంగాణ/హైదరాబాద్: అత్యాచారం, అపహరణ కేసులో చంచల్‌గూడా జైల్లో ఉన్న నిందితుడు మాజీ సిఐ నాగేరరావు నుంచి కీలక ఆధారాలు సేకరించేందుకు 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ వనస్థలిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈక్రమంలో మాజీ సిఐ నాగేశ్వరరావుపై నమోదైన రేప్, కిడ్నాప్ కేసులపై పోలీసులు విచారణ చేయనున్నారు. ముఖ్యంగా కస్టడీకి తీసుకున్న తరువాత నిందితుడిని నేర స్థలానికి తీసుకెళ్లి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. అదేవిధంగా నిందితుడి నుంచి 164 స్టేట్‌మెంట్ రికార్టు చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే బాధిత మహిళ, భర్తతో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. వనస్థలిపురం నివాసం నుంచి ఇబ్రహీంపట్నం ప్రమాదం జరిగిన వరకు అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇబ్రహీంపట్నం చెరువులో నాగేశ్వరరావు ఫోన్లు పడేసిన ప్రాంతాన్ని బాధితుడితో కలిసి పరిశీలించారు. ఇప్పటికే ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక, సీసీ టీవీ పుటేజ్ కీలకం కానున్నాయని పేర్కొంటున్నారు. కాగా బాధితురాలికి మరోసారి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని, మాజీ సిఐ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని రాచకొండ సిపి మహేశ్ భగవత్ తెలిపారు.
బాధితులకు సిపి భరోసా ః
వివాహిత మహిళపై అత్యాచారంతో పాటు అపహరణకు పాల్పడిన నిందితుడు మాజీ సిఐ నాగేశ్వరరావు కేసును ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేస్తామని రాచకొండ సిపి మహేశ్‌భగవత్ తెలిపారు. మాజీ సిఐ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని, ఎవరీకి భయపడాల్సిన అవసరం లేదని సిపి భరోసా ఇచ్చారు.ఈ కేసులో ఇప్పటికే పలు ఆధారాలు సేకరించడం జరిగిందని, నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన తెలిపారు. నిందితుడిపై వచ్చిన ప్రతీ ఆరోపణపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, బాధితురాలి ఫిర్యాదుతో సాంకేతికంగా ఆధారాలు సేకరించినట్లు సిపి స్పష్టం చేశారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సిపి సూచించారు.
Cops Petition for seek custody of CI Nageshwar Rao